కరోనా కట్టడే పండగ 

ప్రధానాంశాలు

Updated : 27/09/2021 05:14 IST

కరోనా కట్టడే పండగ 

ఉత్సవాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి

టీకాల్లో రికార్డులు సృష్టిస్తున్నాం

మన్‌ కీ బాత్‌లో ప్రధాని

దిల్లీ: రానున్న రోజులన్నీ పండగల కాలమని, ఈ సమయంలో అందరూ కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకొని, ‘రక్షిత వలయం’లో ఉండేలా చూడాలని కోరారు. ఆదివారం జరిగిన ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగంలో ప్రధానంగా కరోనా నివారణ చర్యలను ప్రస్తావించారు. అసత్యంపై మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు సాధించిన విజయాన్ని దేశమంతటా జరుపుకొంటారని, ఇదే సమయంలో కరోనాపై యుద్ధాన్ని కూడా ప్రజలు గుర్తించుకోవాలని కోరారు. ‘‘మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరికీ కీలక పాత్ర ఉంది. తమ వంతు వచ్చినప్పుడు టీకా వేసుకోవడంతో పాటు, ఏ ఒక్కరూ టీకా వేసుకోకుండా ఉండకూడదన్న లక్ష్యంతో పని చేయాలి. టీకాల్లో ‘టీం ఇండియా’ ప్రతి రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచం వీటిపై మాట్లాడుకుంటోంది’’ అని తెలిపారు. దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేశారు.

ఆర్థిక పారిశుద్ధ్యంపై దృష్టి

మరుగుదొడ్లు నిర్మించి పేదల గౌరవాన్ని కాపాడామని, ఇప్పుడు ఆర్థిక పారిశుద్ధ్యాన్ని తీసుకువచ్చి వారి హక్కులు పరిరక్షిస్తామని మోదీ చెప్పారు. ‘‘అవినీతిని అరికట్టడమే ఆర్థిక పారిశుద్ధ్యం. జనధన్‌ ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తుండడం కారణంగా అవినీతి తగ్గింది. గ్రామాల్లో కూడా డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి. ఇది కూడా అవినీతి నిర్మూలనకు సహకరిస్తుంది. పరిశుభ్ర, పారదర్శక ఆర్థిక వ్యవస్థ అవతరణకు దారి తీస్తుంది’’ అని వివరించారు.

...ఇదే మన సంస్కృతి

దేనినైనా చేయగలం అన్నదే మన సంస్కృతి కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇటీవల ఎనిమిది మంది దివ్యాంగులు సియాచిన్‌ గ్లేసియర్‌లోని కుమార్‌ శిఖరాన్ని అధిరోహించడాన్ని ప్రస్తావించారు. ‘చేయగలం అన్న సంస్కృతి’, ‘చేయగలం అన్న అంకిత భావం’,  ‘చేయగలం అన్న దృక్పథం’ ఉంటే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవచ్చునని చెప్పారు. ప్రధాని తన ప్రసంగంలో సంప్రదాయ వైద్యాన్ని ప్రస్తావించారు. ఈ రంగంలో ప్రయోగాలు చేస్తూ రాణిస్తున్నవారి గురించి వివరించారు.

ఒడిశా వాసికి అభినందనలు

ఒకటిన్నర ఎకరాల్లో ఔషధ మొక్కలు పెంచడంతో పాటు, వాటి వివరాలను సమగ్రంగా రాస్తున్న ఒడిశా వాసిని ప్రధాని అభినందించారు. కలహండి జిల్లా నందోల్‌కు చెందిన పతయత్‌ సాహూ వ్యవసాయం-ఆరోగ్య రంగాలను అనుసంధానం చేసేలా ఔషధ మొక్కలను పెంచుతున్నారని.. వాటి ఉపయోగాన్ని దస్త్రాల్లో పొందుపరుస్తున్నారని చెప్పారు.

విజయనగరం మహిళకు ప్రశంసలు

గుజరాత్‌లోని ఆనంద్‌లో ఆయుర్వేద, వనమూలికల ఉత్పత్తులు తయారు చేస్తున్న తెలుగు మహిళ సాయి సుధ చేబ్రోలును ప్రధాని మోదీ ప్రశంసించారు. విజయనగరానికి చెందిన ఆమె అక్కడికి వెళ్లి అంకుర సంస్థ (స్టార్టప్‌)ను ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే విజయం సాధించారు. అక్కడి మెడి-హబ్‌ టీబీఐ ఇంక్యుబేటర్‌ ఆమెకు అన్ని విధాలుగా సహకరించింది. తన సంస్థలో కూడా అమె మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన