మేం వచ్చాకే ఆరోగ్య రంగానికి చికిత్స

ప్రధానాంశాలు

Updated : 26/10/2021 18:10 IST

మేం వచ్చాకే ఆరోగ్య రంగానికి చికిత్స

 రూ.64,000 కోట్ల మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని

ఆయుష్మాన్‌ భారత్‌ కింద కొత్త మిషన్‌

నాలుగేళ్లలో ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ బలోపేతం: మోదీ

వారణాసి: అత్యంత కీలకమైన ఆరోగ్య రంగాన్ని మునుపటి ప్రభుత్వాలు విస్మరించి, దానినొక ఆదాయ వనరుగా భావించి అవినీతికి పాల్పడ్డాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. అన్ని కర్మలకూ మూలం ఆరోగ్యమేననీ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చేసే పెట్టుబడులు ఎల్లప్పుడూ ఉత్తమమైనవిగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలాకాలం పాటు ఆరోగ్య రంగంలో చేయాల్సినంత చేయలేదని విమర్శించారు. రూ.64,000 కోట్లతో దేశవ్యాప్తంగా చేపట్టే ‘ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌’ను, రూ.5,200 కోట్లతో తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద చేపడుతున్న కొత్త కార్యక్రమం ద్వారా యూపీలోనే కాకుండా దేశం మొత్తంమీద ఆరోగ్య రంగ పరిస్థితులు బలోపేతమవుతాయని చెప్పారు. భవిష్యత్తులో ఏమైనా మహమ్మారులు విరుచుకుపడినా ఎదుర్కొనే సన్నద్ధత కలిగి ఉండేందుకు ఇది దోహదం చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల గ్రామాల్లో తగినన్ని ఆసుపత్రులు లేవని, వైద్యులూ సరిపడా స్థాయిలో లేరని చెప్పారు. రోగ నిర్థారణ కేంద్రాలూ అరకొరగానే ఉన్నాయన్నారు. ఈ లోపాలన్నింటినీ సరిచేసేందుకు కొత్త మిషన్‌ వీలు కల్పిస్తుందని చెప్పారు.

మూడు దశల్లో రూపు మారుస్తాం

రాబోయే నాలుగేళ్లలో గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం తమ లక్ష్యమని మోదీ వివరించారు. ‘‘పథకంలో మూడు ప్రధానాంశాలున్నాయి. మొదటిది- రోగ నిర్థారణ, చికిత్సకు గ్రామాలు, పట్టణాల్లో విస్తృత సదుపాయాలు కల్పించడం. రెండోది- పరీక్షా కేంద్రాలను అనుసంధానం చేయడం. మూడోది- ప్రస్తుతం ఉన్న లేబొరేటరీలను మెరుగుపరచడం. కొత్తగా 15 బయోసేఫ్టీ లెవెల్‌-3 ప్రయోగశాలలు అందుబాటులోకి రానున్నాయి. చికిత్స నుంచి సంక్లిష్టమైన పరిశోధన వరకు పూర్తిస్థాయి వ్యవస్థను ఈ పథకం కింద దేశం నలుమూలలా అభివృద్ధి చేయబోతున్నాం. ఆరోగ్య సదుపాయాలు మెరుగుపడితే వైద్యులకు ఉపాధి లభిస్తుంది. అనుబంధ రంగాలు విస్తరిస్తాయి. ఒక పెద్ద ఆసుపత్రి వస్తే దాని చుట్టూ నగరం అభివృద్ధి చెందుతుంది’’ అని చెప్పారు. ఈ మిషన్‌ కింద 17,788 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు; 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటవుతాయి. జాతీయ ఆరోగ్య సంస్థ, కొత్తగా నాలుగు జాతీయ స్థాయి వైరాలజీ సంస్థలు వంటివి వస్తాయి.

ఒకేసారి 9 వైద్య కళాశాలలు ప్రారంభం

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.2,329 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన తొమ్మిది వైద్య కళాశాలల్ని ప్రధాని మోదీ సోమవారం వర్చువల్‌గా ఒకేసారి ప్రారంభించారు. సిద్ధార్థనగర్‌లో పర్యటించిన ఆయన అక్కడి వైద్య కళాశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు సొంత కుటుంబాల ఖజానాలు నింపుకొని ఆదాయాన్ని పెంచుకునేందుకు తహతహలాడాయని, తమ ప్రభుత్వం మాత్రం పేదల డబ్బును పొదుపు చేసి, వసతులు కల్పించే దిశగా అడుగులు వేసిందని ఉద్ఘాటించారు. 2014 కంటే ముందు దేశంలో 90,000 వైద్య సీట్లు అందుబాటులో ఉంటే గత ఏడేళ్లలోనే తాము మరో 60,000 పెంచామని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో ఔషధాలు, నియామకాలు, బదిలీల రూపంలో యూపీలో కొన్ని ‘వారసత్వ పాలన కుటుంబాలు’ బాగుపడినా సాధారణ ప్రజలు నలిగిపోయారని పరోక్షంగా సమాజ్‌వాదీపై విమర్శలు చేశారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన