close

తాజా వార్తలు

నారీ.. నిర్మాణసారథి 

సవాళ్లను అధిగమిస్తూ వడివడిగా అడుగులు

నిర్మాణ రంగంలో ఒడుదొడుకులు అధికం.. మార్కెట్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. పురుషుల ఆధిపత్యం ఉండే రంగమిది. చుట్టూ ఎన్నో సవాళ్లు.. వీటిని అధిగమిస్తూ అడుగులు వేస్తున్నారు కొందరు మహిళా డెవలపర్లు. తద్వారా కొత్త కెరీర్‌కు బాటలు వేస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

కుటుంబ వారసత్వంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే మహిళలు కొందరైతే, స్వతహాగా తమ అనుభవాలతో ఈ రంగాన్ని ఎంచుకున్నవారు ఇంకొందరు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా డెవలపర్లతో ‘ఈనాడు’ మాట్లాడింది.

జీఎస్‌టీ, రెరాతో ముందే రావాల్సి వచ్చింది..  
- శివానీరెడ్డి, నిర్వాహక భాగస్వామి, రాంరెడ్డి కన్‌స్ట్రక్షన్స్‌

నాన్న రాంరెడ్డి 15 ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నారు. చిన్నతనం నుంచి చూస్తుండటంతో ఈ రంగంపై ఆసక్తి ఉంది. విల్లామేరీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాక ఫుణె సింబయాసిస్‌ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ అండ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేశాను. రెండేళ్లపాటు ఉద్యోగం చేసి నిర్మాణ రంగంలోకి రావాలనేది నా ఆలోచన. చదువు పూర్తయ్యే సమయానికి జీఎస్‌టీ, రెరా కొత్తగా వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నవారికి సైతం ఇవి కొత్తే. వారితోపాటు నేనూ నేర్చుకునేందుకు ఇదే సరైన సమయం అన్పించింది. ఉద్యోగం ఆలోచన మాని మా సంస్థలోనే నిర్వాహక భాగస్వామిగా చేరిపోయాను. సర్వీస్‌ఛార్జి, జీఎస్‌టీ ఇలా అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్నా. ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైనా.. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌(ట్రెడా) నన్ను ప్రోత్సహించింది. ట్రెడాలో తొలి మహిళా సభ్యురాలిని నేనే. ఎక్కువ అస్థిరత ఉన్న రంగం కావడంతో మహిళలు మొదటి ఎంపికగా దీన్ని చూడటం లేదు. నడుస్తున్న ప్రాజెక్ట్‌లో ఏదైనా న్యాయపరమైన సమస్యలు ఎదురైతే ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీటన్నింటిని తట్టుకుని నిలబడాలి. అందుకే మొదటగా ఈ రంగంలోకి వచ్చిన మహిళలు పెద్దగా కన్పించరు. మా నాన్న ఉండటంతో నాకు సులభమైంది. వారసత్వంగా ఎక్కువమంది ఇప్పుడిప్పుడే బాధ్యతలు చేపడుతున్నారు. వేరే బిల్డర్లు మా అమ్మాయిని సైతం ఈ రంగంలోకి తీసుకొస్తాను అన్నప్పుడు చాలా గర్వంగా అన్పించేది. నేను అక్కౌంట్స్‌, రెరా, జీఎస్‌టీతో పాటు సైట్‌ బాధ్యతలు చూస్తుంటాను. 

ఇంటి కల నెరవేర్చేలా..  
- బండారు కవిత, ఎండీ, శాన్వీ ప్రాపర్టీస్‌

నేను ఎంఎస్సీ చేసి రెండేళ్లపాటు అధ్యాపకురాలిగా పనిచేశాను. వివాహమయ్యాక మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డాం. భర్త అక్కడ ఐటీ ఉద్యోగి. ఇండియాకు తిరిగి వచ్చాక ఏదైనా వ్యాపారం చేయాలనేది ఆలోచన. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. నిర్మాణ రంగంలోకి వస్తే మా కలలతో పాటు వారి కలలను నెరవేర్చినవారమవుతామని 2012లో అడుగుపెట్టాం. నాణ్యతతో వినియోగదారుడు పూర్తి సంతృప్తి చెందేలా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని భాగస్వాములతో కలిసి తొలి ప్రాజెక్ట్‌ చేపట్టాం. పెట్టుబడి నష్టపోకుండా క్రమక్రమంగా ఎదగాలనే ఉద్దేశం మాది. దీనికి కట్టుబడి తర్వాత సొంతంగా ప్రాజెక్ట్‌లు చేపట్టాం. ఏ మాత్రం అవగాహన లేని రంగం కావడంతో ఆరంభంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మేము అడుగుపెట్టిన సమయానికి మార్కెట్‌ పూర్తి అనిశ్చితిగా ఉంది. ధరలు పడిపోతాయనే ప్రచారం ఒకవైపు. భూమి టైటిల్‌ దగ్గర్నుంచి ఎన్నో సమస్యలు.. భూముల ధరల్లో హెచ్చుతగ్గులు మరో పెద్ద ఛాలెంజ్‌. పనివాళ్ల కొరత ఉండేది. బడ్జెట్‌లో అనుకున్న సమయానికి ఇవ్వడం ఇలా ఎన్నో సవాళ్లు. ఒక్కోటి అధిగమిస్తూ ఇప్పటివరకు గచ్చిబౌలి, హయత్‌నగర్‌లో నాలుగు ప్రాజెక్ట్‌లు పూర్తిచేశాం. కొనుగోలుదారులు పూర్తి సంతృప్తితో ఉన్నారు. కుటుంబీకుల తోడ్పాటు ఉంటే మహిళలు సైతం ఈ రంగంలో రాణించవచ్చు. ఆత్మవిశ్వాసంతో విజయాలు అందుకోవచ్చు. భారీ లాభాలు గడించవచ్చు అని అడుగుపెడితే మాత్రం కష్టమే.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.