close

తాజా వార్తలు

‘గణతంత్రం’లో ఏపీ శకటానికి బ్రేక్‌ 

రిపబ్లిక్‌ దినోత్సవాల్లో  ప్రదర్శనకు అవకాశం ఇవ్వని రక్షణశాఖ 
అద్భుతంగా ఉన్నా ఎందుకు ఎంపిక చేయలేదో? 
ఏపీభవన్‌ అధికారుల ఆవేదన 
ఈనాడు - దిల్లీ

ణతంత్ర దినోత్సవంలో (జనవరి 26) ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్‌ శకటం ఎంపిక కాలేదు. ఆ రోజు శకటాలను ప్రదర్శించాలనుకొనే రాష్ట్రాలకు కేంద్ర రక్షణశాఖ గత ఆగస్టులో ఆహ్వానాలు పంపింది. గాంధీజీ జీవితంతో సంబంధం ఉన్న ఇతివృత్తాలతో వాటికి రూపకల్పన చేయాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయవాడ గాంధీకొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఇతివృత్తంతో డ్రాయింగ్స్‌ తయారు చేసి పంపింది. చివరకు దీన్ని ఎంపిక చేయలేదనడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ఈ విషయాన్ని తొలి నుంచీ చూస్తూ వచ్చిన ఏపీ భవన్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. 
విజయవాడలోని గాంధీ కొండపై గాంధీ పీస్‌ ఫౌండేషన్‌ నిర్మించిన 52 అడుగుల స్తూపం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ ఉద్యమానికి ప్రబల గుర్తింపుగా దాన్ని నిర్మించారు. తిలక్‌ పీస్‌ ఫౌండేషన్‌కు కోటి రూపాయలు సమీకరించే లక్ష్యంతో ప్రజలు చరఖాలు కొనుగోలు చేసి స్వదేశీ ఉద్యమంలో పాల్గొనాలని ఈ కొండమీద నుంచే గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. 20 లక్షల చరఖాలు కొనుగోలు చేయాలని ఆ రోజు లక్ష్యంగా పెట్టుకున్నారు. గాంధీజీ పిలుపును స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు మాగంటి అన్నపూర్ణ, యలమంచిలి సత్యవతి అనే ఓ యువ వితంతువు తమ బంగారాన్ని అంతా గాంధీజీకి విరాళంగా సమర్పించారు. ఈ విషయాలన్నీ 1927 అక్టోబర్‌ 27నాటి యంగ్‌ ఇండియా పత్రికలో ప్రచురించారు కూడా. 
ఉద్యమ దీక్ష.. ఖద్దరు రక్ష 
మహాత్మాగాంధీ పిలుపునందుకొని శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు గ్రామస్థులు స్వదేశీ ఉద్యమ దీక్ష బూని ఖాదీ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. ఈ గ్రామ ప్రజలు ఇప్పటికీ నిజమైన గాంధీ స్ఫూర్తిని కొనసాగిస్తూ నాణ్యమైన ఖాదీ ఉత్పత్తులను తయారు చేస్తూ జాతీయ, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది నిజమైన ‘మేకిన్‌ ఆంధ్రప్రదేశ్‌’, ‘మేకిన్‌ ఇండియా’ ఉద్యమం. 
పల్లిపాడు.. సబర్మతికి ఆశ్రమానికి జోడు 
అంటరానితనం రూపుమాపే సర్వోదయ ఉద్యమంలో భాగంగా అప్పట్లో గాంధీజీ నెల్లూరు జిల్లా పల్లిపాడుకు విచ్చేశారు. ఆ గ్రామంలో అధికంగా ఉన్న అంటరానితనాన్ని రూపుమాపడానికి సబర్మతి ఆశ్రమం తరహాలో పినాకిని నది ఒడ్డున సత్యాగ్రహ ఆశ్రమం నిర్మించాలని ఆయన స్థానిక నాయకులకు సూచించారు. ఆ సూచనల మేరకు నిర్మించిన సత్యాగ్రహ ఆశ్రమం 1921లో ప్రారంభమైంది. 1929 మేలో గాంధీజీ తన సతీమణి కస్తూర్బాతో కలిసి ఈ ఆశ్రమాన్ని సందర్శించారు కూడా. 
ముందు ప్రశంసించారు.. 
గాంధీజీ స్ఫూర్తిని ఇప్పటికీ ముందుకు తీసుకెళ్తున్న ఈ మూడు ఘట్టాలను గణతంత్ర వేదికగా చాటాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇతివృత్తాలను రక్షణశాఖ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఒప్పుకున్నాక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్రీడీ నమూనా, ఇతివృత్త సంగీతాన్ని రూపొందించింది. చివరి రౌండ్‌ వరకూ ఆంధ్రప్రదేశ్‌ నమూనా పోటీలో ఉంది. అధికారులు అంతా బాగుంది ప్రశంసించారు కూడా. త్వరలో విషయం చెబుతామన్న రక్షణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఎన్నో రాష్ట్రాలు సమర్పించిన నమూనాల కంటే ఆంధ్రప్రదేశ్‌ నమూనా చాలా అద్భుతంగా వచ్చిందని ఎందుకు ఎంపిక కాలేదో అర్థం కాలేదని ఏపీ భవన్‌ అధికారులు విచారం వ్యక్తం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.