close

తాజా వార్తలు

కుప్పకూలిన తెదేపా కంచుకోటలు! 

చంద్రబాబు సొంత స్థానం కుప్పంలోనూ తగ్గిన మెజారిటీ 
8, 9 సార్లు గెలిచిన చోటా ఈసారి సైకిల్‌ చతికిల 
తెదేపాకు గట్టి పట్టున్న  ప్రాంతాలపై వైకాపా సుడిగాలి

ఈనాడు, అమరావతి: వైకాపా సునామీలో తెలుగుదేశం కంచుకోటలు కుప్పకూలిపోయాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఏడెనిమిది సార్లు విజయపరంపర కొనసాగించిన నియోజకవర్గాల్లో సైతం ఈసారి ఓటమి చవిచూడక తప్పలేదు. పెట్టని కోటగా నిలిచిన కుప్పంలోనే తొలి రెండు రౌండ్లలో తెదేపా విలవిల్లాడాల్సి వచ్చింది. తొమ్మిదిసార్లు విజయాన్ని అందించిన పెనుకొండ, ఎనిమిదిసార్లు గెలిచిన నందిగామలోనూ సైకిల్‌ చతికిలపడింది. ఉత్తరాంధ్రలో తెదేపాకు గట్టి పట్టున్న నియోజకవర్గాల్లోనూ ఫ్యాను గాలి జోరుగా వీచింది. 1983 నుంచి ఇప్పటిదాకా ఏడుసార్లు గెలిచిన శృంగవరపు కోట, విజయనగరం, పాయకరావుపేట, నర్సీపట్నం వంటి నియోజకవర్గాల్లో కూడా ఈ దఫా పరాభవం తప్పలేదు. సతివాడలో ఏకంగా ఆరుసార్లు, నెల్లిమర్లలో ఒకసారి గెలిచిన నారాయణస్వామి నాయుడూ ఇప్పుడు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తెలుగుదేశానికి గతంలో ఆరుసార్లు గెలుపునిచ్చిన పార్వతీపురం.. ఈ ఎన్నికల్లో వైకాపాకు తొలి విజయాన్ని అందించిన నియోజకవర్గంగా నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో 8సార్లు విజయం సాధించిన తెదేపా ఇప్పుడు పరాజయం పాలైంది. అశోకగజపతిరాజు విజయనగరం స్థానం నుంచి అయిదుసార్లు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టగా.. ఈసారి అక్కడ నుంచి పోటీచేసిన ఆయన కుమార్తె అదితి ఓటమి చవిచూశారు. పొన్నూరు నుంచి అయిదుసార్లు గెలిచిన నరేంద్రకుమార్‌కు ఈసారి ఓటమి తప్పలేదు. ఏడుసార్లు గెలుచుకున్న శ్రీకాళహస్తిలోనూ తెదేపా పరాజయం పాలైంది. 
లోక్‌సభ స్థానాల్లోనూ వైకాపా దూకుడు 
తెలుగుదేశం గతంలో అయిదు నుంచి ఏడుసార్లు విజయం సాధించిన లోక్‌సభ నియోజకవర్గాలు కూడా ప్రస్తుత ఎన్నికలో వైకాపా వశమయ్యాయి. చిత్తూరు లోక్‌సభ నుంచి తెదేపా వరసగా అయిదుసార్లు విజయం సాధించగా.. ఈ ఎన్నికల్లో వైకాపా గాలి వీచింది. అమలాపురం, కాకినాడ, అనకాపల్లి తదితర నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జయకేతనం ఎగరేసింది. శ్రీకాకుళంలో తెదేపా అతి కష్టం మీద పరువు కాపాడుకుంది. 
పట్టు నిలబెట్టిన తెదేపా 
హిందూపూర్‌లో ఇప్పటికే 9సార్లు విజయం సాధించిన తెదేపా పదో పర్యాయమూ పట్టు చాటింది. ఇక్కడి నుంచి ఎన్టీ రామారావు 3 సార్లు, ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ ఒక్కోసారి గెలిచారు. మళ్లీ ఇప్పుడూ బాలకృష్ణనే విజయం వరించింది. టెక్కలి, ఇచ్ఛాపురం మరోసారి తెదేపా వశమయ్యాయి. పెద్దాపురం, ఉండి తదితర నియోజకవర్గాల్లోనూ తెదేపా అభ్యర్థులకే విజయం దక్కింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.