close

తాజా వార్తలు

పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల అప్పు

ఎంఎస్‌ఎమ్‌ఈలకు రుణ పరిమితి రెట్టింపు
ఆర్‌బీఐ కమిటీ సిఫారసు

దిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎమ్‌ఈలు) పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రెట్టింపు చేసేందుకు ఆర్‌బీఐ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు రుణం పొందే వీలుండగా.. దానిని రూ.20 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. ముద్రా పథకం, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు, ఎంఎస్‌ఎమ్‌ఈల విభాగం కిందకు వచ్చే సంస్థలకు ఈ రుణ పరిమితి పొడిగింపు వర్తించనుంది. కమిటీ చేసిన ఈ సిఫారసుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపితే.. 2010 జులై 1 నాటి సర్క్యులర్‌లో సవరణలు చేయాల్సి వస్తుంది. గరిష్ఠంగా రూ.10 లక్ష వరకు పూచీకత్తు లేకుండా రుణం ఇవ్వొచ్చని ఈ సర్క్యులర్‌ చెబుతోంది. ఎంఎస్‌ఎమ్‌ఈ రంగానికి సంబంధించి ప్రస్తుత విధానాలపై సమీక్షించేందుకు ఆర్‌బీఐ ఓ కమిటినీ ఏర్పాటుచేసింది. సెబీ మాజీ ఛైర్మన్‌ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులు గల ఈ కమిటీ మంగళవారం తన నివేదికను సమర్పించింది. శుక్రవారం ఆర్‌బీఐ ఈ నివేదికను ప్రజలకు అందుబాటులో తేనుంది. ఎంఎస్‌ఎమ్‌ఈల ఆర్థిక సుస్థిరతకు పలు దీర్ఘకాలిక మార్గాలను కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.

పెట్టుబడి కాదు.. టర్నోవరే ప్రామాణికం
ఎంఎస్‌ఎమ్‌ఈల నిర్వచనాన్ని మార్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో ఆర్‌బీఐ నిపుణుల కమిటీ ఈ సిఫారసులు చేయడం గమనార్హం. 2006 నిర్వచనం ప్రకారం.. తయారీ రంగంలో రూ.25 లక్షల్లోపు పెట్టుబడి పెడితే సూక్ష్మ సంస్థలుగా పేర్కొంటారు. రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య అయితే చిన్న సంస్థలు, రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య అయితే మధ్య తరహా సంస్థలుగా పరిగణిస్తారు. సేవల కార్యకలాపాల విషయానికొస్తే రూ.10 లక్షల వరకైతే సూక్ష్మ, రూ.10 లక్షల నుంచి రూ.2 కోట్ల మధ్య అయితే చిన్న, రూ.2 కోట్లు- రూ.5 కోట్ల మధ్య అయితే మధ్య తరహా సంస్థలుగా భావిస్తారు. కొత్త ముసాయిదా ప్రకారం తయారీ, సేవా యూనిట్లను వేర్వేరుగా పరిగణించడం లేదు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల వర్గీకరణకు పెట్టుబడి కాకుండా టర్నోవరును లెక్కలోకి తీసుకోనున్నారు. రూ.5 కోట్ల వరకు టర్నోవరు ఉంటే సూక్ష్మ సంస్థలుగా, రూ.75 కోట్ల వరకైతే చిన్న సంస్థలు, రూ.250 కోట్ల వరకైతే మధ్య తరహా సంస్థలుగా నిర్వచించారు. కొత్త ముసాయిదాలో చేసిన ఈ ప్రతిపాదనకు ఇంకా ఆమోద ముద్ర పడాల్సి ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.