close

తాజా వార్తలు

భార్య ఉరేసుకుంటుంటే  వీడియో తీశా

హత్య చేసి ఉంటారని తల్లిదండ్రుల ఆరోపణ

\

అమీర్‌పేట: ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తమ కుమార్తెను హత్య చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఎస్సార్‌నగర్‌ పోలీసులు, మహిళ తల్లిదండ్రుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సింగరేణి ప్రాంతంలోని రొట్టెమాకురేవు గ్రామానికి చెందిన సుంచు అరుణ(31), మంచిర్యాల జిల్లా తాండూరు మండలం, రేచిని గ్రామానికి చెందిన శ్రీనివాస్‌(35) 2007 ఆగస్టు 20వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు. పాల్వంచలోని కేఎల్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుకొనే రోజుల్లో వీరు ప్రేమించుకొన్నారు. శ్రీనివాస్‌ బోరబండ సైట్‌-3లోని గురుకుల పాఠశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, అరుణ భద్రాచలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. వీరికి 11, 8 సంవత్సరాల వయసుగల ఇద్దరు కుమారులున్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ భర్తతో అరుణ తరచూ ఘర్షణ పడుతుండేది. ఇటీవల వేసవి సెలవుల నిమిత్తం పిల్లలను తీసుకుని అరుణ పుట్టింటికి వెళ్లింది. తిరిగి ఇటీవల బోరబండలోని భర్త వద్దకు వచ్చింది. మళ్లీ వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. గురువారం రాత్రి తన భార్య ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని శుక్రవారం ఉదయం భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అరుణ ముక్కు, నోటి నుంచి రక్తం కారడం, ముఖంపై గాయాలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది.

భార్య ఉరేసుకుంటుంటే  వీడియో తీశా: శ్రీనివాస్‌ 

తనతో ఘర్షణ పడిన భార్య ఉరేసుకుంటానని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుందని, బెదిరించడానికే అలా చేస్తోందని కిటికీలో నుంచి తాను చరవాణిలో వీడియో తీయడంతో పాటు ఫొటోలు తీశానని శ్రీనివాస్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. భార్యను రక్షించకపోగా, తాను వెళ్లి నిద్రపోయానని, ఉదయాన్నే చూశానని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. అరుణ ముఖంపై గాయాలు, రక్తం కారిన గుర్తులు ఉండటానికి కారణాన్ని పోలీసులు మరోలా చెబుతున్నారు. భార్య ఉరేసుకున్న విషయాన్ని గుర్తించిన శ్రీనివాస్‌ కర్రతో గడియ తీసి, లోనికి వెళ్లి ఆమెను దింపబోగా బరువుకు కిందపడటంతో ముఖంపై గాయాలై ఉంటాయంటున్నారు. కుమార్తె మరణం విషయాన్ని తెలుసుకున్న అరుణ తల్లిదండ్రులు రాజయ్య, రాజమ్మ తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శనివారం ఫిర్యాదు చేయగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.