close

తాజా వార్తలు

ఎగసిపడిన క్రికెట్‌ కెరటం.. ఈ రాయుడు

‘కష్టాల్లో ఉన్న జట్టును ఒడ్డుకు చేర్చాలన్నా.. జట్టు భారీ స్కోరు సాధించాలన్నా నాలుగో స్థానంలో దిగే బ్యాట్స్‌మన్‌ ఎంతో కీలకం. అంబటి రాయుడు ఆ స్థానానికి సరైన ఆటగాడు.’ గతంలో రాయుడు గురించి భారత కెప్టెన్‌ కోహ్లీ చేసిన వ్యాఖ్యలివి. ‘ రాయుడుకు నేను టాప్‌ రేటింగ్‌ ఇస్తాను. ఎందుకంటే అతను పేసర్లు, స్పిన్నర్లనూ సమర్థంగా ఎదుర్కోగలడు’ ధోని చెప్పిన మాటలవి. కానీ, భారత్‌ తరఫున ప్రపంచకప్‌ జట్టులో ఆడాలని ఎంతో ప్రయత్నించిన రాయుడుకు నిరాశే మిగిలింది. కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులతో తన ప్రయాణాన్ని కొనసాగించిన రాయుడు నేడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతని ప్రయాణం ఎలా సాగిందంటే.. 


గత పదేళ్లలో యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసి టీమిండియాకు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ జట్టు నుంచి దూరమయ్యాక ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా ఎక్కువ రోజులు అక్కడ  నిలవలేకపోయారు. కేఎల్ రాహుల్, అజింక్య రహానె, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, ధోనీ..ఇలా ఆ స్థానంలో పరీక్షించారు. అతను మాత్రమే దాన్ని భర్తీ చేయగలడనే రీతిలో రాయుడు ప్రశంసలు దక్కించుకున్నాడు. కొన్ని నెలల ముందు వరకు ఎవరిని అడిగినా నాలుగో స్థానంలో రాయుడే సరైనోడు అనేవారు. ప్రపంచకప్‌లో అతనికి చోటు ఖాయం అనుకున్నారంతా. కానీ ఆస్ట్రేలియా సిరీస్‌లో విఫలమవ్వడం, అతనిలో నిలకడ లోపించడం వంటి కారణాలతో అతనికి చోటు కల్పించలేదన్నది సెలెక్టర్ల అభిప్రాయం. ఇది అతనిని ఎంతో నిరాశకు గురిచేసింది. 

ప్రపంచకప్‌ జట్టులోని ఆటగాళ్లు గాయాలతో టోర్నీ నుంచి దూరమవుతుంటే పిలుపు వస్తుందని ఆశించిన అతనికి చుక్కెదురైంది. తొలుత రాయుడును కాదని విజయ్‌శంకర్‌ను ప్రపంచకప్‌ జట్టులో ఎంపికచేశారు. తర్వాత అతన్ని స్టాండ్‌ బై ప్లేయర్‌గా ప్రకటించారు. ప్రపంచకప్‌లో రెండు మ్యాచులాడిన ధావన్‌ గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పంత్‌కు అవకాశం లభించింది. విజయ్‌శంకర్‌ కూడా గాయం కారణంగా స్వదేశం బయలుదేరాడు. ఈ సారైన అవకాశం వస్తుందనుకున్న అతనికి నిరాశే మిగిలింది. విజయ్‌శంకర్‌ స్థానంలో ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్‌ అగర్వాల్‌కు చోటు కల్పించారు. దీంతో మనస్తాపానికి గురయ్యాడో లేదా వేరే ఇతర కారణాలతోనో అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు.


ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌
గుంటూరులో పుట్టిన రాయుడు 16 ఏళ్లకే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌ను ప్రారంభించాడు. 2002లో హైదరాబాద్ తరఫున ఆడాడు. 2002-03 రంజీ ట్రోఫీలో 698 పరుగులతో అత్యధిక పరుగుల సాధించిన వారి జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు. ఈ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో 210, 159* పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. రంజీలో డబుల్‌ సెంచరీ సాధించిన అతి పిన్నవయస్కుడిగానూ రికార్డులకెక్కాడు. తర్వాత ఏడాది వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ సిరీస్‌లకు ‘ఇండియా-ఏ’ జట్టులో ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో 87 సగటుతో రాణించిన అతని గురించి ‘టీమిండియా భవిష్యత్తు ఆటగాడి’గా వార్తలు వచ్చాయి. తర్వాత ఏడాది అండర్‌-19 భారత్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సెమీఫైనల్లో ఓడి టోర్నీ నుంచి భారత్‌ నిష్క్రమించాల్సి వచ్చింది. జట్టులో దినేశ్‌ కార్తీక్‌, సురేశ్‌  రైనా, ఆర్‌పీ సింగ్, రాబిన్‌ ఉతప్ప ఉండటం విశేషం. ఈ టోర్నీలో రాయుడు కేవలం 24.83 సగటుతో మాత్రమే పరుగులు సాధించాడు. 2004-05లోనూ రంజీ ట్రోఫీలో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హైదరాబాద్‌ కోచ్‌తో విభేదాల కారణంగా 2005-06 సీజన్‌లో ఆంధ్రా జట్టు తరఫున ఆడాడు. ఈ సీజన్‌లో జరిగిన ఆంధ్రా-హైదరాబాద్‌ మ్యాచ్‌లో హైదరాబాదీ ప్లేయర్‌ అర్జున్‌ యాదవ్‌పై దాడి చేసి వార్తల్లో నిలిచాడు. తర్వాత ఏడాది తిరిగి హైదరాబాద్‌ జట్టుకు వచ్చినా మోకాలి గాయంతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. 


జట్టులో చోటు కోసం..
2012లో ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు రాయుడుని ఎంపిక చేశారు. మనోజ్‌ తివారీకి గాయం అవ్వడంతో అతనికి అవకాశం వచ్చింది. కానీ అతనికి తుది జట్టులో స్థానం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా 2012-13 రంజీ ట్రోఫీ, 2013 ఇరానీ కప్‌, దేవ్‌ధర్‌ ట్రోఫీలో రాణించాడు. 2013లో ధోనీకి గాయమవ్వడంతో వెస్టిండీస్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ ఈసారి కూడా అతనికి తుది జట్టులో అవకాశం రాలేదు. సీనియర్‌ ఆటగాళ్లు విశ్రాంతి ఇవ్వడంతో జింబాబ్వేతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. 2013 జులై 24న భారత్‌ తరఫున జింబాబ్వేపై తొలి వన్డే ఆడాడు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాయుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కోహ్లీతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో రాయుడు అజేయంగా 63 పరుగులు సాధించాడు.


 

పడుతూ లేస్తూ..
తర్వాత జరిగిన ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ సిరీస్‌లకు రాయుడు ఎంపికయ్యాడు. కానీ, నాలుగు సిరీస్‌ల్లో అతనికి అవకాశం దక్కింది కేవలం రెండు మ్యాచ్‌లే. 2014లో జరిగిన శ్రీలంక సిరీస్‌లో తన తొలి శతకాన్ని బాదాడు. తర్వాత అతనికి అవకాశాలు వచ్చినా నిలకడగా రాణించలేకపోయాడు. 2015లో జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ సిరీస్‌లో 19.33 సగటుతో పేలవ ప్రదర్శన చేశాడు. అయినా సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచి 2015 ప్రపంచకప్‌ జట్టులో స్థానం కల్పించారు. కానీ, తుది జట్టులో అతనికి అవకాశం దక్కలేదు. తర్వాత జరిగిన బంగ్లాదేశ్‌ సిరీస్‌లో విఫలమైనా జింబాబ్వేపై రాణించి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందుకున్నాడు. ఈ సిరీస్‌ మధ్యలోనే గాయంతో జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ జట్టులో స్థానం కోసం రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 2018లో ఆసియా కప్‌లో చోటు సంపాదించిన అతను ఫర్వాలేదనిపించాడు. తర్వాత జరిగిన వెస్టిండీస్‌ సిరీస్‌లోనూ అదరగొట్టాడు. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో అతని బౌలింగ్‌ యాక్షన్‌ ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఐసీసీ వ్యాఖ్యానించింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. క్రికెట్‌ కెరీర్‌లో 55 వన్డేలు ఆడిన రాయుడు 1,694 పరుగులు చేశాడు. ఆరు అంతర్జాతీయ టీ20లు ఆడి 42 పరుగులు సాధించాడు.  


ఐపీఎల్‌ ఎంట్రీ
2007 నుంచి 2008 వరకు ఇండియన్‌ క్రికెట్‌ లీగ్‌లో (ఐసీఎల్‌) హైదరాబాద్‌ హీరోస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఐసీఎల్‌లో పాల్గొన్న ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్‌లో అనుమతి ఉండదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 2009లో బీసీసీఐ 79 ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్‌లో అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాయుడు తిరిగి హైదరాబాద్‌ జట్టులో చేరాడు. ఐపీఎల్‌లో చోటు సంపాదించాలని ఎంతో కృషి చేసిన అతనికి 2010లో ముంబయి ఇండియన్స్ అవకాశం ఇచ్చింది. ముంబయి తరఫున ఫర్వాలేదనిపించాడు. కానీ పదకొండో సీజన్‌లో ముంబయి రాయుడిని వదులుకోవడంతో వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంది. 2018లో 16 మ్యాచ్‌ల్లో 602 పరుగులు సాధించి జట్టులో ఎంతో కీలకంగా మారాడు. కానీ 2019 సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 282 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌లో 147 మ్యాచ్‌లు ఆడిన అతను 3,300 పరుగులు సాధించాడు.


వివాదాలు
అంబటి రాయుడు వివాదాలతో ఎన్నో సార్లు వార్తల్లో నిలిచాడు. 2005లో రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ ఆటగాడు అర్జున్‌యాదవ్‌పై స్టంప్‌తో దాడి చేశాడు. 2012 ఐపీఎల్‌లో ప్రత్యర్థి జట్టులోని హర్షల్‌పటేల్‌ను దూషించడంతో మ్యాచ్‌ ఫీజులో 100% కోతకు గురయ్యాడు. ఆస్ట్రేలియా×ఇండియా-ఏ మ్యాచ్‌లో, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అంపైర్లపై అసంతృప్తి చెందాడు. దీనిపై బీసీసీఐ అతన్ని రెండు మ్యాచ్‌లను నిషేధించింది కూడా. 2016 ఐపీఎల్‌లో హర్భజన్‌తో మైదానంలో సరిగా ప్రవర్తించలేదు. అంతేకాకుండా 2017 సెప్టెంబర్‌లో రోడ్డు మీద సీనియర్‌ సిటిజన్‌పై దాడికి దిగాడు. ఇటీవల ప్రపంచకప్‌ జట్టులో విజయ్‌ శంకర్‌ ఎంపికపై విమర్శిస్తూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.  

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.