close

తాజా వార్తలు

కంగారూలను కంగారు పెట్టించిన రోహిత్‌

హిట్‌మ్యాన్‌ తొలి డబుల్‌ సాధించి ఆరేళ్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత క్రికెట్‌లో ఎంత మంది దిగ్గజాలున్నా రోహిత్‌శర్మ స్థానమే వేరు. క్రికెట్‌ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని విధంగా వన్డేల్లో మూడు ద్విశతకాలుబాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు‌. 50ఓవర్ల ఫార్మాట్‌లో ఆస్ట్రేలియావంటి మేటి జట్టుపై తొలిసారి ద్విశతకంబాదిన అతడు ఆ తర్వాత శ్రీలంకపై రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. కాగా, అతడు తొలిసారి బాదిన ద్విశతకానికి నేటికి ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ నాటి మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్‌’ ఎలా చెలరేగాడో ఓ సారి గుర్తు చేసుకుంటే..

2013 ఆసీస్‌.. భారత పర్యటన సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏడో వన్డే. టాస్‌ గెలిచిన ఆసీస్‌ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్లు రోహిత్‌శర్మ(209; 158 బంతుల్లో 12x4, 16x6), శిఖర్‌ధావన్‌(60; 57 బంతుల్లో 9x4) చెలరేగడంతో తొలి వికెట్‌కు శుభారంభం లభించింది. 112 పరుగుల వద్ద ధావన్‌ ఔటైన వెంటనే విరాట్‌(0) రనౌటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టువీడని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయాడు. రైనా(28), యువీ(12), ధోనీ(62; 38 బంతుల్లో 7x4, 2x6)లతో కలిసి టీమిండియా స్కోరును పరుగులు పెట్టించాడు. ఆసీస్‌ బౌలర్లను నిస్సహాయుల్ని చేస్తూ సిక్సుల వర్షం కురిపించాడు. తొలి ఓవర్‌ నుంచే బౌండరీల మోత మోగించిన అతడు ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ వరకు అదే జోరులో కొనసాగాడు.

ఈక్రమంలో 49వ ఓవరు మూడో బంతికి మెక్కే బౌలింగ్‌లో భారీషాట్‌ ఆడబోయిన రోహిత్‌ హెన్రిక్స్‌ చేతికి చిక్కాడు. దీంతో తొలి డబుల్‌ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ మ్యాచ్‌లో ధోనీ కూడా ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 383/6 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్‌ తడబడి ఓటమిపాలైంది. ఫాల్క్‌నర్‌(116) పోరాడినా ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆసీస్‌ 326 పరుగులకు ఆలౌటైంది. 

రోహిత్‌ ఈ ఇన్నింగ్స్‌ తర్వాత ఈడెన్స్‌ గార్డెన్స్‌ వేదికగా 2014 నవంబర్‌ 13న శ్రీలంకతో జరిగిన వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 264 సాధించాడు. అనంతరం 2017 డిసెంబర్‌ 13న అదే శ్రీలంకపై మోహాలి మ్యాచ్‌లో మరోసారి డబుల్‌ సెంచరీ (208) చేశాడు. మొత్తం ఎనిమిదిసార్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ద్విశతకాలు నమోదు కాగా అందులో రోహిత్‌ చేసినవే మూడు ఉండటం గమనార్హం. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.