
తాజా వార్తలు
ఇండోర్‌లో గెలుపెవరిది?
బంగ్లాదేశ్‌తో పొట్టి సమరం ముగిసింది. ఇక అందరి దృష్టి సుదీర్ఘ ఫార్మాట్‌పైనే. టీ20ల్లో గట్టి పోటీ ఇచ్చిన బంగ్లా బలమైన భారత్ ముందు టెస్టుల్లో నిలువగలదా అని సందేహాలు మొదలయ్యాయి. భారీ తేడాతో కోహ్లీసేన ఘన విజయం సాధిస్తుందని అభిమానులు ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్, దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసిన టీమ్ఇండియా.. బంగ్లానూ చిత్తుచేసి టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మరిన్ని పాయింట్ల సాధించాలని పట్టుదలతో ఉంది. మరోవైపు షకిబ్, తమీమ్ వంటి కీలక ఆటగాళ్లు లేని బంగ్లాదేశ్ సర్వశక్తులను ధారబోసి భారత్‌ను ప్రతిఘటించాలని భావిస్తోంది. ఇండోర్ స్టేడియం వేదికగా గురువారం ప్రారంభం కానున్న తొలి టెస్టు ఏకపక్షంగా సాగుతుందా?లేదా హోరాహోరీగా జరుగుతుందా తెలియాలంటే వేచిచూడాల్సిందే!!
2000లో టెస్టు హోదా పొందిన బంగ్లాదేశ్ భారత్‌తోనే తొలి టెస్టు ఆడింది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య ఆరు టెస్టు సిరీస్‌లు జరగగా టీమ్ఇండియాదే (5-0) పైచేయి. చివరగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో కోహ్లీసేన 208 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరగనున్న ఇండోర్ స్టేడియం టీమ్ఇండియాకు ఫేవరేట్. ఈ మైదానంలో భారత్ 5 వన్డేలు, ఒక టెస్టు ఆడగా అన్నింట్లోనూ విజయకేతనం ఎగరవేసింది. టీమ్ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో వెస్టిండీస్‌పై ద్విశతకం ఇక్కడే సాధించాడు. అంతేకాకుండా ఇక్కడ జరిగిన ఏకైక టెస్టులో కోహ్లీ ద్విశతకంతో చెలరేగగా, అజింక్య రహానె, పుజారా శతకాలతో అదరగొట్టారు. స్పిన్నర్ అశ్విన్‌కు కూడా ఈ వేదిక ఎంతో ప్రత్యేకం. మొత్తంగా ఈ స్టేడియం భారత్‌కు ఎంతో చిరస్మరణీయ వేదిక.
బంగ్లా వారిని ఆపగలదా?
బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ భారత్ ఎంతో పటిష్ఠంగా ఉంది. పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, స్పిన్నర్లు అశ్విన్, జడేజాను బంగ్లా బ్యాట్స్‌మన్ ఎలా ఎదుర్కొంటారన్న అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బంగ్లా బ్యాటింగ్‌లో సారథి మోమినుల్, ముష్ఫికర్, మహ్మదుల్లా రియాద్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నా టెస్టులో ఎంత మేరకు రాణిస్తారో చూడాలి. మోమినుల్ 8 శతకాలతో సుదీర్ఘ ఫార్మాట్లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా ఉన్న టీమ్ఇండియా ఇండోర్‌లో పరుగుల వరద పారించడం ఖాయమని భావిస్తున్నారంతా. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూలాంశం. విరాట్ కోహ్లీ (26), ఛెతేశ్వర్ పుజారా (18), అజింక్య రహానె (11).. ముగ్గురు కలిసి టెస్టుల్లో ఇప్పటికే 50+ శతకాలు సాధించారు. బలమైన భారత బ్యాటింగ్ దళాన్ని కట్టడిచేయాలంటే బంగ్లా బౌలర్లు ఎంతో శ్రమించాల్సిందే.
పిచ్, వాతావరణం
పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు సమానంగా సహకరిస్తుందని ఇండోర్ స్టేడియం పిచ్ క్యురేటర్ సమందర్ సింగ్ చౌహాన్ తెలిపారు. మ్యాచ్ జరిగినన్ని రోజులూ జీవం ఉంటుందని పేర్కొన్నారు. మ్యాచ్‌కు వరుణుడి ముప్పు లేదు. ఈ వేదికగా జరిగిన గత మ్యాచుల్లో స్పిన్నర్లు అదరగొట్టారు. విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ జరిగిన ఏకైక టెస్టులో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకొని విజయం సాధించింది.
అప్పుడేం జరిగింది?
ఈ వేదికగా ఒక్క టెస్టు మాత్రమే జరిగింది. 2016లో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 321 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్‌ను 557/5 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 100 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా విరాట్ కోహ్లీ (211), అజింక్య రహానె (188) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 365 పరుగులు బాదారు. వీరితో పాటు రోహిత్‌శర్మ (51*) అర్ధశతకంతో మెరవగా టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 500 స్కోరుబోర్డును దాటింది. అనంతరం బరిలోకి దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్‌ను రవిచంద్రన్ అశ్విన్ (6/81) బెంబేలెత్తించాడు. దీంతో న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకే కుప్పకూలింది. గప్తిల్ (72), నీషమ్ (71) రాణించారు.
258 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 216/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఛెతేశ్వర్ పుజారా (101*) శతకంతో రాణించాడు. దీంతో కోహ్లీసేన కివీస్ ముందు 474 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్ (7/59) మరోసారి సత్తా చాటాడు. బంతిని గింగరాలు తిప్పుతూ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. అతడికి తోడుగా జడేజా (2/45) కూడా ఫర్వాలేదనిపించడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 13 వికెట్లు పడగొట్టడంతో పాటు గప్తిల్, జీటన్ను రనౌట్ చేశాడు.
- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
