
తాజా వార్తలు
బహు సిగ్గరి.. మతిమరుపు గజిని
ఇండోర్: తన దూకుడు, సంయమనంతో టీమిండియా ఓపెనర్‌గా రికార్డులు సృష్టిస్తున్నాడు మయాంక్ అగర్వాల్. కేవలం 12 ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే రెండో డబుల్ సెంచరీ సాధించాడు. తన ఆటతీరుతో మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్‌ను గుర్తు తెస్తున్నాడు. ప్రస్తుతం పంచ్‌లు వేస్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ కర్ణాటక ఆటగాడు ఒకప్పుడు బహు.. సిగ్గరి! మయాంగ్ గురించి మరెన్నో రహస్యాలు చెప్పాడు అతడి అండర్-19 సన్నిహితుడు.
‘అతనెంతో సిగ్గుపడేవాడు. మాట్లాడించేందుకు ముందుకు నెట్టాల్సి వచ్చేది. ఇతరులకు చెప్పేందుకు మావద్ద సంగతులుంటే మయాంక్ వాటిని వింటూ ముసిముసిగా నవ్వేవాడు’ అని ప్రస్తుతం ఛత్తీస్గడ్ సారథి, మధ్యప్రదేశ్ మాజీ సారథి హర్‌ప్రీత్‌సింగ్ అన్నాడు. సిగ్గుకుతోడు అగర్వాల్‌కు మతిమరపూ ఉందట. అందుకే అతడిని ‘గజినీ’ అని పిలిచేవారని హర్‌ప్రీత్ గుర్తుచేసుకున్నాడు. 2009లో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన ఓ సంఘటనను వివరించాడు.
అప్పటి అండర్-19 కోచ్ చంద్రకాంత్ పండిత్ బంతుల డబ్బా తీసుకురావాల్సిన బాధ్యతను మయాంక్‌కు అప్పగించారట. దానిని అతడు మర్చిపోయాడు. ‘ఒకసారి సాధన శిబిరానికి బంతుల డబ్బా తీసుకురావడం మయాంక్ మర్చిపోయాడు. కోచ్ ఏమైనా అంటాడేమోనని బాగా భయపడ్డాడు. చిన్న చిన్న విషయాలను మర్చిపోతూ 15-20 నిమిషాల తర్వాత హఠాత్తుగా గుర్తుతెచ్చుకోవడంతో అతడికి మేం ‘గజినీ’ అని పేరుపెట్టాం’ అని హర్‌ప్రీత్ చెప్పాడు. అప్పటికీ ఇప్పటికీ మయాంక్ ఆటలో క్లాస్ మాత్రం అలాగే ఉందని అంటున్నాడు.
‘మయాంక్ ఆట ఎప్పుడూ కళాత్మకంగా ఉంటుంది. అతడి డ్రైవ్‌లు, స్పిన్నర్లపై దాడిచేసేటప్పుడు కాళ్ల కదలిక చాలా బాగుంటాయి. మైదానంలో ఎంతో దూకుడుగా ఉంటాడు. బయట మాత్రం పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తాడు. మాదో అందమైన బృందం. మయాంక్, కేఎల్ రాహుల్, మన్‌దీప్‌సింగ్, జయదేవ్ ఉనద్కత్, అశోక్ మెనారియా, మనన్ శర్మ, హర్షల్ పటేల్.. మాలో ఎవరూ స్వార్థంగా క్రికెట్ ఆడలేదు. అందుకే ఇంకా క్రికెట్లో కొనసాగుతున్నాం. విజయ్ హజారే ట్రోఫీ కోసం ఈ మధ్యే బెంగళూరులో అతడిని కలిశాను. ఏ మాత్రం మారలేదు. ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. అందరితో చక్కగా మాట్లాడుతున్నాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘకాలం కొనసాగుతాడు’ అని హర్‌ప్రీత్ ధీమా వ్యక్తం చేశాడు.