
తాజా వార్తలు
ముంబయి: ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. చివరికి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయేసరికి గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనను విధించాల్సిందిగా ప్రతిపాదించారు. దీనికి కేంద్ర క్యాబినెట్, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం లభించడం చకచకా జరిగిపోయి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. సీఎం పదవీకాలాన్ని పంచుకునే విషయంలో భాజపా, మిత్రపక్షం శివసేన మధ్యలో సరైన పొత్తు కుదరకపోయేసరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని భాజపా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. భాజపా తర్వాత పెద్ద పార్టీగా అవతరించిన శివసేనకు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం కల్పించారు. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలతో శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే సంప్రదింపులు జరిపారు. ఇలాంటి సమయంలో శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్‌ఠాక్రే గతంలో ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు విషయంలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రేతో 1999లో ఓ జాతీయ మీడియా సంస్థ ముఖాముఖి నిర్వహించింది. దీనిలో భాగంగా ఎన్సీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలేమైనా ఉన్నాయా? అని ఆయన అభిప్రాయాన్ని అడిగింది. స్పందించిన ఆయన ‘ఎట్టి పరిస్థితుల్లో ఎన్సీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. ఎదురుగా ఉన్నది శరద్‌పవార్ కావచ్చు.. మరేదైనా పార్టీ నేతలు కావచ్చు.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పడిపోయేందుకు కారకుడైన ఆయనతో పొత్తుకు అవకాశం కాదు.. అలాంటి ఆలోచనే లేదు. ‘ప్రభుత్వాన్ని పడగొట్టడం నా బాధ్యత. నేను అదే చేశాను’ అని శరద్ పవార్ బహిరంగంగా మీడియాతో చెప్పారు. ఇలాంటి విషయాల్లో ఆయన ఆరితేరినవారు. ఇదంతా తెలిసి ఆయనతో ఎలా పొత్తు పెట్టుకునేది. ప్రజలు ఊరుకుంటారా?మమ్మల్ని మోసం చేశారని ప్రజలు ప్రశ్నిస్తే మేం ఏం సమాధానం చెప్పాలి’ అని బాల్‌ఠాక్రే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 1980లో బాల్‌ఠాక్రే, శరద్ పవార్ల మధ్య ఎలాంటి రాజకీయ విభేదాలు లేవు. 1982లో జరిగిన టెక్స్టైల్ సమ్మెలో వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. అనంతరం కొన్ని కారణాలతో వీరిద్దరి మధ్య రాజకీయ వైరం పెరిగింది.