close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌  @ 9 PM

1. ప్రధాని పదవికి మోదీ రాజీనామా

ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించగా.. దాన్ని ఆయన ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధానిగా కొనసాగాలంటూ మోదీని రాష్ట్రపతి కోరారు. మంత్రి మండలిని రద్దుచేయాలని ఈ సాయంత్రం పార్లమెంట్‌ భవనంలోని లైబ్రరీ హాలులో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర కేబినెట్‌ సమావేశమై 16వ లోక్‌సభ రద్దుకు తీర్మానం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

2. ఇకపై రాష్ట్రంలో నిరంతర నీటిప్రవాహం:కేసీఆర్‌

నీటి పారుదలశాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ చర్చించారు. జులై నుంచే కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయడాన్ని అధికారులు ప్రారంభించనున్న నేపథ్యంలో బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాల్వల నిర్వహణకు సన్నద్ధం కావాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. డిస్ట్రిబ్యూటర్లు, తూముల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇకపై రాష్ట్రంలో నిరంతర నీటి ప్రవాహం ఉంటుందని అధికారులతో కేసీఆర్‌ పేర్కొన్నారు.

3. కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం:17మంది మృతి!

గుజరాత్‌లోని సూరత్‌లో సర్తానా ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కోచింగ్‌ సెంటర్‌ భవనం రెండో అంతస్తులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. కొద్దిక్షణాల్లోనే అవి తీవ్ర రూపం దాల్చాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 17 మంది మృతిచెందినట్టు సమాచారం.  ప్రాణాల్ని కాపాడుకొనే క్రమంలో పలువురు విద్యార్థులు భవనంపైనుంచి కిందకు దూకేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సూరత్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఘటనా స్థలంలో 18 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేస్తున్నారు.

4. పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

వేసవిలో మండిపోతున్న ఎండల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఎండల వేడి నుంచి కాస్త ఉపశమనం కల్గించేందుకు వేసవి సెలవులను జూన్‌ 12 వరకు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి, జూన్‌ 1 నుంచి పునఃప్రారంభం కావాల్సిన పాఠశాలలు విద్యాశాఖ జారీచేసిన ఈ తాజా ఉత్తర్వులతో జూన్‌ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.

5. గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరిన ద్వివేది

ఏపీలో శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జీకే ద్వివేది గవర్నర్‌ నరసింహన్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు ఆయన అందజేయనున్నారు. ఎన్నికైన అభ్యర్థుల వివరాలతో ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. సీఈవో వివరాలు అందించిన అనంతరం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నరసింహాన్‌ జగన్‌ను కోరనున్నారు. మరోవైపు తాడేపల్లిలోని జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యేలంతా శనివారం ఉదయం 10.31 గంటలకు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో శాసనసభాపక్షనేతగా జగన్‌ను ఎన్నుకోనున్నారు.

6. నా సర్వేలకు చింతిస్తున్నా: లగడపాటి

ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో తాను చెప్పిన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు లెక్క తప్పాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైందనందుకు చింతిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. 2004 నుంచి అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ వచ్చానన్న ఆయన.. పక్షపాతం లేకుండా అనేక సందర్భాల్లో ప్రజలనాడి తెలిపామన్నారు. తన సర్వేల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలని కోరారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌కు లగడపాటి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని సూచించారు.

7. ఫలితాల ప్రభావం.. రాహుల్‌ రాజీనామా?

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా  రాహుల్‌ గాంధీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. కేవలం 52 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా పొందలేని స్థితికి రావడంతో రాహుల్.. ఆ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది. రాహుల్‌ తన రాజీనామా ప్రకటనను చేయనున్నట్లు ఆ పార్టీ నుంచి విశ్వసనీయ వర్గాలు మీడియాకు ఈ విషయాన్ని తెలిపాయి.

8. ఈవీఎంలను తప్పుబట్టలేం: కేజ్రీవాల్‌

కేంద్రంలో కాషాయం మెరిసింది. 349 స్థానాలకు కైవసం చేసుకొని ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగించింది. మరోవైపు దిల్లీలోని 7 స్థానాల్లోనూ విజయం సాధించి ఆప్‌కు ముకుతాడు బిగించింది. దీంతో పరాజయానికి గల కారణాలను సమీక్షించేందుకు ఆప్‌ సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ. ఎన్డీయే విజయానికి ఈవీఎంలను తప్పుబట్టలేమన్నారు. భాజపా అనుకూల పవనాలు వీయడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. ఈ సమావేశంలో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, గోపాల్‌ రాయ్‌, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

9. దేశ రాజకీయాలు ప్రభావం చూపాయి‌: తలసాని

తెలంగాణ ఎన్నికల ఫలితాపై దేశరాజకీయాలు ప్రభావం చూపాయని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలియజేశారు. ఇకముందు మరింత బాధ్యతతో పని చేస్తామని మాటిచ్చారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని విజయాలు వచ్చినా.. ఒదిగి పని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని అన్నారు.

10. ట్విటర్‌.. ఎన్నికల కూత గట్టిగా కూసింది 

దేశంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమ సామాజిక మాధ్యమం వాడకంలో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకుందని ‘ట్విటర్‌ ఇండియా’ వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 2019లో సుమారు 600శాతం మేర పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది. జనవరి 1నుంచి మే 23 మధ్య సుమారు 396 మిలియన్ల ట్వీట్‌లు జరిగినట్లు తెలిపింది. వీటిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకున్న వివిధ అంశాల సరళిని ట్విటర్‌ విశ్లేషించింది. ఏప్రిల్‌ 11 మొదలుకొని మే 19వరకూ జాతీయ భద్రత అంశమే ఈ ఎన్నికల్లో అత్యధిక మంది చర్చించుకున్న విషయంగా చోటు సంపాదించింది. మతం, ఉద్యోగాలు, ఉపాధి, వ్యవసాయం వంటి అంశాలు తరువాతి స్థానంలో నిలవగా.. నోట్లరద్దుపై నామమాత్రంగానే ట్వీట్‌లు జరిగాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.