close

తాజా వార్తలు

టాప్‌10 న్యూస్‌ @ 9 AM

1. సామాజిక సమతూకం

మంత్రివర్గ కూర్పులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాంతాలు, సామాజిక వర్గాల సమతూకం పాటించారు. ఒకేసారి 25మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్న ఆయన పార్టీకి మద్దతుగా నిలిచిన వర్గాలను సంతృప్తిపరిచారు. సంప్రదాయ తెదేపా మద్దతుదారులుగా పరిగణించే బలహీన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల్లో ఒక్కొక్కరికి ఉపముఖ్యమంత్రి పదవులు కేటాయించనున్నారు. మంత్రివర్గంలోకి ఎంపికైన ఎమ్మెల్యేలతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ ఈరోజు ఉదయం 11.49 కి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

2. 32 జడ్పీలపై గులాబీ జెండా ఎగరాలి

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్‌లలోనూ సంపూర్ణ విజయం సాధించాలని, భారీ మెజారిటీతో అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. జడ్పీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేయాలని, బలం ఉందనే ఉద్దేశంతో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపరాదని శుక్రవారం ఆయన సూచించారు. ఇప్పటికే 30 తెరాస జిల్లాపరిషత్‌ అధ్యక్ష స్థానాలకు అభ్యర్థులను సీఎం ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై మంత్రులకు సమాచారం ఇచ్చారు. శనివారం పాలకమండలి సమావేశానికి వెళ్లేముందు ఆ పేర్లను వెల్లడించాలని సూచించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లా పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

3. అధిక పింఛను ఆశలపై నీళ్లు!

అధిక పింఛను పొందే దిశగా వేతనజీవులు పెంచుకున్న ఆశలపై ఈపీఎఫ్‌వో నీళ్లు చల్లింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2014 సెప్టెంబరుకు ముందుగా అధిక వేతనాలతో పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగుల నుంచి వస్తున్న అధిక/ సవరణ పింఛను దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీటిని పక్కనపెట్టాలని కేంద్ర కార్యాలయం సూచించింది.అధిక పింఛను ప్రతిపాదనలు ఆమోదిస్తూ వెళ్తే, త్వరలోనే ఈపీఎఫ్‌వో నగదు నిల్వలు నిండుకునే అవకాశముందని ఈపీఎఫ్‌వో ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధిక పింఛనుపై 2016, 2019లలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పునఃసమీక్షించాలని కోరుతూ అప్పీలు దాఖలు చేయాలని ఇప్పటికే ఈపీఎఫ్‌వో నిర్ణయించింది.

4. రాజీనామా చేయించి.. ఎన్నికలకు వెళ్లాలి

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజంగా ప్రజల్లో బలం ఉంటే తెరాసలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలు జరపాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి రామచంద్ర కుంతియా డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ చేతిలో ఎప్పటికైనా ఓటమి తప్పదనే భయం కేసీఆర్‌లో ఉందని.. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మటుమాయం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా, అప్రజాస్వామికంగా సీఎల్పీని తెరాసఎల్పీలో విలీనం చేస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీసీ, టీపీసీసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

5. పొరుగు దేశాలకు ప్రాధాన్యం

భారతదేశం తన ఇరుగు పొరుగు దేశాల అభివృద్ధిని, సుస్థిరతను కోరుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ‘పొరుగు దేశాలకు అగ్రతాంబూలం’ అనే సూత్రానికి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. మాల్దీవులు, శ్రీలంకల్లో శనివారం నుంచి తాను చేపట్టబోయే పర్యటన ఇందుకు నిదర్శనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను తన పర్యటన మరింత బలోపేతం చేస్తుందని శుక్రవారం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టాక మోదీ చేపడుతున్న మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. తొలుత ఆయన మాల్దీవులకు వెళతారు. అక్కడి నుంచి ఆదివారం శ్రీలంకకు పయనమవుతారు.

6. నేడు కేరళను తాకనున్న నైరుతి

నైరుతి రుతుపవనాలు శనివారం కేరళ తీరాన్ని తాకనున్నాయి. రానున్న 24 గంటల వ్యవధిలో అవి భారత భూభాగంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖ పేర్కొంటోంది. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించి నెమ్మదిగా దక్షిణం భారతదేశం నుంచి ఉత్తరానికి ఎగబాకనున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. కేరళలో రుతుపవనాల ఆగమనాన్ని సూచిస్తూ ఇప్పటికే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

7. ‘టోరీ’ నేతగా థెరెసా రాజీనామా

అధికార కన్జర్వేటివ్‌ పార్టీ (టోరీ) నాయకురాలిగా బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే శుక్రవారం రాజీనామా చేశారు. తదుపరి వ్యక్తి బాధ్యతలు చేపట్టే వరకు ప్రధాని పదవిలో కొనసాగనున్నారు. బ్రెగ్జిట్‌ వ్యవహారంలో తన విధానాలకు మద్దతు లభించకపోవడంతో ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని ఆమె గత నెల 23నే ప్రకటించడం గమనార్హం. అందులో భాగంగా తొలుత కన్జర్వేటివ్‌ పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేశారు.

8. కశ్మీరుపై చర్చించుకుందాం రండి: ఇమ్రాన్‌

కశ్మీరు వివాదం సహా పరిష్కరించుకోదగిన అన్ని సమస్యలపై చర్చలకు సిద్ధమని పేర్కొంటూ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మన ప్రధాని మోదీకి లేఖ రాశారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఖాన్‌ లేఖ రాసినట్లు ‘జియో టీవీ’ తెలిపింది. ఇరుదేశాల ప్రజలు పేదరికాన్ని అధిగమించడానికి చర్చలు ఒక్కటే పరిష్కారమని ఖాన్‌ అందులో పేర్కొన్నారు. కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరగనున్న ‘ఎస్‌సీఓ’ సదస్సులో ఇమ్రాన్‌ఖాన్‌తో మోదీ భేటీ ఉండదని గురువారం మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసిన నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ శుక్రవారం లేఖ రాయడం గమనార్హం.

9. ఫైనల్లో నాదల్‌ 

టెన్నిస్‌ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూసిన దిగ్గజాల పోరులో నాదల్‌దే పైచేయి. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రెండో సీడ్‌ నాదల్‌ (స్పెయిన్‌).. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 6-3, 6-4, 6-2తో మూడో సీడ్‌ ఫెదరర్‌ను ఓడించాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో పరాజయం రుచి చూపించాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు తలపడుతుండడంతో మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుందేమో అనే అంచనాలను చిత్తుచేస్తూ నాదల్‌ ఏకపక్ష విజయం నమోదు చేశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నాదల్‌ తొలి సెట్లో వరుసగా మూడు గేమ్‌లు గెల్చుకొని జోరు ప్రదర్శించాడు.

10. ఐసీసీ ససేమిరా..

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోని ధరించిన గ్లోవ్స్‌ మీద ఉన్న సైనిక చిహ్నాన్ని తొలగించాలని ఐసీసీ స్పష్టం చేసింది. క్రికెటర్లు ఉపయోగించే దుస్తులు, పరికరాలపై స్పాన్సర్ల లోగోలు మినహాయిస్తే.. రాజకీయ, మత, వాణిజ్య ప్రయోజనాలతో ముడిపడ్డ చిహ్నాలు ఉండకూడదన్నది ఐసీసీ నిబంధన. అయితే ప్యారాచూట్‌ సైనిక దళ విభాగంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని.. తాను భాగమైన దళం అధికారిక చిహ్నం ‘బలిదాన్‌’ను గ్లోవ్స్‌ మీద ముద్రించుకుని ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడటంతో ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని తొలగించాలని స్పష్టం చేసింది. ధోని ఆ చిహ్నాన్ని గ్లోవ్స్‌ మీద పెట్టుకోవడంలో ఎలాంటి రాజకీయ, వాణిజ్య ప్రయోజనాలు లేవని బీసీసీఐ వివరణ ఇచ్చింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.