close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. కేంద్రం సూచనతోనే వైదొలిగాం:ప్రపంచబ్యాంకు

కేంద్రం సూచనతోనే ఏపీ రాజధాని అమరావతికి ఆర్థిక సాయం ఉపసంహరించుకున్నట్లు ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అమరావతికి రుణ ప్రతిపాదనపై ప్రపంచ బ్యాంకు తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. రాజధాని మౌలిక వసతులకు ఉద్దేశించిన ‘అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు’ కోసం రుణం ఇవ్వాలని గతంలో ప్రపంచ బ్యాంకుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేంద్రం చేసిన సూచనల మేరకే అమరావతికి రుణ ప్రతిపాదన రద్దు చేసినట్లు తాజాగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. చంద్రయాన్‌-2 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-2 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌.. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటల వరకు 20 గంటలపాటు కొనసాగనుంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ఎం1 వాహక నౌక దీన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. 3.8 టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాన్ని వాహకనౌక రోదసీలోకి తీసుకెళ్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. బలపరీక్ష.. కాంగ్రెస్‌ కీలక భేటీ

కర్ణాటక అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో బెంగళూరులోని యశ్వంతపురలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశమైంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్‌, పార్టీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఫైనల్లో ఆ నిర్ణయం తప్పే.. కానీ చింతించను

ప్రపంచకప్‌ ఫైనల్లో ఓవర్‌ త్రో విషయంలో తాను తీసుకున్న నిర్ణయం తప్పేనని, అయితే దీనిపై చింతించడం లేదని అంపైర్‌ కుమార ధర్మసేన తాజాగా అన్నారు. ఇంగ్లాండ్‌ ఛేదనలో చివరి ఓవర్‌ నాలుగో బంతిని ఎదుర్కొని స్టోక్స్‌ పరుగుకు వెళ్లాడు. బంతి అందుకున్న మార్టిన్‌ గప్తిల్‌ కీపర్‌ వైపు విసిరాడు. అంతలోనే రెండో పరుగు కోసం క్రీజులోకి డైవ్‌ చేసిన స్టోక్స్‌ బ్యాటుకు బంతి తగిలింది. అది కాస్త బౌండరీ దాటింది. దీంతో అంపైర్లు 2+4  మొత్తం 6 పరుగులు ఇంగ్లాండ్‌ ఖాతాలో జమచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. భాజపా గెలుపు చరిత్రాత్మకం కాదు : మమత

తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలలో భాజపా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి పశ్చిమబంగలో తన ప్రాబల్యం పెంచుకుందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కలకత్తాలో జరిగిన ర్యాలీలో ఆమె భాజపాపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించడం ఒక అంతు చిక్కని రహస్యం తప్ప చరిత్రేమి కాదని విమర్శించారు. పశ్చిమబంగలో భాజపా నాయకుల ముఖాలు కూడా ఎవరికీ తెలియవనీ, కుటీల రాజకీయం చేసి వారు విజయం సాధించారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. షీలాదీక్షిత్‌కు కన్నీటివీడ్కోలు 

కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అశ్రునయనాల మధ్య దిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్‌కు తుది వీడ్కోలు పలికారు. శనివారం గుండెపోటుతో మరణించిన 81 ఏళ్ల  కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలి పార్థివదేహం దహనక్రియలు ప్రభుత్వలాంఛనాలతో నిగమ్‌బోధ్‌ఘాట్‌లో నిర్వహించారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రియంకాగాంధీ వాద్రాలతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా, దిల్లీ హోంమంత్రి సత్యేందర్‌జైన్‌లు అంతిమయాత్రలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కేజీ-డీ6లో చివరి దశకు వచ్చిన గ్యాస్‌

బే ఆఫ్‌ బెంగాల్‌లోని కేజీ -డీ6 బ్లాక్‌లో గ్యాస్‌ చివరిదశకు వచ్చినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. దీంతో గ్యాస్‌ వెలికితీత ఆల్‌ టైమ్‌ కనిష్ఠానికి పడిపోయినట్లు వెల్లడించింది. రాబోయే సంవత్సరాల్లో ఉత్పత్తి తగ్గకుండా ఉండేందుకు 2020 మధ్య నాటికి మరో మూడు సరికొత్త బ్లాక్‌లను కనిపెట్టనున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. రోడ్డు దాటుతుండగా కారు ఢీ: ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజాపూర్‌-కుచ్చెర్కల్‌ రహదారిలో కారు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. మృతులను పశువుల కాపర్లుగా గుర్తించారు. కుచ్చెర్కల్‌కు చెందిన ఈ ముగ్గురూ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రాయుడు విఫలమైనా నమ్మకం ఉంచాం.. కానీ

అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన రాయుడిపై టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ఆటగాళ్లకు ఉండే భావోద్వేగాలే సెలక్షన్‌ కమిటీకి ఉంటాయని, అన్నింటికీ అతీతంగా ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేశామని పేర్కొన్నారు. వెస్టిండీస్‌ పర్యటనకు భారత్‌ జట్లను ఎంపిక చేసిన అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.  ఫిట్‌నెస్‌ పరీక్షలో రాయుడు విఫలమైనా అతనిపై నమ్మకం ఉంచామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మిలియన్‌ డాలర్ల ‘బేబీ’ సమంత

అగ్ర కథానాయిక సమంత సోలోగా అమెరికాలో మిలియన్‌ డాలర్లు రాబట్టేశారు. ఆమె టైటిల్‌ రోల్‌ పోషించిన సినిమా ‘ఓ బేబీ’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 5న విడుదలై విజయం అందుకుంది. విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. బాక్సాఫీసు వద్ద కూడా విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.35 కోట్లకుపైగా రాబట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.