close

తాజా వార్తలు

ఓ మంచి నీటి కథ!

ఇవాళ ప్రపంచ నీటి పర్యవేక్షణ రోజు

మనకి దాహం వేసినప్పుడల్లా నీళ్లు తాగుతాం... అసలు ఎందుకు నీళ్లు తాగాలి? రోజుకు ఎన్ని తాగాలి? ఎలాంటి నీళ్లు తాగాలి?ఇలా ఎన్నో సందేహాలు కిట్టూకి వచ్చాయ్‌...తాతయ్య వాటన్నింటినీ తీర్చేశాడు...
అవేంటో మనమూ తెలుసుకుందామా!

తాతయ్య: కిట్టూ! ఏంటీ? ఈ కుళాయి నీళ్లు తాగుతున్నావ్‌?
కిట్టు: ఇవీ నీళ్లేగా తాతయ్యా!?
తాతయ్య: తాగేవి కావు.
కిట్టు: తాగే నీళ్లంటే ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా?
తాతయ్య: అవును మరి. వాటికి కొన్ని లక్షణాలు ఉండాలి.
కిట్టు: ఏంటవి?

తాతయ్య: తాగే నీరంటే కేవలం మంచి నీరు మాత్రమే కాదు. మన ఆరోగ్యానికి లాభం చేకూర్చే కొన్ని కరిగిన పదార్థాలు అందులో ఉండాలి. అలా ఉండకపోతే వాటిని కలపాలి. తాగేనీటి గుణాన్ని నిర్ణయించే ప్రమాణాలు అవసరం. ప్రతి దేశం వీటికి ఉండే గుణాల విషయంలో తలో రకంగా ప్రమాణాలు ఏర్పర్చుకున్నాయి.
కిట్టు: అవునా? అలా కూడా ఉంటుందా?
తాతయ్య:  మన ఆరోగ్య మంత్రిత్వశాఖ తాగునీటికి కొన్ని ప్రమాణాలు నిర్ణయించింది. ఒక లీటరు నీటిలో ఏయే రసాయనాలు ఎన్ని మిల్లీ గ్రాములు ఉండాలో యూనిట్ల వారీగా వివరంగా చెప్పింది.
కిట్టు: ఏంటవి?
తాతయ్య: ఇదిగో ఈ పట్టికలో కొన్ని ఉన్నాయి. ఇవేంటో చూడు నీకే తెలుస్తుంది. ఇక్కడున్న బ్రాకెట్లో వేసిన అంకెలు యూనిట్లు.
మెగ్నీషియం (50), ఇనుము (0.3),
మాంగనీసు (0.1), రాగి (1.0),
జింక్‌ (5.0), క్లోరైడ్లు (250),
సల్ఫేట్లు (250), ఫీనాల్స్‌ (0.001),
ఫ్లోరైడ్‌లు (1.0), నైట్రేట్లు (20)
కిట్టు: మరి ఉండకూడనివో?


తాతయ్య: చిట్టిబుర్రకు భలే తట్టిందే. అవీ ఉంటాయి. తాగునీటిలో ఆర్సెనిక్‌, క్రోమియం, సైనైడ్లు, సీసం, సెలీనియం వంటి విషపదార్థాలు అస్సలు ఉండ    కూడదు. ఇంకానేమో పీహెచ్‌(ఆమ్ల గుణం) విలువ 7.0 నుంచి 8.5 వరకూ ఉండాలి. 6.5 కన్నా తక్కువగా... లేదా 9.2 కంటే ఎక్కువగా ఉంటే అది తాగునీరు కాదు.
కిట్టు: ఓహో! అలా ఉంటే కలుషిత నీరేనన్నమాట.
తాతయ్య:  ఆ... అవును. ముఖ్యంగా ఇప్పటికీ కొన్ని ఊళ్లలో ప్రజలు కలుషిత జలం తాగడం వల్ల టైఫాయిడ్‌, కామెర్లు, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు వస్తున్నాయి.
కిట్టు:  ఈ కథంతా ఎందుకైతే? నీళ్లు తాగకుంటే సరి!
తాతయ్య: అయ్యయ్యో ఎంత మాట కిట్టూ! అసలు నువ్వు ఉండగలవా? దాహం వేసినా నీళ్లు తాగకుండా? తిండి లేకుండా మనిషి కొంత కాలం బతకగలడేమో గానీ నీరు లేకుండా కష్టం. మన జీవనానికి అవసరమైన నీరు ప్రకృతిలో లభించడం గొప్ప అదృష్టం. మనిషే కాదు జంతుజాలం కూడా నీటిని తాగుతుంది.
కిట్టు: అసలు నీరు తాగడం వల్ల లాభమూ ఉంటుందా?


తాతయ్య: ఎందుకుండదు. ఇది మన ఆరోగ్యాన్ని పరిరక్షించి, శక్తినిస్తుంది. శరీరంలో వ్యర్థాలు మిగిలిన పదార్థాల్ని చెమట, మూత్రం రూపంలో విసర్జించేందుకు తగినన్ని నీళ్లు మనకు అవసరం. ఇంకా శరీరంలోని ఎన్నో జీవరసాయన చర్యలకు ఇది కావాలి. సరిపడా నీరు అందితేనే పెద్ద పేగు బాగా పనిచేస్తుంది. అంతేకాదు... శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటానికి ఇది తప్పక కావాల్సిందే.
కిట్టు: మరి తాగకపోతే?
తాతయ్య: దాహం వేసినప్పుడు కావాల్సినంత నీటిని తాగకపోతే శరీరానికి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. తక్కువ నీటిని తాగేవారికి పొట్టకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. మంచినీటితో స్నానం చేస్తే చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి.
కిట్టు:  అ...లా...గా! మరి రోజూ ఎంత నీరు తాగాలి?
తాతయ్య: ఆరోగ్యమైన మనిషికి సగటున రోజుకి రెండు లీటర్ల నీరు కావాలి. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవాళ్లు ఇంకొన్ని ఎక్కువ తాగాలి. ప్రాంతాల్ని బట్టీ తాగాల్సిన నీటి పరిమాణం మారుతూ ఉంటుంది. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువ నీరు తాగాలి.
కిట్టు:  బాబోయ్‌ దీనికి ఇంత సీనుందన్నమాట. అయితే ఇక నుంచి నేను బాగా తాగుతా.
తాతయ్య: గుడ్‌ బాయ్‌. అయితే ఒక్క విషయం. నీరు ఎంతో విలువైంది. మనమంతా దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. వృథా చేయకుండా, కలుషితం కాకుండా కాపాడుకోవాలి.

- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.