
తాజా వార్తలు
ఎవరూ అందోళన చెందొద్దు :అమిత్ షా
దిల్లీ: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను దేశమంతా అమలు చేస్తామని హోంమంత్రి అమిత్‌షా పునరుద్ఘాటించారు. ఎన్ఆర్సీ అనేది దేశంలోని ప్రజలను పౌరుల జాబితాలోకి చేర్చే ప్రక్రియ మాత్రమేనని, దీనిపై ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని బుధవారం రాజ్యసభలో అన్నారు. ఎన్ఆర్సీ దేశమంతా నిర్వహించే సమయంలో మరోసారి అసోంలోనూ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన జాబితాలో పేర్లు గల్లంతైన వారు తహసీల్ స్థాయిలో ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని, ఇందుకు అసోం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని వివరించారు.
ఇటీవల ఎన్ఆర్సీ జాబితా విడుదల చేసిన అసోంలో దాదాపు 19 లక్షల మంది పౌరుల పేర్లు గల్లంతైన సంగతి తెలిసిందే. అయితే, వీరిలో ఎక్కువ మంది తమ గుర్తింపును ధ్రువీకరించే పత్రాలు సక్రమంగా సమర్పించనందువల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు గతంలో వివరణ ఇచ్చారు.
ఇక్కడ మాత్రం అనుమతించబోం :మమత
దేశమంతా ఎన్ఆర్సీ అమలు విషయాన్ని అమిత్ షా పార్లమెంటులో ప్రకటించిన వెంటనే పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. బంగాల్లో ఎన్ఆర్సీని అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. బంగాల్లో ఎవరూ ఎవరి పౌరసత్వాన్ని తొలగించేందుకు వీల్లేదని, తమ ప్రభుత్వం ప్రజల్లో వర్గభేదాలు సృష్టించేందుకు సిద్ధంగా లేదని అన్నారు.
పొరుగు దేశాల నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన అక్రమ వలసదారులను గుర్తించే లక్ష్యంతో ఎన్ఆర్సీ చేపట్టనున్న సంగతి తెలిసిందే. 1971 మార్చి 25 తర్వాత బంగ్లాదేశ్ నుంచి అసోంలోకి ప్రవేశించి స్థిరపడ్డ వారిని గుర్తించి వారిని వారి దేశానికి పంపే యోచనతో అసోంలో ఎన్ఆర్సీని చేపట్టారు.