close

తాజా వార్తలు

ఓ యువతా మేలుకో!

ఓ యువతా మేలుకో!

‘ఇనుప కండరాలు, వజ్రతుల్యమైన మనోబలంగల యువకులు మనకు కావాలి! మీలో అనంతమైన శక్తి ఉంది. ఇక కావలసింది - ‘నేను దేన్నైనా చేయగలను అన్ని పనులూ నిర్వహించగలను’ అనే ఆత్మవిశ్వాసం. మిమ్మల్ని మీరే బలహీనులమని భావించడం తగదు! మీలో ఉన్న శక్తి అపారం. ‘నేను బలహీనుడిని’ అని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఎలా అనుకుంటే అలాగే అవుతాం’- స్వాతంత్య్రం పోగొట్టుకొని, ఆత్మవిశ్వాసం కోల్పోయిన భారతీయ యువతకు దిశానిర్దేశం చేసిన ఆధునిక హైందవ యోగి పుంగవుడు స్వామి వివేకానంద.

తన సందేశం అర్థం చేసుకోవడానికి, ఆయన ప్రతి ఉపన్యాసానికి ఒక కథను జోడించేవారు. అది తమ గురువైన శ్రీరామకృష్ణ పరమహంస నుంచి నేర్చిన విద్య. ‘మనం ఎవరిమో, మన ఆదర్శాలేమిటో తెలియని స్థితిలో జీవితాన్ని గడుపుతూ, పాశ్చాత్యులకు దాస్యం చేస్తూ కాలక్షేపం చేస్తున్న భారతీయ యువకులకు ఆనాడు స్వామి ఇచ్చిన సందేశం నేటికీ నిలిచి ఉంది. ఒక ప్రసంగంలో చెప్పిన కథ ఇది.

ఒక అడవిలో సింహంపిల్ల తప్పిపోయింది. తల్లిని వెదుకుతూ ఆ సింహం పిల్ల ఒక గొర్రెలమందలో చేరింది. గొర్రెపిల్లల మందలో అది ‘బ్యా బ్యా యా’ అని అరుస్తూ ఉంటే... తనకు తెలియకుండానే తానూ ‘బ్యా బ్యా యా’ అని అరవడం మొదలుపెట్టింది. కొంతకాలానికి దాని తల్లి, పిల్లను వెతుకుతూ అక్కడకు వచ్చి, అది గొర్రె లాగా అరవడం చూసింది. కోపాన్ని అణచుకొని, ‘నాయనా! నేను నీ తల్లినిరా! మనం సింహజాతివాళ్ళం రా! ఈ అడవికే రాజులమని తెలుసుకో!’ అంటూ గర్జించింది. తల్లి పిలుపు విని పిల్ల సింహం తాను ఎవరో తెలుసుకొని సింహంలా గర్జించింది!

స్వధర్మాన్ని వీడి, పరధర్మాన్ని స్వీకరించడం ఎలాంటిదో ఈ కథ ద్వారా హృదయానికి హత్తుకొనే విధంగా చెప్పారు. కలకత్తాలో 1863 జనవరి 12న జన్మించిన వివేకానంద 1902 జులై నాలుగున, 39 సంవత్సరాల నిండు యవ్వనంలో శ్రీ కైవల్యం చెందారు. కంచు కంఠం, స్ఫురద్రూపం, బహుభాషా సాహిత్యాలు, వేదాంత గ్రంథాలతో పరిచయం, సంగీతంలో మెలకువలు తెలిసికొని మధురంగా పాడే నైపుణ్యం... ఇవన్నీ స్వామి సొంతం.

వివేకానందుడి ప్రసంగాలకు నాటి మేధావులెందరో ముగ్ధులయ్యారు. భారత దేశానికి పునర్వైభవం యువకుల వల్లే సాధ్యమన్నది స్వామి వివేకానంద నిశ్చయం. పరులకు సేవ చేయడం ఈశ్వర సేవే అని ఆయన భావన. మతమంటే సత్యం. సత్యాన్వేషణలో కలిగే ఒక మహానందమే మతం. భౌతిక శాస్త్రంలో ప్రయోగం గురించి ప్రస్తావిస్తారు. గాంధీ మహాత్ముడు సత్యాన్వేషణలో తన ప్రయోగాల గురించి పేర్కొన్నారు. యువత దీన్ని గ్రహించుకొని ప్రవర్తించాలి. పాశ్చాత్యుల విషప్రచారానికి లొంగి, మనదేశ బలహీనత్వానికి కారణం మన మతమే అని భావించడం తప్పు. నిజం ఏమిటంటే, మన వెనకబాటుతనానికి కారణం మన మతాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొనకుండా, అవగాహన లేకుండా ఆచరించడం!

తన ప్రసంగాల్లో ఉపనిషత్‌ వాణిని తరచూ ఉటంకించేవారు స్వామి. ‘భయం వీడండి!’, ‘లెండి! మేలుకొనండి. గమ్యం చేరేవరకు విశ్రాంతి లేదు!’ అని వివేకానంద యువతకు పిలుపిచ్చారు.

ఒక యువకుడు వివేకానందుల వద్దకు వెళ్ళి ‘నేను ధ్యానం చేసేటప్పుడు మనసు నిలకడగా ఉండటంలేదు... ఏదైనా ఉపాయం చెప్పండి’ అని ప్రార్థించాడు. ‘ధ్యాన సమయంలో ఎక్కడ కూర్చుంటావు?’ అని స్వామి ప్రశ్నించారు. 

‘నా గదిలో తలుపులు, కిటికీలు అన్నీ మూసుకొని, ఏ ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నా!’

‘ముందుగా అన్ని తలుపులూ పూర్తిగా తెరువు. కిటికీల అవతల ఇంటిచుట్టూ ఉన్న బీదలు, దీనులను గమనించు. వారి వద్దకు వెళ్ళి చదువు చెప్పు. వైద్యం అందించు. అప్పుడు నీకు ధ్యానం కుదురుతుంది!’

ఈ సమాధానం స్వామి మనసును తేటతెల్లం చేస్తుంది.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.