ఇళ్ల పరిశీలనను అర్ధంతరంగా ఆపేసిన కాంగ్రెస్‌

తాజా వార్తలు

Updated : 18/09/2020 15:15 IST

ఇళ్ల పరిశీలనను అర్ధంతరంగా ఆపేసిన కాంగ్రెస్‌

అప్పటి ఇళ్లనే ఇప్పుడూ చూపిస్తున్నారన్న భట్టి 

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు పడకగదుల ఇళ్ల పరిశీలనను కాంగ్రెస్‌ నేతలు నిలిపివేశారు. రెండోరోజు పరిశీలనలో భాగంగా మంత్రి తలసాని, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు (వీహెచ్) వెళ్లారు. ఇవాళ తుక్కుకూడ, రాంపల్లి ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణాల పరిశీలన కార్యక్రమాన్ని అర్ధంతరంగా ఉపసంహరించుకున్నట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లను చూపిస్తామని తెరాస నేతలు సవాలు చేశారని.. ఇప్పటి వరకు 3,428 ఇళ్లను మాత్రమే చూపించారని భట్టి ఆరోపించారు. ఈరోజు ప్రభుత్వం చూపించిన ప్రాంతాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రావన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వందల ఎకరాల భూమి ఉన్నప్పటికీ అక్కడ పూర్తిస్థాయిలో ఇళ్లు నిర్మించలేదని ఆయన ఆరోపించారు. గత మున్సిపల్‌ ఎన్నికల సమయంలో చూపించిన ఇళ్లనే ఇప్పుడూ చూపిస్తున్నారని భట్టి ఆక్షేపించారు.

కాంగ్రెస్‌ నేతలు పారిపోయారు: తలసాని

శివారుల్లో నిర్మిస్తున్న గృహాల్లో 90 శాతం ఇళ్లు నగర వాసులకే ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. భట్టి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. జీహెచ్‌ఎంసీలో స్థలం లేనందునే నగర శివారులో ఇళ్లు నిర్మించామన్నారు. ఇళ్లు ఎక్కడ నిర్మించిన హైదరాబాద్‌ వాసులకే ఇస్తామని స్పష్టం చేశారు. లక్ష ఇళ్లకు సంబంధించిన జాబితా ఇస్తామంటే కాంగ్రెస్‌ నేతలు పారిపోయారని తలసాని ఎద్దేవా చేశారు. మరో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమి లేకుండా చేసింది కాంగ్రెస్‌ నేతలేనని ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని