‘సుప్రీం’ మార్గదర్శకాలను మేజిస్ట్రేట్లు పాటించాల్సిందే

ప్రధానాంశాలు

‘సుప్రీం’ మార్గదర్శకాలను మేజిస్ట్రేట్లు పాటించాల్సిందే

పాటించనివారిపై విచారణకు ఆదేశించిన సందర్భాలున్నాయి

సీజే ధర్మాసనం వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: పోలీసులు ఎవరినైనా అరెస్టుచేసి రిమాండు నిమిత్తం హాజరుపరిచినప్పుడు ‘అర్నేష్‌కుమార్‌ కేసు’లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మేజిస్ట్రేట్లు పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఏడేళ్లలోపు జైలుశిక్ష విధించే వీలున్న కేసుల్లో వారికి 41ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆ కేసు సందర్భంగా మార్గదర్శకాలు జారీచేసింది. వాటిని ధర్మాసనం ప్రస్తావిస్తూ, రిమాండు విధించే సమయంలో వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారాన్ని చూస్తున్నామనే విషయాన్ని మేజిస్ట్రేట్లు గుర్తుంచుకోవాలని పేర్కొంది. ‘సుప్రీం’ మార్గదర్శకాలను అనుసరించకపోవడం ఏపీలోనే కాదు... ప్రతిచోటా ఉందని వ్యాఖ్యానించింది. నిబంధనలు పాటించని మేజిస్ట్రేట్లపై శాఖాపరమైన విచారణకు ఆదేశించిన సందర్భాలున్నాయని గుర్తుచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తూ మంగళవారం ఆదేశాలిచ్చింది. పోలీసులు, సీఐడీ అధికారులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రతులను 24 గంటల్లో వెబ్‌సైట్లో పొందుపరచడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదంటూ టీవీ-5 ఛానల్‌ అధిపతి బి.రాజగోపాల్‌ నాయుడు హైకోర్టులో పిల్‌ వేశారు. మంగళవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. ‘ప్రాథమిక విచారణ చేయకుండా సీఐడీ పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రతులను 24 గంటల్లో అధికారిక వెబ్‌సైట్‌, ఏపీ పోలీసు సేవ మొబైల్‌ అప్లికేషన్‌లో పొందుపరచడం లేదు. ఎఫ్‌ఐఆర్‌ డౌన్‌లోడు చేసుకోవాలంటే పేరు, ఫోన్‌ నంబరు, ఫొటో తదితర వ్యక్తిగత సమాచారం కోరుతున్నారు. ఇది గోప్యత హక్కును హరించడమే. కోర్టు ముందు మేం దాఖలుచేసిన కౌంటర్లోని అంశాలు ప్రతిబింబించేలా తగిన ఉత్తర్వులివ్వండి’ అని కోరారు. పిటిషనర్‌ను ఉద్దేశించి ధర్మాసనం మాట్లాడుతూ ఈ విషయమై వివిధ వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు పరిష్కరిస్తూ ఆదేశాలు జారీచేసిందని తెలిపింది. మీ అభ్యర్థనలు పస లేనివని వ్యాఖ్యానించింది. ఏపీలోనే కాదు.. వివిధ రాష్ట్రాల్లోనూ పోలీసుల తీరు అలాగే ఉంటుందని, అందుకే న్యాయస్థానాలు ఆదేశాలిస్తుంటాయని వ్యాఖ్యానించింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుత వ్యాజ్యంలోనూ తగిన ఆదేశాలిస్తామని వెల్లడించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని