పార్టీకి క్షమాపణ చెప్పా..

ప్రధానాంశాలు

పార్టీకి క్షమాపణ చెప్పా..

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి.  ఏఐసీసీ రంగంలోకి దిగి శనివారం వివరణ కోరడం.. జగ్గారెడ్డి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. గజ్వేల్‌ ‘దండోరా’ సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, రేవంత్‌ జహీరాబాద్‌ పర్యటన గురించి చెప్పలేదని, అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని జగ్గారెడ్డి శుక్రవారం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కాగా.. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికంఠాగూర్‌ సూచనలతో ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌కృష్ణన్‌లు శనివారం గాంధీభవన్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌, కుమార్‌రావు, నిరంజన్‌, రమేష్‌ తదితరులు హాజరయ్యారు.

పార్టీ తప్పిదమూ ఉంది..
మెజార్టీ నాయకులు జగ్గారెడ్డి తీరును తప్పుపట్టినట్లు తెలిసింది. పార్టీలో ఇబ్బంది ఉంటే అంతర్గత వేదికల మీద చర్చించి పరిష్కరించుకోవాలని, మీడియా ముందు మాట్లాడటంవల్ల పార్టీకి నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. గజ్వేల్‌లో మాట్లాడించకపోవడం, రేవంత్‌ జహీరాబాద్‌ పర్యటన గురించి చెప్పకపోవడం పార్టీ తప్పిదమేనని.. జగ్గారెడ్డికి సర్దిచెప్పారు. అంతకుముందు తన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి వివరించే ప్రయత్నం చేస్తుండగా మల్లు రవి కలుగజేసుకోవడంతో వారి మధ్య కాసేపు నువ్వెంతంటే నువ్వెంతనే స్థాయిలో వాదనలు జరిగినట్లు తెలిసింది. జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడటం నా తప్పిదమేనని అంగీకరించి పార్టీకి క్షమాపణ చెప్పా. మాది అన్నదమ్ముల పంచాయితీ లాంటిది. మా యుద్ధం తెరాస, భాజపా మీదే’’ అని పేర్కొన్నారు.

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ వెనక్కి తీసుకోవాలి: ఎన్‌ఎస్‌యూఐ
గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఇంటర్‌పరీక్షల షెడ్యూల్‌ను వెనక్కి తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్‌ చేసింది. విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్‌ చేయాలంది. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు శనివారం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని