దళిత సమాజానికి ద్రోహం చేసిన భాజపా

ప్రధానాంశాలు

దళిత సమాజానికి ద్రోహం చేసిన భాజపా

సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శ

ఈనాడు డిజిటల్‌- కరీంనగర్‌, న్యూస్‌టుడే- హుజూరాబాద్‌ పట్టణం: హుజూరాబాద్‌లో అమలవుతున్న దళితబంధు పథకం నిలుపుదల చేయించి భాజపా దళిత సమాజానికి ద్రోహం చేసిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సామాజిక బాధ్యతతో తమపార్టీ అమలు చేస్తున్న మంచి పథకాన్ని ఆపే విషయంలో భాజపా కుట్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇది హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కోసం తీసుకొచ్చింది కాదని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌ సందర్భంగా దళిత సాధికారిత కోసం ఆచరణలో పెట్టిన బృహత్తర కార్యక్రమమని అన్నారు. సోమవారం రాత్రి హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపుగా 17 వేల పైచిలుకు మంది ఖాతాల్లో డబ్బులు వచ్చాక, యూనిట్లు గ్రౌండ్‌ అయ్యాక, రాజకీయ కుట్రతోనే ఆపారని విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే దళిత బంధును ఆపాలని భాజపా నేతలు ఈటల రాజేందర్‌, ప్రేమేందర్‌రెడ్డిలు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. దళిత కుటుంబాలు ఉన్నతంగా ఎదగాలనే కార్యక్రమాన్ని భాజపా ఆపడం దుర్మార్గ చర్య అన్నారు. ఏమీ తెలియనట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ సీఎంపై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సుంకె రవిశంకర్‌, రమేశ్‌, రాష్ట్ర నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ ఉపఎన్నికలో దళితుల మద్దతు తెరాసకు ఉంటుందని, భాజపాకు డిపాజిట్‌ దక్కదని ఎద్దేవా చేశారు.

భాజపా ఫిర్యాదుతోనే: మల్లేపల్లి లక్ష్మయ్య

ఈనాడు, హైదరాబాద్‌: దళిత బంధును హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమలు చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసి, దాన్ని ఆపడం ఎస్సీ వ్యతిరేక చర్య అని దళిత అధ్యయనాల కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దీనికి భాజపా తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు.

ఎస్సీల అభివృద్ధిని ఓర్వలేకపోయారు: బాలమల్లు

ప్రతి ఎస్సీ కుటుంబం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా కేసీఆర్‌ దళిత బంధు పథకం తీసుకురాగా.. భాజపా నాయకులు దళితుల ఎదుగుదలను ఓర్వలేక దాని నిలిపివేతకు కుట్ర చేశారని టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు విమర్శించారు. ఈ పథకంతో రాజకీయంగా పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘానికి భాజపా లేఖ రాసిందని ఆరోపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని