క్లీన్‌స్వీప్‌పై కోహ్లీసేన గురి!

తాజా వార్తలు

Updated : 07/12/2020 17:26 IST

క్లీన్‌స్వీప్‌పై కోహ్లీసేన గురి!

సిడ్నీ వేదికగా రేపు భారత్‌×ఆసీస్‌ ఆఖరి టీ20

ఇంటర్నెట్‌డెస్క్: తొలి రెండు వన్డేల అనంతరం ఆస్ట్రేలియా పర్యటన భారత్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని భావించారంతా. కానీ కోహ్లీసేన అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే టీ20 సిరీస్‌ కైవసం చేసుకుని వన్డే సిరీస్‌ పరాభవానికి బదులు తీర్చుకుంది. అదే ఉత్సాహంతో సిడ్నీ వేదికగా మంగళవారం జరగనున్న ఆఖరి టీ20లోనూ విజయం సాధించి.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు సొంతగడ్డపై వైట్‌వాష్‌కు గురికాకుండా పరువు నిలుపుకోవాలని ఆసీస్‌ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నామమాత్రపు మ్యాచ్‌ అయినా పోరు హోరాహోరీగా సాగడం ఖాయమనిపిస్తోంది.

2016లో తరహాలోనే..!

2016లో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన భారత్ తొలుత వన్డే సిరీస్‌ను కోల్పోయింది. కానీ తర్వాత జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ సారి కూడా అదే తరహాలోనే టీమిండియా పొట్టిఫార్మా‌ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఆటగాళ్లందరు లయను అందుకోవడంతో ఆసీస్‌ను మరోసారి మట్టికరిపించడం భారత్‌కు కష్టతరమేమి కాదు. ఆల్‌రౌండర్‌ జడేజా గాయంతో జట్టుకు దూరమైనా, కీలక పేసర్లు బుమ్రా, షమికి విశ్రాంతినిచ్చినా సిరీస్‌ గెలవడం కోహ్లీసేనకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.

నటరాజన్ ప్రదర్శన సంచలనం

పేసర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌, నటరాజన్ గొప్పగా రాణిస్తున్నారు. ఈ ముగ్గురు ఆడిన మ్యాచ్‌లు మొత్తంగా 30 కూడా లేవు. అయినా పేస్‌దళం బాధ్యతల్ని గొప్పగా నిర్వర్తిస్తున్నారు. యువ పేసర్‌ నటరాజన్‌ బౌలింగ్‌ ప్రదర్శన సంచలనం. అతడి బంతుల్ని ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. యార్కర్లు, ఆఫ్ కట్టర్లతో పాటు నెమ్మది బంతులతో కంగారూలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. రెండో టీ20లో నటరాజన్‌ కట్డడిచేసిన పరుగులే భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాయి. అతడితో పాటు శార్దూల్‌ ఠాకూర్‌ నకుల్ బంతులతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తన పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఆరో బౌలర్‌ లేకపోవడం భారత్‌కు ఇబ్బంది పెడుతోంది. చాహల్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ మరో బౌలర్‌ లేక అతడితోనే కోహ్లీ నాలుగు ఓవర్లు వేయించాడు.

ఇక బ్యాటింగ్ విషయానికొస్తే రోహిత్, జడేజా గైర్హాజరీలోనూ టీమిండియా అత్యంత పటిష్ఠంగా ఉంది. కేఎల్ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య సూపర్‌ ఫామ్‌లో ఉండటం, శిఖర్‌ ధావన్‌, విరాట్ కోహ్లీ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం భారత్‌కు కలిసొస్తుంది. సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ భారీ షాట్లు స్కోరు వేగానికి దోహదపడుతున్నాయి. మనీష్‌ పాండే గాయం కారణంగా శ్రేయస్‌ ఆఖరి మ్యాచ్‌లోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండో టీ20లో విజయాన్ని నిర్ణయించింది మిడిల్‌ ఓవర్లే. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మిడిల్‌ఓవర్లలో నెమ్మదిగా సాగగా, కోహ్లీ ముచ్చటైన షాట్లతో రన్‌రేటును నియంత్రణలో ఉంచాడు. రేపటి మ్యాచ్‌లోనూ భారత బ్యాట్స్‌మెన్ సమష్టిగా పోరాడితే ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఖాయం.

ఆఖరి టీ20లో ఫించ్‌?

డేవిడ్ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌, మిచెల్ స్టార్క్‌, హేజిల్‌వుడ్, కమిన్స్‌ జట్టులో లేకపోవడం ఆసీస్‌కు ప్రతికూలాంశంగా మారింది. అయితే కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ చివరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మాథ్యూ వేడ్‌ దూకుడుగా ఆడటం ఆ జట్టుకు కాస్త ఊరట కలిగిస్తుంది. స్మిత్‌తో పాటు మాక్స్‌వెల్‌, స్టాయినిస్‌ జట్టు బాధ్యతలను అందుకుంటే భారత్‌ను నిలువరించవచ్చని ఆసీస్ ఆశిస్తోంది. అయితే మూడో టీ20లోనూ ఓటమిపాలైనా కంగారూలకు టెస్టు సిరీస్‌పై ఎక్కువ ప్రభావం చూపించకపోవచ్చు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడే ఆటగాళ్లు పొట్టిఫార్మాట్‌ సిరీస్‌లో ఎక్కువ మంది లేకపోవడమే దానికి కారణం.

తుదిజట్టు (అంచనా)

భారత్‌: ధావన్‌, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్య, సుందర్‌, శార్దూల్, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, చాహల్‌

ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్‌ (కెప్టెన్‌), షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, స్టాయినిస్, మాక్స్‌వెల్, హెన్రిక్స్‌, అబాట్‌, డేనియల్‌‌, స్వెప్సన్‌‌, జంపా, ఆండ్రూ టై

ఇదీ చదవండి

ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్న రోహిత్‌?

ఏడాదిగా కోహ్లీసేన జైత్రయాత్ర.. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని