మే పల్‌ దో పల్‌కా షాయర్‌
close

తాజా వార్తలు

Updated : 16/08/2020 15:45 IST

మే పల్‌ దో పల్‌కా షాయర్‌

‘‘నేను కవిని. అది క్షణ కాలానికో.. రెండు క్షణాలకో. నా కథ ఒకటో రెండో క్షణాల్లో ముగుస్తుంది. నా ఉనికీ అంతే. నా యవ్వనమూ క్షణమో రెండు క్షణాలో ఉంటుంది. నా కన్నా ముందు ఎంతో మంది కవులు వచ్చారు.. వెళ్లారు. రేపు ఇంకొందరు వస్తారు. వాళ్లు నాకన్నా బాగా రాస్తారు’’.

రిటైర్మెంట్‌ ప్రకటిస్తూ ధోని గుర్తు చేసుకున్న పాట (మే పల్‌ దో పల్‌కా షాయర్‌)లో కొంత భాగమిది. ప్రతి ఒక్కరి కథా ఏదో ఒక రోజు ముగియాల్సిందే, కొత్త కథ ప్రారంభం కావాల్సిందే అన్న భావంతో ధోని ఈ పాటను పోస్ట్‌ చేసి ఉండొచ్ఛు.


వివాదరహితుడు..

ధోని నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా వ్యవహరిస్తాడు. కానీ ఎప్పుడూ సహనం కోల్పోడు. మైదానంలోనే కాదు.. మైదానం బయట కూడా. తాను ఎంత పెద్ద సెలెబ్రిటీ అతడు ఏనాడూ అహంకారాన్ని ప్రదర్శించలేదు. తన స్థాయితో ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నించలేదు. ఎల్లప్పుడూ అనకువగా ఉన్నాడు. దాంతో పాటు ఎప్పుడూ ఓర్పుతో ఉండడం, ఆవేశపడకపోవడం వల్ల ధోని తన కెరీర్‌లో చివరి రోజు వరకూ వివాదరహితుడిగా ఉన్నాడు. ధోనీనే తన కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడంటూ యువరాజ్‌ తండ్రి అనేకసార్లు నోరుపారేసుకున్నా ధోని స్పందించలేదు. గంభీర్‌ కూడా ఎన్నోసార్లు తనన రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించినా అతడు విస్మరించాడు. స్వయంగా యువరాజ్‌ కూడా తనకు ధోని మద్దతివ్వలేదని, అతడికి ఫేవరెట్‌ క్రికెటర్లున్నారని అన్నా మహి మౌనాన్నే ఆశ్రయించాడు. సీనియర్లతో తనకు విభేదాలున్నాయని జోరుగా ఊహాగానాలు సాగినా ధోని ఆవేశపడలేదు. అతడే స్పందిస్తే వివాదాలు చెలరేగేవే.


హెలికాప్టర్‌ షాట్‌

ధోని అనగానే గుర్తొచ్చేది హెలికాప్టర్‌ షాట్‌! యార్కర్‌గా పడిన బంతిని భుజ బలంతో ఈడ్చి కొట్టినట్లు ఆడే ఈ షాట్‌ ధోనీకే సొంతం. కెరీర్‌ ఆరంభంలో ఈ షాట్‌తో అతను కొట్టే సిక్సర్లు సంచలనం రేపాయి. ఎంతోమంది ఈ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.


పేలాడు డైనమైట్‌లా!

ధోని తన కెరీర్‌ ఆరంభంలోనే డైనమైట్‌లా పేలాడు! అప్పటిదాకా వికెట్‌కీపర్‌ అంటే బ్యాటింగ్‌ ఆర్డర్లో దిగువన వచ్చి ఎన్నో కొన్ని పరుగులు సాధిస్తే చాలు అన్నట్లు ఉండేవాళ్లు. కానీ ధోని కథ మార్చేశాడు. 2005లో విశాఖలో పాక్‌తో వన్డేలో 123 బంతుల్లో 148 పరుగుల ఇన్నింగ్స్‌తో మొదలైంది అతని ధనాధన్‌ ప్రస్థానం. ఆ తర్వాత శ్రీలంకపై అతనాడిన 183 పరుగుల ఇన్నింగ్స్‌ సరికొత్త మహిని అభిమానులకు పరిచయం చేసింది. ధోనీది ఆరంభం నుంచి చివరిదాకా ఒకే జోరు. బాదుడే బాదుడు. అందుకే మహి అభిమానులకు తెగ నచ్చేశాడు. ఆటగాడిగానే కాదు కెప్టెన్‌గానూ ఆరంభంలోనే ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ దూకుడు ప్రదర్శించాడు. 2007 వన్డే ప్రపంచకప్‌ ఓటమితో ఢీలా పడిన భారత క్రికెట్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించి వెలుగును నింపాడు. అక్కడి నుంచి ఎదురే లేదతడికి.


అతనంతే...!

తనదైన నాయకత్వంతో భారత క్రికెట్‌ దశా దిశా మార్చాడు సౌరభ్‌ గంగూలీ. అయితే గంగూలీకి దూకుడే బలం కాగా.. దానికి భిన్నమైన తీరుతో భారత కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు మహి. భారత క్రికెట్‌ ఇంకా ఉన్నత శిఖరాలకు చేర్చాడు. మధ్యలో జట్టు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. మళ్లీ దాన్ని గాడిన పెట్టి కోహ్లి చేతికి అందించాడు. 2014లో విరాట్‌ తాత్కాలిక కెప్టెన్‌గా ఓ మ్యాచ్‌లో సత్తా చాటుకోగానే.. సిరీస్‌ మధ్యలో ఉన్నట్లుండి టెస్టులకు వీడ్కోలు చెప్పేశాడు ధోని. ఆపై విరాట్‌ వన్డే కెప్టెన్‌గా సిద్ధం అనుకోగానే పగ్గాలు వదిలేశాడు. జట్టు అవసరం రీత్యా ఆటగాడిగా కొనసాగిన అతను.. ఇప్పుడు ఎవరూ తన రిటైర్మెంట్‌ గురించి చర్చించని సమయంలో కూల్‌గా.. ఏ హడావుడీ లేకుండా వన్డేలు, టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. వచ్చే నెలలో మొదలు కానున్న ఐపీఎల్‌లో ఆడి సత్తా నిరూపించుకుంటే మళ్లీ మహి భారత జట్టులోకి వస్తాడని అభిమానులు అనుకుంటుండగా.. ఇలా హఠాత్తుగా రిటైర్మెంట్‌ ప్రకటించేశాడు.


రికార్డులే రికార్డులు

వన్డేల్లో 200 సిక్స్‌లు కొట్టిన ఏకైక భారత ఆటగాడు ధోని. మొత్తంగా అతనిది అయిదో స్థానం.

వన్డేల్లో ఒక వికెట్‌కీపర్‌ అత్యధిక స్కోరు (183 నాటౌట్‌, శ్రీలంకపై 2005లో) మహి పేరిటే ఉంది.

50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్టంపింగ్‌ల (120) రికార్డు కూడా మహిదే.

ఒక భారత కెప్టెన్‌ సాధించిన అత్యధిక టెస్టు విజయాల (27) రికార్డు ధోనీదే.

టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు (54), కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు (72), సారథిగా అత్యధిక విజయాలు (41) మహి ఖాతాలోనే ఉన్నాయి.


రనౌట్‌తో మొదలెట్టి.. ముగించి

ధోని కెరీర్‌ ఆరంభించింది రనౌట్‌తోనే.. కెరీర్‌ను ముగించింది కూడా రనౌట్‌తోనే కావడం యాదృచ్ఛికం! 2004లో బంగ్లాదేశ్‌పై ఆడిన తొలి వన్డేలో అతను మొదటి బంతికే రనౌట్‌ అయ్యాడు. కెరీర్‌లో తన చివరి మ్యాచ్‌ అయిన 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ రనౌట్‌గానే అతను వెనుదిరిగాడు.


ఎన్నో ఉత్కంఠభరిత పోరాటాలను జట్టుకు అనుకూలంగా మలిచాడు. భిన్న ఫార్మాట్లలో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. హెలికాప్టర్‌ షాట్లను ప్రపంచ క్రికెట్‌ కోల్పోనుంది మహీ.

- హోం మంత్రి అమిత్‌ షా


భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సహకారం అపారమైంది. మనం కలిసి 2011 ప్రపంచకప్‌ గెలవడం నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్న నీకు, నీ కుటుంబానికి అభినందనలు.

​​​​​​- సచిన్‌ తెందుల్కర్‌


ఏ క్రికెటరైనా ఏదో ఓ రోజు తన ప్రయాణాన్ని ముగించాలి. కానీ మనకు బాగా తెలిసిన వ్యక్తి అలా చేస్తే భావోద్వేగాలను దాచుకోవడం కష్టం. దేశానికి నువ్వు చేసిన సేవ ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

- కోహ్లి


ఒక శకానికి ముగింపు ఇది. దేశం, ప్రపంచ క్రికెట్‌ చూసిన అద్భుతమైన ఆటగాడు ధోని. అతని నాయకత్వ లక్షణాలను అందుకోవడం కష్టం.

- సౌరభ్‌ గంగూలీ


ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన కుర్రాడు.. మ్యాచ్‌ విజేతగా మారడంతో పాటు ప్రపంచం మెచ్చే సారథిగా ఎదిగిన ధోని ప్రయాణాన్ని నేను చూశా.

- లక్ష్మణ్‌


వన్డేల్లో భారత కెప్టెన్లలో చూసుకుంటే ధోని, కపిల్‌దేవ్‌ అగ్రస్థానంలో ఉంటారు. ఎందుకంటే వాళ్లు ప్రపంచకప్‌లు గెలిచారు. మొత్తంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ను తీసుకుంటే కపిల్‌ కంటే ధోని ముందుంటాడు.

- గావస్కర్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని