మణికట్టు మాయాజాలమేది యూజీ?

తాజా వార్తలు

Published : 18/03/2021 01:25 IST

మణికట్టు మాయాజాలమేది యూజీ?

వరుసగా విఫలమవుతున్న చాహల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఊరించే బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించడం యుజ్వేంద్ర చాహల్‌ ప్రత్యేకత. ఎన్నో సందర్భాల్లో బ్యాటర్లు సిక్సర్లు బాదేస్తున్నా అతడిదే వ్యూహంతో విజయవంతం అయ్యాడు. ప్రత్యర్థికి భయపడకుండా బంతులేసి వికెట్లు తీస్తాడు. మణికట్టు మాయాజాలం ప్రదర్శిస్తాడు. అందుకే అతడిని జట్టులో ఉంచుకొనేందుకు కోహ్లీ మొగ్గు చూపిస్తుంటాడు.

అలాంటిది కొన్నాళ్లుగా యూజీ ప్రదర్శన నామమాత్రంగా మారింది. మునుపటి స్థాయిలో వికెట్లు తీయడం లేదు. ఎక్కువ పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో అతడి ప్రదర్శన మరీ పేలవం! తొలి టీ20లో 44, రెండో టీ20లో 34, మూడో టీ20లో 41 పరుగులు ఇచ్చాడు. మ్యాచుకు ఒకటి చొప్పున 3 వికెట్లే తీశాడు. ఆంగ్లేయులను బోల్తా కొట్టించడంలో విఫలమయ్యాడు. అతడి బంతుల్ని వారు అలవోకగా ఆడేస్తున్నారు. సునాయాసంగా బౌండరీ ఆవలకు పంపించేస్తున్నారు.

చివరి 15 నెలల్లో 12 టీ20లు ఆడిన చాహల్‌ కేవలం 10 వికెట్లే తీయగలిగాడు. ఎకానమీ రేటు పైపైకి చేరుకుంటోంది. 2020, జనవరికి ముందు 36 టీ20ల్లో 21.9 సగటు, 8.1 ఎకానమీతో అతడు 52 వికెట్లు తీశాడు. 2020, జనవరి నుంచి 11 మ్యాచులాడి 43.88 సగటు, 9.3 ఎకానమీతో 9 వికెట్లే తీయడం గమనార్హం. వన్డేల్లోనూ ఇదే పరిస్థితి. 2020కి ముందు 85 మ్యాచుల్లో 26.42 సగటు, 5.06 ఎకానమీతో 50 వికెట్లు పడగొట్టాడు. 2020, జనవరి నుంచి 4 మ్యాచులాడి 37.85 సగటు, 6.79 ఎకానమీతో 7 వికెట్లే తీశాడు.

మ్యాచ్‌కు తగ్గట్టు సరైన లైన్‌, లెంగ్త్‌ను ఎంచుకోవడంలోనూ యూజీ ఇబ్బంది పడుతున్నాడు. క్యాచులు అందుకోవడంలోనూ విఫలమవుతున్నాడు. అందుకే అతడి స్థానంలో మరొకరికి చోటు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎకానమీ, సగటు పడిపోతున్నా అతడినెందుకు కొనసాగిస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. బహుశా తర్వాతి మ్యాచుల్లో అతడి బదులు అక్షర్‌ పటేల్‌ను ఆడించినా ఆశ్చర్యం లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని