close
ఒకే బంతి ఎందుకు..?

ఎంసీసీ ప్రతిపాదనను తప్పుపట్టిన సన్నీ
ముంబయి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే అన్ని దేశాలు ఒకే బంతిని ఉపయోగించాలని మారిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ప్రతిపాదించడాన్ని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ దుయ్యబట్టాడు. ఆ క్లబ్‌ ప్రతిపాదనకు ఐసీసీ ఆమోదం తెలిపితే దురదృష్టకరమని అన్నాడు. వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఆరంభమయ్యే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అన్ని దేశాలు ఒకే బంతిని వాడాలని ఎంసీసీ ప్రపంచ క్రికెట్‌ కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ‘‘బంతిని ప్రమాణీకరించేందుకు ఎంసీసీ ప్రయత్నిస్తోందని తెలిసింది. అలాగే పిచ్‌లను, బ్యాట్‌ను.. ఇలా క్రికెట్లో అన్నింటినీ ప్రమాణీకరించే ప్రయత్నం చేయొచ్చు. ఇలా అందరూ ఒకే పరిస్థితుల్లో ఆడాలంటే.. ఇక విదేశీ పర్యటనలకు అర్థమేముంటుంది’’ అని గావాస్కర్‌ ప్రశ్నించాడు. ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ బంతులు వాడతారు. ప్రస్తుతం భారత్‌లో ఎస్జీ.. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌లలో డ్యూక్స్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పాటు మిగతా దేశాల్లో కూకబుర్ర బంతులను ఉపయోగిస్తున్నారు. ‘‘భారత్‌లో క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ క్రికెట్‌ క్లబ్‌ల మాదిరిగానే ఎంసీసీ ఒకటి. కానీ ఎంసీసీ మాత్రం తాము చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తోంది. దురదృష్టవశాత్తు నిర్ణయం తీసుకోవాల్సిన చాలామంది ఆ క్లబ్‌ మాట వింటున్నారు’’ అని చెప్పాడు. ఇంట, బయట భిన్నమైన పరిస్థితుల్లో ఆడటమే టెస్టు క్రికెట్‌ను ప్రత్యేకంగా నిలుపుతుందని సన్నీ అన్నాడు. ‘‘ఒక గల్లీ నుంచి మరో గల్లీకి వెళ్తేనే భిన్నమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటిది వివిధ దేశాల్లో తెలియని పరిస్థితుల్లో ఆడటం అన్ని దేశాలకు ఓ సవాల్‌. టెస్టు క్రికెట్‌ను ప్రత్యేకంగా నిలిపేది ఇదే.  విదేశాల్లో రాణించడంపైనే ఆటగాళ్లకు గుర్తింపు లభిస్తుంది’’ అని వివరించాడు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.