
ఈ పతకం ఆమెకే అంకితం
‘ఈనాడు’తో పి.వి.సింధు
ఈనాడు - హైదరాబాద్
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం కోసం ఆర్నెల్లుగా కష్టపడ్డానని.. అందుకు ప్రతిఫలం దక్కిందని పి.వి.సింధు తెలిపింది. ఆదివారం ఒకుహరపై విజయానంతరం సింధు ఇచ్చిన ఇంటర్వ్యూ ‘ఈనాడు’కు ప్రత్యేకం.
వరుసగా మూడో ఏడాది ఫైనల్ చేరడం.. స్వర్ణం సాధించడం ఎలాంటి అనుభూతినిస్తోంది?
బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్షిప్ అత్యున్నత టోర్నీ. ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోదు. పోటీ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. వరుసగా మూడో ఏడాది ఫైనల్ చేరుకోవడం కూడా ఓ ఘనతే. అలాంటిది స్వర్ణం సాధించడం అన్నిటికంటే గొప్ప. ఈ విజయాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. త్రివర్ణ పతాకం పైకి వెళ్తున్నప్పుడు.. జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు ఎంతో గర్వంగా.. గొప్పగా అనిపించింది.
ఈ స్వర్ణం నెగ్గిన తొలి భారత షట్లర్ కావడం ఎలా అనిపిస్తోంది?
ఈ రోజు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నా. నిరుడు రజతం లభించింది. అంతకుముందు ఏడాది రజతమే దక్కింది. ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించాలన్న కసితో వచ్చా. ఆర్నెల్లుగా కష్టపడ్డా. ఇప్పుడు ప్రతిఫలం లభించింది. భారత్‌కు తొలి స్వర్ణం అందించడం గర్వకారణం. కోచ్‌లు గోపీచంద్, కిమ్.. తల్లిదండ్రుల సహకారంతో ఇది సాధ్యమైంది.
ఫైనల్లో ఏ వ్యూహాలతో దిగారు?
ఇప్పటి వరకు మేదిద్దరం 15 సార్లు తలపడ్డాం. ఒకరి ఆటపై మరొకరికి పూర్తి అవగాహన ఉంది. తను ర్యాలీ ప్లేయర్. సుధీర్ఘంగా ర్యాలీలు ఆడుతుంది. ఆమె వ్యూహంలో చిక్కుకుంటే బయటకు రావడం కష్టం. అందుకే మొదటి పాయింటు నుంచే దూకుడుగా ఆడా. ర్యాలీలను తిప్పికొట్టాను. డిఫెన్స్‌ను దెబ్బతీశా. దీంతో ఒకుహర ఒత్తిడిలోకి వెళ్లింది.
గత రెండు ఫైనల్స్‌లో ఓడినా.. ఈసారి ఒత్తిడి కనిపించలేదే?
ఆటలో గెలుపోటములు భాగం. కోర్టులో దిగాక నూటికి నూరుశాతం ప్రదర్శన ఇవ్వడమే ముఖ్యం. గత ఫైనల్స్ గురించి ఆలోచించలేదు. అసలు ఫైనల్‌గానే భావించలేదు. క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌లాగే వెళ్లి సహజసిద్ధంగా ఆడా. నూటికి నూరుశాతం ప్రదర్శన ఇచ్చా.
క్వార్టర్స్‌లో తై జుపై విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందా?
కచ్చితంగా. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారిణుల్లో తై జు ఒకరు. యింగ్‌ను ఓడిస్తేనే స్వర్ణం నెగ్గుతానని తెలుసు. అందుకే క్వార్టర్స్ పోరులో తొలి గేమ్ కోల్పోయినా ఆశలు వదులుకోలేదు. వెనుకంజలో ఉన్నా కూడా ప్రతి పాయింటు కోసం పోరాడా. చివరి పాయింటు వరకు గెలుపు కోసం పోరాటంతో విజయం దక్కింది. క్వార్టర్స్‌లో గెలుపే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మలుపు.
ఈ పతకం ఎవరికి అంకితం?
ఈరోజు (ఆదివారం) అమ్మ పుట్టిన రోజు. ఆమెకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలనుకున్నా. ఈ పతకం అమ్మకే అంకితం. నేను ఈస్థాయికి చేరుకోడానికి తల్లిదండ్రులే కారణం.