పేస్‌ పంచ్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 17/03/2021 01:21 IST

పేస్‌ పంచ్‌

భారత బ్యాట్స్‌మెన్‌ మళ్లీ విఫలం
కోహ్లి మెరుపు ఇన్నింగ్స్‌ వృథా
దెబ్బ కొట్టిన వుడ్‌.. బాదేసిన బట్లర్‌
మూడో టీ20 ఇంగ్లాండ్‌దే
మొతేరా

ప్రత్యర్థి పేసర్ల బంతులు బుల్లెట్లలా దూసుకొచ్చాయి. మనవాళ్లు వికెట్‌ కాపాడుకోవడమే కష్టమైంది. పరుగుల రాక గగనమైంది. భారత్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో అయిదు పేసర్ల ఖాతాలోకే చేరాయి. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడబట్టి ప్రత్యర్థి ముందు మెరుగైన లక్ష్యమే నిలిచింది. కానీ ప్రత్యర్థి పేస్‌ దళం చెలరేగిన అదే పిచ్‌పై మన పేసర్లు తేలిపోయారు. వాళ్ల బంతుల్లో పదునే లేదు. స్పిన్నర్లు కొంత ఒత్తిడి తెచ్చినా.. ఇంగ్లాండ్‌ విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ మీద అది పెద్దగా పని చేయలేదు. 157 పరుగుల లక్ష్యాన్ని 10 బంతులుండగానే ఉఫ్‌మనిపించేసిన ఇంగ్లాండ్‌ సిరీస్‌లో మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

భారత అభిమానుల సంతోషం ఒక రోజు ముచ్చటే అయింది. ఇంగ్లాండ్‌తో అయిదు టీ20ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో పరాభవం తర్వాత, రెండో మ్యాచ్‌లో పుంజుకుని ప్రత్యర్థిని దెబ్బకు దెబ్బ తీసిన భారత్‌.. మూడో మ్యాచ్‌లో మళ్లీ చతికిలపడింది. మంగళవారం భారత్‌ 8 వికెట్ల తేడాతో చిత్తయింది. మొదట భారత్‌ 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. వుడ్‌ (3/31), జోర్డాన్‌    (2/35)ల ధాటికి దెబ్బ తిన్న భారత్‌ను కోహ్లి (77 నాటౌట్‌; 46 బంతుల్లో 8×4, 4×6) ఆదుకున్నాడు. అనంతరం మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోస్‌ బట్లర్‌ (83 నాటౌట్‌; 52 బంతుల్లో 5×4, 4×6) విధ్వంసక ఇన్నింగ్స్‌తో విరాట్‌ శ్రమకు ఫలితం లేకుండా చేశాడు. బెయిర్‌స్టో (40 నాటౌట్‌; 28 బంతుల్లో 5×4) కూడా చెలరేగడంతో ఇంగ్లాండ్‌ 18.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని  ఛేదించింది. నాలుగో టీ20 గురువారం జరుగుతుంది.
పేసర్లు విఫలం: మొదట ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌కు, తర్వాత మన పేసర్ల బౌలింగ్‌కు అసలు పోలికే లేదు.భువనేశ్వర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. బంతుల్లో వేగమే లేకపోవడంతో బట్లర్‌ అలవోకగా ఆడేశాడు. భువి తొలి ఓవర్‌లో మాత్రమే బట్లర్‌ ఆచితూచి ఆడాడు. శార్దూల్‌ వేసిన రెండో ఓవర్‌ నుంచి అతను భారీ షాట్లకు దిగాడు. రాయ్‌ సైతం రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించాడు. కానీ చాహల్‌ బంతిని రివర్స్‌ స్వీప్‌ చేయబోయిన అతను వికెట్‌ పారేసుకున్నాడు. ఇక్కడి నుంచి ఇంగ్లాండ్‌కు ఇబ్బందే లేకపోయింది. ఓ ఎండ్‌లో మలన్‌ (18) ఆచితూచి ఆడుతుంటే.. బట్లర్‌ మరో ఎండ్‌లో విధ్వంసాన్ని కొనసాగించాడు. అతను ఏ బౌలర్‌నూ లెక్కచేయలేదు.చాహల్‌ బౌలింగ్‌ను కూడా అతను ఉతికారేశాడు. చూస్తుండగానే.. 26 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. జట్టు 81 పరుగుల వద్ద మలన్‌.. సుందర్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయినా ఇంగ్లాండ్‌కు ఇబ్బంది లేకపోయింది. తర్వాత బట్లర్‌కు బెయిర్‌స్టో మంచి సహకారమందించాడు. ఇద్దరూ ధాటిగా ఆడుతూ జట్టును గెలిపించారు.
విరాట్‌ ఒక్కడే..: అంతకుముందు భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం, ఒక దశ వరకు సాగిన చూస్తే తొలి టీ20కి రీప్లేలా కనిపించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 3 ఓవర్లకు 8/1తో నిలిచింది. మరీ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌కు.. మూడో ఓవర్లో షాక్‌ తగిలింది. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ రాహుల్‌ (0) వుడ్‌ బౌలింగ్‌లో బౌల్డయి వెనుదిరిగాడు. రెండు మంచి షాట్లు ఆడి జోరందుకున్నట్లు కనిపించిన రోహిత్‌ (15) సైతం వుడ్‌ వేసిన తర్వాతి ఓవర్లో ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గత హీరో ఇషాన్‌ కిషన్‌ (4) సైతం ఎంతోసేపు నిలవలేదు. పవర్‌ ప్లేలో ముగిసే సమయానికి స్కోరు 24/3. అప్పటికి భారత్‌ ఉన్న స్థితికి.. ఇంగ్లాండ్‌ ముందు 157 పరుగుల లక్ష్యాన్ని నిలపడం అద్భుతమే. ఇదంతా కోహ్లి పుణ్యమే. ముందు పంత్‌ (25; 20 బంతుల్లో 3×4)తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 11 ఓవర్లకు భారత్‌ 63/3తో కుదురుకుంది. అయితే ఉన్నంతసేపూ మెరుపులతో అలరించిన పంత్‌.. కోహ్లి కారణంగా రనౌటవడంతో ఇన్నింగ్స్‌ మళ్లీ ఒడుదొడుకులకు లోనైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (9)ను ఔట్‌ చేసిన వుడ్‌ భారత్‌ను మరోసారి దెబ్బ కొట్టాడు. 15 ఓవర్లకు 87/5తో ఉన్న భారత్‌.. తొలి టీ20 స్కోరునైనా అందుకుంటుందా అనిపించింది. కానీ చివరి 5 ఓవర్లలో కోహ్లి అనూహ్యంగా చెలరేగిపోయాడు.అతను చివరి 17 బంతుల్లో 49 పరుగులు చేయడం విశేషం. పాండ్య కూడా కొన్ని షాట్లు ఆడటంతో భారత్‌ 150 దాటింది.

ఒకప్పటి విరాట్‌..

మ్యాచ్‌లో భారత్‌ ఓడినా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ మాత్రం భారత అభిమానులకు భలే మజానిచ్చింది. గత మ్యాచ్‌లోనే కోహ్లి ఫామ్‌ అందుకుని జట్టును గెలిపించినప్పటికీ.. ఆ ఇన్నింగ్స్‌ అంత సాధికారికంగా ఏమీ సాగలేదు. అతను అంత ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. కిషన్‌ ధాటిగా ఆడి ఒత్తిడి తొలగించేయడంతో కోహ్లి కొంచెం ఆలస్యంగా జోరందుకున్నాడు. కానీ మూడో టీ20లో అలా కాదు. ఆద్యంతం విరాట్‌ బ్యాటింగ్‌ ఆకట్టుకుంది. తొలి టీ20 తరహాలోనే జట్టు కష్టాల్లో పడటంతో ఒక దశ వరకు కోహ్లి ఆచితూచి బ్యాటింగ్‌ చేశాడు. కానీ చివరి ఓవర్లలో అనూహ్యంగా చెలరేగాడు. మూడు వికెట్లతో భారత్‌ పతనాన్ని శాసించిన వుడ్‌ను అతడి చివరి ఓవర్లో బెంబేలెత్తించాడు. ఆ ఓవర్లో వరుసగా మిడ్‌వికెట్‌, మిడాఫ్‌ల్లో కోహ్లి బాదిన సిక్సర్లు మ్యాచ్‌కే హైలైట్‌. కుర్రాళ్ల తరహాలో అతను వికెట్‌ వెనుక స్వీప్‌ షాట్లు ఆడే ప్రయత్నం కూడా చేయడం విశేషం. చివర్లో జోర్డాన్‌ బంతికి ఆడిన కవర్‌ డ్రైవ్‌ కూడా అభిమానులను మైమరిపించింది.

రాహుల్‌కు ఏమైంది?

0, 1, 0.. ఇవీ ఈ సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ స్కోర్లు. బోలెడంతమంది యువ ప్రతిభావంతులు అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాహుల్‌ ఇలాంటి ప్రదర్శన చేయడం జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. అందులోనూ  ఓపెనింగ్‌ కోసం విపరీతమైన పోటీ ఉంది. రోహిత్‌ తొలి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోగా, ధావన్‌ను ఒక మ్యాచ్‌ ఆడించి పక్కన పెట్టారు. ఇషాన్‌ కిషన్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. రోహిత్‌ తిరిగి తుది జట్టులోకి రావడంతో అతణ్ని కిందికి దించి మరీ రాహుల్‌కు ఓపెనర్‌గా మరో ఛాన్స్‌ ఇచ్చారు. కానీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పేలవ రీతిలో ఔటయ్యాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) ఆర్చర్‌ (బి) వుడ్‌ 15; రాహుల్‌ (బి) వుడ్‌ 0; కిషన్‌ (సి) బట్లర్‌ (బి) జోర్డాన్‌ 4; కోహ్లి నాటౌట్‌ 77; పంత్‌ రనౌట్‌ 25; అయ్యర్‌ (సి) మలన్‌ (బి) వుడ్‌ 9; పాండ్య (సి) ఆర్చర్‌ (బి) జోర్డాన్‌ 17; ఎక్స్‌ట్రాలు 9

మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156;

వికెట్ల పతనం: 1-7, 2-20, 3-24, 4-64, 5-86, 6-156;

బౌలింగ్‌: రషీద్‌ 4-0-26-0; ఆర్చర్‌ 4-0-32-0; వుడ్‌ 4-0-31-3; జోర్డాన్‌ 4-1-35-2; స్టోక్స్‌ 2-0-12-0; సామ్‌ కరన్‌ 2-0-14-0
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) రోహిత్‌ (బి) చాహల్‌ 9; బట్లర్‌ నాటౌట్‌ 83; మలన్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) సుందర్‌ 18; బెయిర్‌స్టో నాటౌట్‌ 40; ఎక్స్‌ట్రాలు 8

మొత్తం: (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 158;

వికెట్ల పతనం: 1-23, 2-81; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-27-0; శార్దూల్‌ 3.2-0-36-0; చాహల్‌ 4-0-41-1; పాండ్య 3-0-22-0; సుందర్‌ 4-0-26-1

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన