close

తాజావార్తలు

టీమిండియా కోచ్‌ పదవికి జయవర్దనె దరఖాస్తు?

రోహిత్‌ శర్మ కోరాడా అన్న సందేహాలు!

ముంబయి: టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగియడంతో కొత్త కోచ్‌ కోసం అన్వేషణ మొదలైంది. ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉండాలని, వయసు 60కి మించరాదని నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరకు ఎంతమంది ఆసక్తి చూపించారో తెలియలేదు. ఐతే శ్రీలంక మాజీ ఆటగాడు, ముంబయి ఇండియన్స్‌ కోచ్‌ మహేళా జయవర్దనె టీమిండియా కోచ్‌ పదవికి దరఖాస్తు చేయబోతున్నారని సమాచారం. అతడితో పాటు గ్యారీ కిర్‌స్టన్‌, టామ్‌ మూడీ పోటీపడతారని తెలుస్తోంది.

ఐపీఎల్‌లో ముంబయికి జయవర్దనె 2 సార్లు ట్రోఫీ అందించాడు. కొన్నాళ్లు ఇంగ్లాండ్‌కు తాత్కాలిక కోచ్‌గానూ ఉన్నారు. 100 బంతుల క్రికెట్‌లో సదరన్‌ బ్రేవ్‌ జట్టు కోచ్‌ పదవికీ ముందంజలో ఉన్నాడని సమాచారం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ టామ్‌ మూడీ, టీమిండియా మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌కూ భారత గడ్డపై, జట్టుపై మంచి అవగాహన ఉంది. 

ప్రపంచకప్‌తోనే రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. విండీస్‌ పర్యటన వరకు గడవు పొడగించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయనప్పటికీ రవిశాస్త్రి పోటీలో ఉంటారని బీసీసీఐ తెలిపింది. గతంలోనూ ఎంతోమంది టీమిండియా కోచ్‌ పదవి కోసం ఆసక్తి చూపించారు. ఈ సారి కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామి నేతృత్వంలోని కమిటీ కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది. ఇంతకు ముందు కోహ్లీతో విభేదాల కారణంగా కుంబ్లే పదవి నుంచి తప్పుకున్నాడు. దాంతో విరాట్‌కు అనుకూలంగా ఉన్న రవిశాస్త్రి వైపు గంగూలీ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ మొగ్గు చూపింది. ఐతే కపిల్‌ దేవ్‌ మాత్రం కోహ్లీ చెప్పినట్టు ఆడే రకం కాదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవంతమైన కోచ్‌గా అనుభవం ఉన్న జయవర్దనెను ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు!

గతంలో కోచ్‌గా ఎవరు కావాలని అడగ్గా రవిశాస్త్రినే చేయాలని కోహ్లీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఈ సారి మాత్రం అలా జరిగేందుకు ఆస్కారం లేనట్టు కనిపిస్తోంది. జట్టులో మరో సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మతో కోహ్లీకి విభేదాలు పొడసూపాయని సమాచారం. మూడు సీజన్లకు కోచ్‌గా ఉన్న జయవర్దనె ముంబయి ఇండియన్స్‌కు రెండు సార్లు ట్రోఫీ అందించాడు. రోహిత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అతడు ఎంపికైతే ఇక టీమిండియాలో రోహిత్‌ ప్రాబల్యం పెరిగే అవకాశాన్నీ కొట్టిపారేయలేం. వీరిద్దరిదీ విజయవంతమైన జోడీ. బహుశా కోచ్‌ పదవికి దరఖాస్తు చేయాలని జయవర్దనెను హిట్‌మ్యానే కోరాడా?అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.