ఐటీ సంస్థలపై సైబర్‌ దాడులు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీ సంస్థలపై సైబర్‌ దాడులు

దేశవ్యాప్తంగా 11 నెలల్లో   17 లక్షల ఫిర్యాదులు
కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెల్లడి
వీపీఎన్‌కు అనుసంధానమైతే  మేలంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌:  కరోనా వైరస్‌ ఓవైపు ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తుండగా.. కొందరు దీన్ని సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారు. మహమ్మారి నియంత్రణలో భాగంగా ఐటీ, కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోం పద్ధతిలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. సాధారణంగా ఐటీ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో సైబర్‌ దాడులను తట్టుకునే వ్యవస్థ ఉంటుంది. వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానంలో పనిచేస్తున్న ఐటీ, కార్పొరేట్‌ సంస్థల అధికారులు, ఉద్యోగులు ప్రధాన కార్యాలయాల్లో వినియోగిస్తున్న వీపీఎన్‌ (వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌) వాడడం లేదు. వీరి నెట్‌వర్క్‌లోని భద్రత లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరస్థులు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలోకి ఫిషింగ్‌, ఇతర మెయిల్స్‌ ద్వారా చొరబడుతున్నారు. ఐటీ సంస్థల వెబ్‌సైట్లు, అధికారిక మెయిల్స్‌ను హ్యాక్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె నగరాల్లో వారి దాడుల తీవ్రత ఎక్కువగా ఉంది. వర్క్‌ ఫ్రమ్‌ హోంతో పాటు వీడియో సమావేశాలు, గూగుల్‌ మీట్‌లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ సైబర్‌ దాడులపై దేశవ్యాప్తంగా 17 లక్షల ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు నివేదించింది. 2019తో పోలిస్తే 2020లో సైబర్‌ దాడులు 300 శాతం పెరిగాయని నివేదికలో పేర్కొంది. ఇళ్ల నుంచి పనిచేస్తున్నా వీపీఎన్‌కు అనుసంధానమైతే సైబర్‌ దాడులను అడ్డుకునేందుకు వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
డేటా చోరీ.. రాన్సమ్‌వేర్‌
సైబర్‌ నేరస్థులు కార్పొరేట్‌, ఐటీ సంస్థల డేటా చోరీ చేస్తున్నారు. వాటిని ఇతర సంస్థలకు విక్రయిస్తామంటూ బెదిరిస్తున్నారు. నెట్‌వర్క్‌ పనిచేయకుండా రాన్సమ్‌వేర్‌ను ప్రయోగిస్తున్నారు. దాన్ని తొలగించేందుకూ రూ.లక్షలు అడుగుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఓ బహుళజాతి సంస్థ వినియోగదారుల జాబితాను రెండు నెలల క్రితం సైబర్‌ నేరస్థులు తస్కరించారు. రూ.50 లక్షలిస్తే డేటాను తిరిగిస్తామంటూ బెదిరించారు. ఆ కంపెనీ వద్ద మరో జాబితా ఉండడంతో సొమ్ము ఇవ్వబోమని తెగేసి చెప్పింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు