
రాయలసీమలోని ఒక గ్రామంలో కొత్త వ్యాధి పుట్టింది. అది సోకినవారు పదిరోజులు చిత్రహింసలు అనుభవించి చనిపోతున్నారు. ఆ వైరస్ని గుర్తించి చికిత్సను కనుగొనే బాధ్యత చేపట్టిన వైరాలజిస్టు గౌతమ్కి పరిశోధనలో సహాయకుడిగా అతడిని ద్వేషించే సత్యనారాయణ ఉంటాడు. గౌతమ్ని చంపాలనుకున్న సత్యనారాయణ ఏమయ్యాడు, వైరస్నీ దానికి చికిత్సనీ గౌతమ్ కనుగొన్నాడా అన్నది కథ. కొంచెం రొమాన్స్, మరికొంచెం ఉత్కంఠలతో సాగే నవల రోగలక్షణాలు తప్ప మిగతాదంతా కరోనాను గుర్తుచేస్తుంది. భార్య ద్వారా భర్తకు అంటుకున్న సుఖవ్యాధి కాపురంలో కల్లోలం రేపుతుంది. ఆ రోగానికి అసలు కారణమేమిటో చెప్పే నవల ‘ది లవ్ జర్మ్’ కూడా ఇందులో ఉంది.
-పద్మ
కొత్త శత్రువు(నవల)
రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి
పేజీలు: 281; వెల: 315/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు
నడచి వచ్చిన దారి
కవిత అనగానే గుర్తొచ్చే వస్తువులే ఇందులో ఉన్నవన్నీ. వాటినే పకడ్బందీగా భాషలో బంధించి సంధిస్తాడు కవి. ఆవేశంలో కవిత్వాన్ని అద్భుతంగా ఒదిగిస్తాడు. ‘చచ్చిపోతున్న ఆశ బతకనంటోంది/ బతకనిస్తున్న ఆశ చావనంటోంది’(సంఘర్షణ), ‘కథ ముగిసి కదలుతున్న తరం/ఆ వెనుక మనం’(సభ జరిగిన రోజు) వంటి పంక్తులైతే నిగూడార్థ నినాదాలనిపిస్తాయి. కవి రెండు దశాబ్దాల కాలంలో రాసిన కవితల సమగ్ర సంకలనం ఇది. అందుకే ‘దుర్భేద్యపు నిగూఢాల్ని/ యుగాలుగా పుక్కిట పుణికిన/ అంతు తెలియని సృష్టి’ అన్న బరువైన పదబంధాలతోపాటూ దానికి సరితూగేలా ‘సావురాక/ బతకలేక/ ఆరిపోతున్న కుంపట్లోతిగ/ గోడమొత్తలెమ్మటి/ మూడుకాళ్ళ తోలుతిత్తులు’(ఏమున్నది) వంటి మాండలికాలూ కనిపిస్తాయి.
- అంకిత
ఆర్తి(కవిత్వం)
రచన: బైరెడ్డి కృష్ణారెడ్డి
పేజీలు: 312; వెల: రూ. 300/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు
వస్తువైవిధ్యం
గతేడాది వచ్చిన కథల నుంచి ఏరి కూర్చిన 44 కథల సమాహారం ఈ పుస్తకం. భిన్న కథావస్తువులతోనూ, వైవిధ్యభరితమైన శైలులతోనూ ఆకట్టుకుంటుంది. తన మాటే నెగ్గాలనే ఓ తల్లి పంతం బిడ్డ జీవితంలో సృష్టించిన కల్లోలమే ‘అపేక్ష’. మనుషులు ఒకరికి ఒకరు తోడు అనుకుంటే అసలు అనాథలే ఉండరని చెప్పే కథ ‘అమ్మ దొరికింది’. ఒకపూట ఆమె సాంగత్యం కోసం వచ్చిన అతడు ఆమె హృదయంలో స్థానం ఎలా పొందగలిగాడో చెబుతుంది ‘అంకితం’. నల్లగా ఉన్నందుకు ఎన్నో అవ
మానాలు ఎదుర్కొంటుంది స్వాతి. అలాంటిది ఆమెనే పెళ్లిచేసుకుంటానని వెతుక్కుంటూ వస్తాడు ఓ పోలీసు అధికారి. అందుకు కారణమేంటో చెప్పే కథ ‘నల్లబంగారం’.
- శ్రీ
మా కథలు 2019
సంకలనకర్త: సిహెచ్ శివరామప్రసాద్
పేజీలు: 347; వెల: రూ. 99/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు
ఉత్కంఠభరితం
చారిత్రక సంఘటనలను స్పృశిస్తూ విభిన్న కథాంశంతో రాసిన కాల్పనిక థ్రిల్లర్ ఇది. కథానాయకుడు జైకి పూర్వీకుల ద్వారా కాలచక్రంలోకి ప్రయాణించే జాకెట్ లభిస్తుంది. దానిద్వారా గతంలోకీ, భవిష్యత్తులోకీ అతడు ప్రయాణించ గలుగుతాడు. చరిత్రలోని సంఘటనలను కళ్ళారా చూస్తాడు. ఈ క్రమంలో విచిత్ర సన్నివేశాలకు అవకాశం ఏర్పడుతుంది. యుద్ధ వాతావరణ చిత్రణ, మహాత్మాగాంధీ హత్యను నివారించటానికి కథానాయకుడు చేసే ప్రయత్నాలూ ఆకట్టుకుంటాయి. గాంధీ మరణానికి కారణమైన తుపాకీ... బెరెట్టా 606824 ఎన్నో దేశాలను దాటి భారతదేశానికి వస్తుంది. అదే ఆయుధం తర్వాతి కాలంలో గాంధీ వేషం వేసుకున్న క్రిమినల్ను చంపటానికి ఉపయోగపడుతుంది. ఒక్కో అధ్యాయాన్ని ఒక్కో రంగుతో పోల్చుతూ దాని అంతరార్థం ప్రతిఫలించేలా కథనం సాగించారు రచయిత.
- సీహెచ్. వేణు
బెరెట్టా 606824(నవల)
రచన: అమిరిశెట్టి గోపాల్
పేజీలు: 272; వెల: 250/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్