close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మా ఊరూ... మా నీరూ..!

‘నా దగ్గర ఇల్లూ డబ్బూ కారూ... అన్నీ ఉన్నాయి. నీ దగ్గర ఏముంది’ ఓ పాత సినిమాలో అన్న అడిగిన ప్రశ్నకి ‘నా దగ్గర అమ్మ ఉంది’ అని తమ్ముడు ధీమాగా చెప్పిన సమాధానం ఆరోజుల్లో పెద్ద సెన్సేషన్‌. ఆ ప్రశ్నే ఈ రైతులనడిగితే ‘మాకు నీళ్లున్నాయి’ అని అంతే ధీమాగా చెబుతారు. అవును మరి, ఏళ్ల తరబడి కరవుతో అల్లాడిన వారికి నీటిని మించిన ధీమా ఇంకెవరిస్తారు..! పైగా ఎవరో దయతలచి ఇచ్చినవి కావు... తమంతట తాము కష్టపడి సంపాదించుకున్న నీళ్లవి..!

వానలు గతి తప్పి చాలాకాలమైంది. వాటితో పాటే వ్యవసాయమూ. ఏదో విధంగా తిండి గింజలు పండించుకోవడం తప్పదు కాబట్టి భూగర్భ జలాన్నీ ఇష్టారాజ్యంగా వాడేసుకున్నాం. దాంతో ఇప్పుడు తాగునీటికీ కరవొచ్చింది. నగరాల్లో నల్లా తిప్పితే నీళ్లొస్తున్నాయి కాబట్టి అంతా సవ్యంగా ఉందనుకోవద్దనీ మారుమూల పల్లెల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయనీ సాక్షాత్తూ నీతి ఆయోగ్‌ నివేదికే చెబుతోంది. ఈ దశాబ్దం చివరికల్లా దేశానికి తీవ్ర నీటి ఎద్దడి పొంచి ఉందని హెచ్చరిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో చీకట్లో చిరుదివ్వెల్లా కన్పిస్తున్నాయి ఈ పల్లెల విజయాలు. దరిదాపుల్లో నీటి వనరులు లేకా వానలు పడకా కొన్నిచోట్ల, పడినా నీరు నిలిచే అవకాశం లేని భౌగోళిక పరిస్థితులు ఇంకొన్ని చోట్ల, నీటి వనరుల నిర్వహణ సరిగా లేక మరికొన్ని చోట్ల... ఇలా దశాబ్దాల తరబడి నీటి కరవుతో అల్లాడుతున్న ప్రాంతాలెన్నో. అలాంటి చోట చైతన్యం వెల్లివిరిసిన నిదర్శనలివి. ఒకరిద్దరు చొరవ చూపితే ఊరంతా ఒక్కతాటి మీదికి వచ్చింది. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చోకుండా కలసికట్టుగా చెమటోడ్చింది. కురిసిన ప్రతి వానచినుకునీ ఒడిసిపట్టింది. బీడు వారిన నేలదాహాన్ని తీర్చి మరోసారి పచ్చచీర కట్టింది. మారుమూల ప్రాంతాల్లోని ఈ పల్లెల ప్రజలు నీటి సమస్యను జయించిన వైనం ఆసక్తికరమే కాదు, స్ఫూర్తిమంతం కూడా.

ఏ దిక్కూలేనప్పుడు...
లపోరియా గ్రామం జైపూర్‌కి 90కి.మీ.ల దూరంలో ఉంటుంది. అసలు రాజస్థాన్‌లో సగటు వర్షపాతానికి సెంటీమీటరు తగ్గినా చాలు, సగానికి పైగా రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుంటుంది. సంవత్సరాల తరబడి అదే తంతు. దాంతో నానాటికీ విస్తరిస్తూ ఊళ్లకు ఊళ్లనే కబళిస్తోంది ఎడారి. చూస్తూ కూర్చుంటే తమ ఊరూ అందులో కలిసిపోవడానికి ఎంతో కాలం పట్టదనిపించింది లక్షణ్‌ సింగ్‌కి. దాదాపు పాతికేళ్ల క్రితం ఓరోజు గ్రామసభలో అతడు గొంతు విప్పాడు. ‘మన నీటిని మనమే సంపాదించుకోవాలి లేదంటే కరవుతో చావాలి. ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సిన సమయం ఇదే’ అని చెప్పినప్పుడు మరో మార్గమేదీ లేదని స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి గ్రామస్థులు అతని మాటని ఆలకించారు. లక్ష్మణ్‌సింగ్‌ ఆధ్వర్యంలో అందరూ కలిసి శ్రమదానంతో గ్రామం చుట్టూ చిన్న చిన్న కుంటలు తవ్వారు. తవ్విన మట్టితో వాటి పక్కన ఎత్తుగా గోడలు కట్టారు. దాంతో వర్షం పడినప్పుడు ఆ గోడలు అడ్డుకోవడం వల్ల కుంటలు నిండుతున్నాయి. నీళ్లు మెల్లగా భూమిలోకి ఇంకుతున్నాయి. అలా చిన్న కుంటలు నిండాక మిగిలిన నీరు వెళ్లడానికి ఒక వరసలో మూడు పెద్దచెరువులు తవ్వుకున్నారు. సాగునీటికి ఒకటీ తాగునీటికి రెండూ... ఒకటి తమగ్రామానికి, ఇంకోటి చుట్టుపక్కల గ్రామాలకి. ఏటా వేసవిలో మూడిట్లోనూ పూడిక తీసి వానాకాలానికి సిద్ధం చేస్తారు. ఇలా పట్టు వదలకుండా కొన్నేళ్లపాటు కష్టపడ్డారు. దాంతో క్రమంగా భూగర్భ నీటిమట్టం పెరిగి లపోరియా స్వయం సమృద్ధి సాధించింది. వేసవిలో చుట్టుపక్కల గ్రామాల దాహం తీరుస్తోంది. ఒక్క చెరువు నీటితోనే వెయ్యెకరాల్లో పంటలు పండించుకుంటున్నారు. పాడికీ పంటలకీ కొదవ లేదు కాబట్టి పట్టణానికి వలసలూ లేవు.‘మమ్మల్ని చూసి ఇప్పుడు చుట్టుపక్కల 58 గ్రామాలు ఇదే పద్ధతినిఅనుసరిస్తున్నాయి...’ అని చెబుతాడు లక్ష్మణ్‌ తన చొరవ ఫలించినందుకు సంతృప్తిగా నవ్వుతూ.

రైతు చూపిన దారి
మాల్వా భూమి ఎంత సారవంతమైనదంటే అక్కడ నీటికీ తిండికీ లోటే ఉండదని ఒకప్పుడు గొప్పగా చెప్పుకునేవారు. మధ్యప్రదేశ్‌లోని ఆ మాల్వా ప్రాంతంలోనిదే దేవాస్‌ జిల్లా. పక్కనుంచే నదులు వెళ్తున్నా ఈ జిల్లా వైపుకి ఒక్క కాలువనీ తవ్వించినవారు లేరు. దాంతో రైతులు పూర్తిగా భూగర్భ జలాల మీదే ఆధారపడడంతో 2000 సంవత్సరం తర్వాత ఆ జిల్లా కరవుకు మారుపేరైంది. అధికారులకూ ఏం చేయాలో తోచేది కాదు. 2006లో కలెక్టరు ఉమాకాంత్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన రఘునాథ్‌సింగ్‌ అనే రైతు తన పొలంలో ఒక కుంట తవ్వాననీ దాంట్లో నిలవున్న నీటితో పదిహేను ఎకరాల్లో పంట పండిస్తున్నాననీ చెప్పాడు. ఆఆలోచన కలెక్టరుకి నచ్చింది. ఎక్కడో డ్యామ్‌లు కట్టడం కన్నా అక్కడికక్కడేకన్పిస్తున్న ఈ పరిష్కారం బాగుందనిపించింది. నల్లరేగడి నేల కావడంతో నీరు త్వరగా ఇంకిపోకుండా నిలవుంటోందని గమనించిన ఆయన జిల్లాలోని ఇతర రైతులకు రఘునాథ్‌సింగ్‌ పొలాన్ని చూసిరమ్మని చెప్పేవారు. అలా అందరూ తమ పొలాల్లోనే కుంటల్ని ఏర్పాటుచేసుకోమని సలహా ఇచ్చారు. చిన్న రైతులకు అది కష్టమే కానీ అసలంటూ నీళ్లు కావాలి కాబట్టి అందరూ అందుకు అంగీకరించారు. ట్రాక్టర్లతో కుంటల తవ్వకానికి రుణాలు మాత్రం ఇప్పించమని కలెక్టరును కోరారు. దాంతో ఏడాది తిరిగేసరికల్లా దేవాస్‌ జిల్లాలోని పల్లెల్లో పదివేల కుంటలు తయారయ్యాయి. రైతులంతా ఒక యజ్ఞంలాగా ఆ పనిచేశారు. ఆ తర్వాత ఏడాది కురిసిన వానలకు అవి నిండటంతో పొలాలన్నీ పంటలతో కళకళలాడాయి. ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోనే ఉత్తమ నీటి నిర్వహణ పథకంగా కొనియాడింది.

కలిసి కదిలారు!
నాశిక్‌కి 45కి.మీ.ల దూరంలో ఉంది- వాడ్నేర్‌ భైరవ్‌ అనే గ్రామం. పాతికేళ్ల క్రితం మహారాష్ట్రలో మంచి నాణ్యమైన తమలపాకు ఎక్కడ దొరుకుతుందంటే ఆ పల్లె పేరే చెప్పేవారు. దాదాపు ఊరంతా అదే పంట పండించి ముంబయి, పుణె లాంటి నగరాల్లో అమ్మేవారు. ధర బాగా రావడంతో సాగు చేసేవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. తమలపాకు పంటకి నీరెక్కువ కావాలి. కొన్నాళ్లకి వానలుతగ్గడమూ అప్పటివరకూ ఆ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న జంబుక్త డ్యామ్‌ నుంచి వచ్చే నీటి సరఫరా కూడా తగ్గిపోవడంతో రైతులు బోర్ల మీద ఆధారపడేవారు. మరికొన్నేళ్లకి అవీ అడుగంటాయి. 2010కల్లా సాగుభూమి సగానికి తగ్గిపోతే, 2015 నాటికి అసలే పంటా పండించే పరిస్థితి లేకుండా పోయింది. తర్వాత ఏడాది తాగునీటికీ కటకట ఏర్పడేసరికి ఈ సంక్షోభాన్ని కలసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు ఆ ఊరివాళ్లు. తలా కాస్త డబ్బు వేసుకుని రెండేళ్లు కష్టపడి వెయ్యికి పైగా కుంటలు తవ్వారు. ఊరి చుట్టూ ఉన్న కొండగుట్టల వాలుల్లో 150 ఆనకట్టలు కట్టారు. ఈ ప్రయత్నాల వల్ల 2019 నాటికి ఫలితం కన్పించింది. ఏకంగా 50కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసుకోగలిగారు. వానలతో సంబంధం లేకుండా ఏడాది పాటు ఊరందరి పంటలకూ సరిపోయే నీరది. అప్పుడిక ధైర్యంగా తమలపాకు మానేసి మరింతగా లాభాన్నిచ్చే ద్రాక్ష సాగు చేయడం మొదలెట్టారు. రెండేళ్లుగా 600 టన్నుల పండ్లను ముంబయి మార్కెట్‌కి సరఫరా చేస్తోంది వాడ్నేర్‌ గ్రామం.

కొండను తవ్వి...
మధ్యప్రదేశ్‌లో బాగా వెనకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. అందులో భాగంగా అంగ్రోతా గ్రామంలోనూ ఒక చెరువు తవ్వారు. కానీ ఏనాడూ అందులోకి చుక్కనీరు చేరిన పాపాన పోలేదు. ఆ గ్రామానికి పక్కనే ఓ ఎత్తైన గుట్ట ఉంటుంది. వాలుగా ఉన్న ఆ గుట్టమీద పడ్డ వాన నీళ్లు మరో పక్కకి ప్రవహిస్తున్నాయి తప్ప అంగ్రోతా వైపు రావడం లేదు. దాంతో ఆ పల్లెకి సాగునీరూ తాగునీరూ కూడా కరవే అయ్యాయి. ఎన్నాళ్లని ఈ నీటి కష్టాలు అనుకున్న మహిళలు చెరువులోకి నీరు నింపే బాధ్యత తమ భుజాలపై వేసుకున్నారు. ఒకరోజూ రెండు రోజులూ కాదు ఏకంగా ఏడాదిన్నర పాటు కష్టపడి కొండను నిలువుగా తవ్వి మధ్యలో కాలువ చేశారు. రెండు వైపులా ఆ కొండమీద కురిసిన నీరంతా కాలువ ద్వారా ఊరి చెరువులోకి వచ్చే ఏర్పాటు చేయడంతో చెరువు నిండింది. అంగ్రోతా కష్టాలు తీరాయి. ఈ కొండను తవ్వే యజ్ఞంలో మొత్తం 250 మంది మహిళలు పాల్గొన్నారు. అందరూ పేదవాళ్లే. కూలీ చేసి బతికేవారే. ఏడాదిన్నర పాటు వారంలో మూడు రోజులు కూలికి వెళ్తూ మిగిలిన మూడు రోజులూ ఉచితంగా కాలువ పనిచేస్తూ మొత్తానికి తమ కష్టానికి ఫలితాన్ని సాధించి భేష్‌ అనిపించుకున్నారు.

‘పానీ జమీన్‌ పర్‌’!
2016... పవన్‌ జాదవ్‌కి పన్నెండేళ్లుంటాయేమో. ‘తారే జమీన్‌ పర్‌’ సినిమా చూశాడు. సినిమా నచ్చింది కానీ దాని పేరే ఆ పిల్లాడిని ఆలోచనలో పడేసింది. చుక్కలు నేల మీదికి రావడం ఎందుకు, దానికన్నా బావిలో అందకుండా లోపలకి పోయిన నీరు పైకి వస్తే ఉపయోగం కానీ... అనుకున్నాడు. బీడ్‌ జిల్లాలోని ఆ ఊరు కొన్నేళ్లుగా నీటి ఎద్దడితో సతమతమవుతోంది. పంటలకే కాదు తాగే నీళ్లకీ కరవే. వెతికీ వెతికీ ఏ బావిలోనన్నా అడుగున కాసిన్ని నీళ్లు కనబడితే నానా అవస్థాపడి తోడుకునేవారు. రోజూ నీటికోసం అమ్మకు తోడు వెళ్తాడు పవన్‌. దాంతో సంవత్సరంలో ఆర్నెల్లు బడికి సరిగా వెళ్లలేకపోతున్నాడు. ఇలా ఆ పిల్లవాడి ఆలోచనలు సాగుతున్నప్పుడే టీవీలో నీటి సంరక్షణ పనుల గురించి ఒక కార్యక్రమం చూశాడు. ‘ఆ పనులు మనమూ చేద్దాం’ అని తండ్రిని అడిగాడు. అడిగి ఊరుకోలేదు. ఎలాగైనా సరే నీటినిసాధించాల్సిందేననుకున్న పవన్‌ తన తోటి పిల్లల్ని పాతిక మందిని కూడగట్టుకుని టీవీలో చూపించినట్లు ఊరి బయట కందకాలు తవ్వడం మొదలెట్టాడు. పిల్లలు కష్టపడటం చూసి పెద్దలూ కదిలారు. మండుటెండల్లో వాళ్లు శ్రమదానం చేస్తుంటే పిల్లలు వాళ్లకు చల్లటి మంచినీళ్లు ఇస్తూ సేదతీర్చేవారు. అంత కష్టపడ్డా మొదటి ఏడాది వర్షాలు కురవలేదు. అయినా నిరుత్సాహపడకుండా రెండో ఏడాది మరికొన్ని కందకాలు తవ్వారు. ఈసారి వానలు పడ్డాయి. కుంటలన్నీ నిండాయి. బావుల్లోకీ నీళ్లు వచ్చాయి. పెద్దలు ఉత్సాహంగా పంటలు వేశారు. ఏటా ఆ పని కొనసాగిస్తుండడంతో ఇప్పుడక్కడ ఒక్క అడుగు తవ్వితే చాలు నీరు ఉబికి ఉబికి వస్తోంది. ‘పానీ జమీన్‌ పర్‌’ తేవడంలో విజయం సాధించినందుకు పవన్‌ జాదవ్‌ సంబరపడిపోతున్నాడు. ఇది మాకు పిల్లలు నేర్పిన పాఠం... అంటున్నారు ఆ ఊరి పెద్దలు.

చెలమకు జీవం పోశారు హిమాలయాలకు కిందనే ఉన్న ఉత్తరాఖండ్‌లో నీటి కొరత ఉంటుందని చెప్పినా ఎవరూ నమ్మరు. కానీ వాతావరణ మార్పులు, పట్టణీకరణ, అడవుల నరికి¨వేత కారణంగా ఆ రాష్ట్రానికి ప్రధాన నీటి వనరులైన కొండల్లోని నీటిచెలమలు సగానికి పైగా తరచూ ఎండిపోతున్నాయి. తొంభైశాతం జనాభాకేమో వాటి ద్వారా వచ్చే నీరే ఆధారం. పల్లెల్లో మహిళలు రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి చెలమల నుంచి ఇంటికి కావలసిన నీటిని తెచ్చుకుంటారు. దగ్గర్లోని చెలమ ఎండిపోతే మరోటి వెతుక్కుంటూ వాళ్లు ఆ కొండ వాలులో ఇంకా దూరం నడవాల్సి వస్తుంది. డుబ్రోలి అలాంటి ఒక పల్లె. ప్రభుత్వం ఆ పల్లెకు నల్లా ఏర్పాటు చేసింది కానీ అందులో ఏనాడూ నీళ్లొచ్చిన పాపాన పోలేదు. 22 ఏళ్ల దీప నీళ్లకోసం రెండు కి.మీ.ల దూరాన ఉన్న నీటి చెలమ దగ్గరకి రోజూ 10-12 సార్లు వెళ్లొచ్చేది. చూస్తుండగానే అదీ ఎండిపోయింది. దాంతో ఊరి మహిళలందరూ కలిసి తమ కష్టం తీరే మార్గం తామే వెతుక్కోవాలనుకున్నారు. పేపర్లో ఒక స్వచ్ఛంద సంస్థ గురించి తెలుసుకున్న దీప కొందరు మహిళలతో కలిసివెళ్లి తమ సమస్యను వారికి వివరించింది. ఎండిపోయిన నీటి చెలమని నిత్యం నీళ్లు ఉండేలా చేసుకోవడానికి ఏం చేయాలో ఆ సంస్థ చెబుతానంది. దాంతో మహిళలు సంఘటితమై నెలనెలా కొంత మొత్తం చొప్పున జమ చేసి నిధులు సేకరించు కున్నారు. సంస్థ సూచనలు పాటిస్తూ కష్టపడి ఆ చెలమ చుట్టూ అక్కడక్కడా వాన నీరు ఇంకడానికి గోతులు తవ్వారు. చిన్న చిన్న చెక్‌ డ్యాములూ అడ్డుకట్టలూ కట్టారు. వాటికి రక్షణగా మొక్కలు నాటి పెంచారు. ఈ ఏర్పాట్లతో క్రమంగా ఎండిపోయిన చెలమలో మళ్లీ నీరు ఊరడం మొదలెట్టింది. తమ కష్టం ఫలించి మొదటి దశ విజయవంతమైందనీ ఇక రెండో దశనీ సాధించి తీరతామనీ చెబుతోంది దీప. అదేంటంటే- చెలమ దగ్గరే ఒక ట్యాంక్‌ కట్టించి నీటిని అందులోకి పంపి పైపు ద్వారా గ్రామంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది ఇప్పుడు దీప బృందం.

బీడు నుంచి బాస్మతి దాకా...
జఖాని... ఒకప్పుడు 500 కుటుంబాలున్న పల్లె. నీరు లేక సగం ఖాళీ అయిపోయింది. రైతులంతా సాగు వదిలి పట్టణాల్లో కూలీ పనులు వెతుక్కుంటూ వెళ్లిపోయారు. ఊరి పెద్ద ఉమాశంకర్‌ పాండేకి ఆ పరిస్థితి తీవ్ర ఆవేదన కలిగించింది. పదిహేనేళ్ల క్రితం ఓరోజు ఆయన నాటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ప్రసంగాన్ని రేడియోలో విన్నాడు. గ్రామాలు నీటి సంరక్షణ ద్వారా జల నిధులుగా మారవచ్చని కలాం చెప్పడంతో అదెలాగో వివరాలు కనుక్కుందామని ఉమాశంకర్‌ వ్యవసాయ విజ్ఞాన కేంద్రాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు.

కొండవాలులో ఉన్న తమ ఊరి పరిస్థితిని వివరించి నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలుసుకున్నాడు. తిరిగి వచ్చి గ్రామస్థులతో కలిసి పొలాల చుట్టూ ఎత్తుగా కరకట్టలు నిర్మించి వాటిపై మొక్కలు నాటారు. రెండు మూడేళ్లకల్లా అవన్నీ పెరిగి చెట్లయ్యాయి. కరకట్టలు బలంగా తయారయ్యాయి. ఈ కట్టలవల్ల ఇప్పుడు వాననీరు అక్కడే నిలిచి లోపలికి ఇంకడంతో క్రమంగా కింద ఉన్న ఊరిలో ఊహించని స్థాయిలో భూగర్భజలాలు పెరిగాయి. వలసపోయిన వారంతా తిరిగి రావడంతో ఇప్పుడు జఖాని పచ్చని పంటలతో సుభిక్షంగా వర్ధిల్లుతోంది. గత ఏడాది ఒక్క బాస్మతి వరి పంటతోనే పది కోట్ల రూపాయలు సంపాదించారట ఆ ఊరి రైతులు. ఇలాంటి విజయగాథలు ఇంకా ఎన్నో..! ఎక్కడా ప్రభుత్వ జోక్యం లేదు, అధికారుల ప్రస్తావన లేదు. తమ సమస్యని తామే పరిష్కరించుకోవాలనుకున్నారు. స్వయంకృషితో నీటిని సాధించుకున్నారు. ఒకప్పుడు కన్నీటి కథలు చెప్పిన చోటే... ఇప్పుడు నీటి కథలు వినిపిస్తున్నారు!

పెనుముప్పు పొంచి ఉంది..!

ప్రపంచ జనాభాలో దాదాపు 18శాతం భారతీయులే కాగా నీటి వనరుల్లో మాత్రం కేవలం నాలుగు శాతమే మన దేశంలో ఉన్నాయి. దాంతో భూగర్భ జలాన్ని ఎక్కువగా వాడుతున్న దేశాల్లో మనదే ప్రథమ స్థానం(25శాతం) అయింది. దానికి తోడు 70శాతం జలవనరులు కలుషితం కావడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయనీ, నీటి నాణ్యత విషయంలో ప్రపంచంలోని 122 దేశాల్లో అట్టడుగున- అంటే, 120వ స్థానంలో మన దేశం ఉందనీ నీతి ఆయోగ్‌ నివేదిక చెబుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి దేశం అత్యంత దారుణమైన నీటి ఎద్దడి ఎదుర్కుంటుందన్నది వారు చేస్తున్న హెచ్చరిక. అప్పటికి 40శాతం జనాభా నగరాల్లోనే నివసిస్తారనీ వారిలో 31శాతం ఇళ్లకు నీటి సౌకర్యం ఉండదనీ 67శాతానికి డ్రైనేజీ కనెక్షను ఉండదనీ నిపుణుల అంచనా. కేంద్ర జలసంఘం లెక్కల మేరకు దేశంలోని 91 ప్రముఖ రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఇటీవల కాలంలో ఏనాడూ వాటి సామర్థ్యంలో సగానికి కూడా చేరడం లేదట. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వాలు ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద నీటి సంరక్షణ పనులు చేయిస్తున్నాయి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు