close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మా ఊరికి... కరోనాని రానివ్వం!

కరోనా వైరస్‌ ప్రపంచమంతా పాకిపోయి, అన్ని దేశాల్నీ వణికిస్తోంది. ఏడాదిగా ఈ మహమ్మారి ప్రభావం మనదేశంలోనూ భయంకరంగానే ఉన్నా... కొన్ని ఊళ్లు మాత్రం దాన్ని తమ పొలిమేరల్లోనూ అడుగుపెట్టకుండా చేశాయి. సమర్థంగా కొవిడ్‌-19ను ఎదుర్కొని ఇప్పటివరకూ ఏ ఒక్కరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆ ఊళ్ల సంగతులేంటో చూద్దామా!


పెళ్లిళ్లూ వాయిదానే...

కవైపు దేశమంతా కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. కానీ గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ జిల్లా కరియని గ్రామంలో సీన్‌ ఇందుకు భిన్నంగా ఉంది. మొదటి వేవ్‌లోనే కాదు, రెండో వేవ్‌లో కూడా ఈ గ్రామంలో ఒక్క కేసు కూడా లేదు. ఈ ఊరి జనాభా మొత్తం 1100. ఇందులో ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటి వారిని ఊళ్లోకి రానివ్వద్దని తీర్మానించుకుని దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అంతేకాదు, కావాల్సిన పండ్లూ, కూరగాయల్నీ ఊళ్లోనే పండించుకుని, అందరూ కలిసి పంచుకుంటున్నారు. పెళ్లిళ్లూ, పేరంటాలూ వాయిదా వేసుకుంటూ అత్యవసరమైన పని ఉంటే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకుండా కరోనాని కట్టడి చేస్తున్నారట.


ఊరు దాటితే క్వారంటైనే!

రోనా కోరల్లో చిక్కని ఊళ్లలో గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఉన్న షియాల్‌ బేట్‌ అనే గ్రామం ఒకటి. దాదాపు ఐదువేల జనాభాతో ఉండే ఈ ఊరు అరేబియా సముద్రం మధ్యలో ఉంటుంది. పల్లే, పట్నం తేడా లేకుండా అన్నిచోట్లా విజృంభిస్తున్న కరోనా ఈ ఊరిలో మాత్రం అడుగుపెట్టలేకపోయింది. దీనికి కారణం ఈ ఊరు సముద్రం మధ్యలో ఉండటమే కాదు, ఊరి ప్రజలంతా కఠిన కరోనా నిబంధనలు పాటించడం కూడా. వైరస్‌ గురించి తెలియగానే తప్పనిసరిగా మాస్కులూ, శానిటైజర్లూ వాడటం మొదలుపెట్టేశారు. డాక్టర్‌ సలహాతో ముందు జాగ్రత్తగా మందులు తీసుకోవడం లాంటివీ చేశారట. ఎప్పటికప్పుడు ఊరంతా శానిటైజ్‌ చేసుకుంటూ ఊరిని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. అత్యవసరమైనప్పుడు మాత్రమే సర్పంచ్‌ అనుమతితో బయటకు వెళ్లి, తిరిగి వచ్చాక తప్పకుండా కొన్నిరోజులపాటు క్వారంటైన్‌లో ఉంటున్నారట. కావాల్సిన రేషన్‌ సరుకుల్ని బోట్ల ద్వారా అధికారులు ఒడ్డు దాకా చేరుస్తుంటే ఈ ఊరి ఆటోలతో డోర్‌ డెలివరీ చేయించుకుంటూ, ఒకరోజంతా వాటిని బయట ఉంచాకే వాడుకుంటున్నారు.


ఆడవాళ్లే కాపలా...

ధ్యప్రదేశ్‌లోని చిఖాలర్‌ అనే మారుమూల గ్రామమది. దీనికిప్పుడు మంచి పేరొచ్చింది. ఎందుకంటే... ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కొవిడ్‌-19ని దీటుగా ఎదుర్కోవడానికి ఈ ఊరు చేస్తున్న పనుల్ని చూసి. అవును... అసలు కరోనా వైరస్‌ మనదేశంలోకి ప్రవేశించిన దగ్గర్నించి ఈ ఊరు రాకపోకలు ఆపేసింది. కరోనా తమ ఊళ్లో అడుగుపెట్టకుండా ఉండటానికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఊరి మహిళలంతా కలిసి కొన్ని ప్రణాళికలు వేసుకున్నారు. ఊరి చుట్టూ కర్రలతో బారికేడ్లు కట్టారు. ఆడవాళ్లంతా గ్రూపులుగా విడిపోయి షిప్టులు వేసుకుంటూ... ఊరి పొలిమేర దగ్గర రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కాపలా ఉంటున్నారు. ఊళ్లో వాళ్లు బయటకు వెళ్లకుండా, బయటివాళ్లు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షాపువాళ్లు మాత్రమే బయటకెళ్లి నిత్యావసర వస్తువుల్ని తెస్తున్నారట. వాటిని కాసేపు బయట ఉంచాకే అందరూ వాడుతున్నారట. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటాన్ని నిషేధిస్తూ తమకు తామే లాక్‌డౌన్‌ విధించుకున్నారు. ఊరి బయట-మెయిన్‌ రోడ్డు దగ్గరా నిలబడుతూ ఊళ్లోకి వేరే వాహనాల్ని అనుమతించట్లేదు. అన్ని పనులూ చేసుకుంటూనే కరోనా రాకుండా విధిగా కాపలా కాస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... దీన్నో డ్యూటీలా మార్చుకున్నారు. అందుకే మరి... ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా రాలేదు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు