మహా రాజశ్రీ మామగారు - Sunday Magazine
close
మహా రాజశ్రీ మామగారు

- జ్యోతి సుంకరణం

కోల కళ్ళూ కోటేరు లాంటి ముక్కూ నున్నటి నునుపుదేలిన చెక్కిళ్ళూ పాల నురగలాంటి మేని ఛాయతో, మొత్తానికి జున్ను ముక్కలాగా ఉన్న లాలసని చూసి, ‘రంభా ఊర్వశి తలదన్నే రమణీ లలామ ఎవరీమె...’ అని మనసులోనే పాడేసుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై, ఆ తబ్బిబ్బులో చుట్టుపక్కల విషయాలేమీ పట్టించుకోకుండా, పెళ్ళిచూపులకు వెళ్ళిన పది నిమిషాల్లోనే, ‘పిల్ల తెగ నచ్చేసింది’ అని పెళ్ళికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు మన కామేష్‌. అంతేకాదు, ‘ఇక ఎంగేజ్‌మెంటూ అదీ ఇదీ ఏమీ వద్దు, ఏకంగా పెళ్ళే’ అని ఆర్డర్‌ కూడా పాస్‌ చేసేసి అర్జెంటుగా ఒక నెల్లాళ్ళలో పెళ్ళి ముహూర్తం పెట్టించేశాడు. పెళ్ళికి ఉన్న ఆ నెల కాలాన్ని ఒక యుగంగా గడిపాడు పాపం. ఎట్టకేలకి, చిట్టచివరకు ఆ పెళ్ళిరోజు రానే వచ్చింది.
పెళ్ళిపీటల మీద తన పక్కనే కూర్చున్న అందాల సుందరాంగి లాంటి లాలసను మధ్యమధ్యలో ఓరచూపులు చూస్తూ మురిసిపోతూ, ఆనందంతో తెగ మెలికలు తిరిగిపోతున్న కామేష్‌కి ఒక్కసారి వీపు మీద ‘ధబ్‌’మని ఎవరో బాది, ‘‘ఏరా... కావుడూ ఇందాకట్నుంచి పిలుస్తుంటే పలకవే’’ అంటూ అరిచేసరికి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోవడంతో, చితగ్గొట్టబడ్డ వీపుని, చేత్తో సాధ్యమైనంతవరకూ రాసుకుంటూ, ఏడుపు మొహంతో వెనక్కి తిరిగి చూశాడు కామేష్‌.
అక్కడ మోటుగా ఎత్తుగా బట్టతల, గుబురు మీసాలతో, ఓ యాభై పైబడ్డ, ఖద్దరు పంచె, లాల్చీతో ఓ శాల్తీ, తననే చూసి నవ్వుతూ, ఎవరో గుర్తుకురాక అయోమయంగా అతని వైపు చూస్తుండిపోయాడు.
‘‘అదేవిట్రా అలా వెర్రిమొహం వేస్తావ్‌, ఎవరో తెలీనట్లు’’ అంటూ మళ్ళీ వీపుమీద ఒక పెద్ద చరుపు చరిచి, ‘‘ఇదిగో వీడేరా, నా అల్లుడు’’ అంటూ పక్కనే ఉన్న మరో శాల్తీకి పరిచయం చేశాడు. ఇలాంటి భయంకరమైన మామగారు ఈ నెల్లాళ్ళలో తన దృష్టిలో పడకపోవడమే వింత అనుకుంటే, తనను అతి చనువుగా ‘ఒరేయ్‌, అరేయ్‌’ అని పిలవడం మరీ మరీ వింతగా తోచింది కామేష్‌కి, ఆ వింత విచిత్ర భ్రమలను అర్థం చేసుకోబోతుంటేనే ఈలోగా ముహూర్తం సమీపించడం, తాళి కట్టాల్సి రావడంతో, తాత్కాలికంగా మామగారి గురించి
మర్చిపోయి, తన జవరాలు లాలస మైకంలో పడిపోయాడు కామేష్‌.
పెళ్ళై పదహారురోజుల పండుగదాకా, పరమానందంగా గడిచిపోయింది కామేష్‌కి. మధ్య మధ్యలో పంటికింద రాయిలా మామగారి ప్రవర్తన కలుక్కుమన్నా, ‘‘మా నాన్న అంతే, ఎవరైనా నచ్చారంటే... వాళ్ళతో అతి చనువుగా ఉంటాడు, తప్పుగా అనుకోకండి’’ అని లాలస, లావణ్యాలొలకబోస్తూ లాలించి చెప్పడంతో సరిపుచ్చేసుకున్నాడు కామేష్‌.

*  *  *

ఓ చినుకుపడినా, ఓ చల్లగాలి వీచినా, ఓ కోయిల కూసినా, ఓ నెమలి నాట్యమాడినా, అదంతా తమకోసమేనన్నట్లు భావించుకుంటూ, ప్రకృతే తమ కోసమన్నట్లు, అసలు ప్రకృతే తామన్నట్లు... కామేష్‌, లాలసలు ఒకరితో ఒకరు మమేకమైపోతూ, వాళ్ళ కొత్త కాపురాన్ని మూడు పువ్వులూ ఆరు కాయలుగా ఆనందంగా ఆరు నెలలు గడిపేశారు. ఉన్నట్టుండి ఒకరోజు లాలస కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాడు కామేష్‌.
‘‘కంగ్రాచ్యులేషన్స్‌... మీరు తండ్రి కాబోతున్నారు’’ అని డాక్టర్‌ శుభవార్త చెప్పడంతోబాటు ‘‘తను చాలా నీరసంగా ఉంది, కంప్లీట్‌ బెడ్‌ రెస్ట్‌ ఇచ్చి, తగినంత కేర్‌ తీసుకోపోతే ప్రమాదం’’ అని కూడా సలహా ఇవ్వడంతో, ఏం చెయ్యాలో పాలుపోలేదు కామేష్‌కి.
లాలసను పుట్టింటికి పంపేస్తే, అన్నాళ్ళు తనని వదిలి ఉండగలడా... పైగా అది పల్లెటూరు, సరైన డాక్టర్లు లేరు, అనవసరమైన రిస్క్‌.
‘ఏం చెయ్యాలా?’ అని తీవ్రంగా ఆలోచిస్తున్న కామేష్‌ దగ్గరికి లాలస వచ్చి ‘‘ఇందులో అంత ఆలోచించడానికేముంది, రేపే మా అమ్మని ఇక్కడకి రమ్మని కబురు పెడదాం. అలా అయితే అన్ని విధాలా బావుంటుంది’’ అని సలహా ఇచ్చింది. భార్య ఇచ్చిన సలహా నచ్చినా ఎక్కడ అత్తగారితోపాటు మామగారు కూడా వచ్చేస్తాడో అని భయపడ్డాడు కామేష్‌. కానీ ఆ మాట చెప్తే లాలస ఫీలవుతుందేమోనని చెప్పలేదు. అయినా ఆ పొలం పనులనీ పంచాయితీ వ్యవహారాలనూ వదిలేసుకొని రాడులే, అత్తగారు మాత్రమే వస్తుందిలెమ్మని, అంచనా వేసుకుని, తనకి తనే ధైర్యం చెప్పుకుని, అత్తగారిని రమ్మని కబురుపెట్టాడు.
అయితే అతని అంచనాలను తారుమారు చేస్తూ మర్నాడు పొద్దున్నే నవ్వుతూ అత్తగారూ, ఆ వెనకే రెండు చేతులనిండా పెద్ద పెద్ద బ్యాగులతో వికటాట్టహాసాలు చేస్తూ మామగారూ ఊరి నుంచి దిగిపోవడంతో గుండెల్లో రాయి పడ్డట్లయింది కామేష్‌కి. వస్తూనే ‘‘వెర్రి నవ్వులు నవ్వుతూ అమాయకంగా ఉంటే ఏమోననుకున్నాను... విషయమున్నవాడివేనురోయ్‌...’’ అంటూ గుమ్మంలోనే పెద్ద గొంతుతో ఆనందంగా అరుస్తున్న మామగారిని గబుక్కున లోపలికి లాగి పక్క ఫ్లాట్స్‌ వాళ్ళెవరైనా చూశారేమోనని ఒకసారి అటూ ఇటూ చూసి తలుపులు వేసేశాడు కామేష్‌.
మొహమాటానికి కాసేపు మామగారి పక్కన కూర్చుని క్షేమ సమాచారాలడిగి, ‘‘మీరు స్నానాలవీ చేసి ఫ్రెష్‌ అవ్వండి మామయ్యా, నేను వెళ్ళి టిఫిన్‌ తీసుకొస్తాను’’ అంటూ చల్లగా బైటకి జారుకోబోయాడు.
అంతే చొక్కా పట్టుకుని సోఫాలోకి లాగి కుదేసి ‘‘కూర్చోవోయ్‌... ఆ పిచ్చి వెధవ టిఫిన్లు ఎవరిగ్గావాలిగానీ మీ అత్తగారు వచ్చింది కదా మనందరికీ కమ్మగా వండి పెడుతుందిలే’’ అంటూ కామేష్‌ని పక్కనే కూర్చోబెట్టేసుకున్నాడు మామగారు భూషణం.
ఇక అది మొదలు రోజూ కామేష్‌ ఆఫీస్‌కి తప్ప ఇంట్లోంచి అడుగు బైటపెట్టాడంటే చాలు... వెనకాలే భూషణం ‘నేనూ వస్తాను పదవోయ్‌’ అంటూ అల్లుడి వెంటపడటం, ఆనక రోడ్డుమీద వికటాట్టహాసాలూ, వీపు చరుపులూను.
ఒకరోజు కూరలు తేవడానికి బయలుదేరుతుంటే కామేష్‌ వెంటే భూషణం కూడా బయలుదేరాడు. అలవాటుగా ఎప్పుడూ వెళ్ళే కూరల దుకాణమే కావడం వలన, కామేష్‌ని చూస్తూనే, ఆ దుకాణంవాడు ఓ నాలుగైదు రకాల కూరలను తూచేసి సంచిలో వేసేసి, దాన్ని కామేష్‌ చేతికి అందిస్తూ ‘‘సార్‌, రెండొందలయింది’’ అంటూ చెప్పాడు.
వెంటనే కామేష్‌ జేబులోంచి డబ్బు తీసి ఇచ్చేయబోతుంటే, అంతవరకూ పక్కనే నించుని ఇదంతా గమనిస్తున్న భూషణం, చటుక్కున కామేష్‌ చేతి మీద ఒక్కటేసి ‘‘పెట్టు... లోపల పెట్టు డబ్బు, వాడు నోటికి ఎంత అనిపిస్తే అంత అడగడం, నువ్వు మూగి మొద్దులా తలాడించి ఇచ్చేయడం, ఏం డబ్బులేమైనా చెట్లక్కాస్తున్నాయనుకున్నావా... ఆహా... పెట్టు, లోపల పెట్టు’’ అని హుంకరిస్తూ డబ్బు ఇవ్వకుండా గట్టిగా చెయ్యి పట్టేసుకున్నాడు.
ఒక్కసారి కామేష్‌ అవాక్కైపోయాడు. చుట్టూ తమని గమనిస్తున్న అందరివంకా సిగ్గుతో ఎర్రబడ్డ మొహంతో ఇబ్బందిగా చూస్తూ ‘‘మామయ్యా, ఇతను నాకు బాగా తెలిసినవాడు. రేట్లు అన్నీ చూసే ఇస్తాడు, బాగోదు, చెయ్యి వదలండి’’ అంటూ మామగారి చెవిలో గుసగుసలాడాడు.
‘‘నీ మొహం... ఏవిటి ఈ నాలుగు కూరలకీ రెండొందలా... ఏదీ లెక్కవెయ్యమను నా ముందే’’ అంటూ సంచిలో కూరలన్నీ ఒలకబోసేసి, వేటికవి విడదీసేసి ‘‘ఊఁ... ఇప్పుడు చెప్పవోయ్‌... ఈ ఆగాకర కాయలెంత’’ అని అడిగాడు కూరలవాడిని.
అప్పటికే బిత్తరపోయి ఇదంతా చూస్తున్న కూరలవాడు వెంటనే చెప్పేసాడు ‘‘అరవై సార్‌’’ అని.
వెంటనే భూషణం ‘‘నీ మొహం... ముప్ఫై’’ అన్నాడు. ‘‘ఈ వంకాయలు?’’ మళ్ళీ అడిగాడు భూషణం. కూరలవాడు ‘‘నలభై’’ అనగానే, ఠాట్‌ కుదరదు ‘‘ఇరవై’’ అంటూ దబాయించాడు. అలాగే అన్నిటికీ సగానికి సగం
తగ్గించేసి, ‘‘ఊఁ ఇప్పుడు చెప్పు... మొత్తమెంతా...’’ అంటూ సాగదీశాడు.
కూరలవాడు తల గోక్కుంటూ ‘‘ఎంతో కొంత ఇవ్వండి సార్‌’’ అన్నాడు ఏడుపు మొహంతో.
‘‘ఆ... అదీ అలా రా దారికి, మా అల్లుణ్ణి వెర్రి వాజమ్మ కింద జమకట్టి, ఇన్నాళ్లూ దోచేశావన్నమాట, కానీ నేనలా వెర్రి వెంగళప్పను కానురోయ్‌...’’ అంటూ వాడి చేతిలోని కూరల సంచి అందుకుని, అల్లుడి వైపు చూసి విజయగర్వంతో ఓ నవ్వు నవ్వాడు.
ఆ వెధవ నవ్వు నవ్వే మామగారిని చూసి ఒళ్ళు మండిపోయింది కామేష్‌కి. కానీ, ఏం చెయ్యాలో తెలియక లోలోపలే ఉడికిపోయాడు.

*  *  *

అప్పుడే వాకింగ్‌ ముగించుకుని, చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని, మంద్ర స్థాయిలో మంచి సంగీతాన్ని వింటూ ప్రశాంతమైన ఓ ఉదయపు వేళ పార్కులో చల్లగాలికి సేదతీరుతూ ఓ బెంచి మీద కూర్చుని ఉన్న కామేష్‌కి, ఉన్నట్టుండి ‘దబ్‌’మని వీపుమీద దెబ్బ పడటంతో ఒళ్ళు మండిపోయింది. వెనక్కి తిరిగి చూడకుండానే ఆ కొట్టిందెవరో తెలుసు కాబట్టి, పరమ చిరాకొచ్చేసి, ఒక్కసారి వెనక్కి తిరిగి వొంగోబెట్టి గుద్దెయ్యాలన్న ఆవేశాన్ని మనసులోనే కంట్రోల్‌ చేసుకుని, ‘‘మీరెందుకొచ్చారు మామయ్యా... ఇంత పొద్దున్నే’’ అంటూ మొహమాటంగా బలవంతపు నవ్వు నవ్వాడు కామేష్‌, తన వెనకాలే నించుని ఉన్న భూషణాన్ని ఉద్దేశించి.
‘‘ఆ... మరి నువ్వెందుకొచ్చావో నేనూ అందుకే వచ్చానోయ్‌. అయినా నన్ను లేపకుండా నువ్వొక్కడివే వచ్చావేం, సర్లే పద పద ఇప్పుడు మొదలెడదాం’’ అన్నాడు భూషణం.
‘‘అహ... నా వాకింగ్‌ పూర్తయ్యింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు మొదలెట్టండి’’ అంటూ మరో మాటకి ఛాన్స్‌ ఇవ్వకుండా జారుకోబోయాడు.
‘‘ఆ ఇప్పటినుండి ఇంటికెళ్ళి ఏం పీకుతావోయ్‌, రా నాతో’’ అంటూ కామేష్‌ భుజాల చుట్టూ చేతులేసేసి, లాక్కుపోయాడు భూషణం.
మామగారి ఉడుం పట్టు తెల్సి మరి గింజుకోకుండా, నోరు మూసుకుని, మళ్ళీ నడక మొదలెట్టాడు. సడెన్‌గా పార్కులో ఒక దగ్గర ఆగిపోయి, పంచెను శుభ్రంగా పైకి లాక్కుని లంగోటీలా కట్టేసుకుని, ఎగిరి గంతేసి, తొడలు రెంటినీ చప్పుడొచ్చేలా చరుచుకుని ‘‘ఇదిగో చూడు... అలా నాజూకు నడకలు నడవడం కాదు, ఇలా బస్కీలు తియ్యడం నేర్చుకో, అప్పుడు అలా తామర తూడులా కాకుండా నాలా దిట్టంగా తయారవుతుంది ఒళ్ళు’’ అంటూ రకరకాల కుస్తీపట్లు పట్టడం మొదలెట్టాడు భూషణం.
ఆ పిచ్చి చేష్టల్ని చూసి కోపమొచ్చేసింది కామేష్‌కి. అప్పటికే చుట్టూ అంతా చేరి నవ్వుతుండడంతో, ‘‘అబ్బబ్బా... మామయ్యా ఇలాటివన్నీ పబ్లిక్‌ పార్కులో కాదు, ఇంట్లో చేసుకోవాలి’’ అంటూ భూషణాన్ని ఆపబోయాడు.
వెంటనే కామేష్‌ చేతిని విదిల్చికొట్టి, ‘‘హె... పోవోయ్‌, అగ్గిపెట్టె లాంటి ఇరుకు కొంపలో చెయ్యీ కాలూ కదపడానికెక్కడవుతుంది’’ అంటూ పూర్తిగా తాను చెయ్యాల్సినవన్నీ చేశాక కానీ ఆపలేదు. అలాగే ఒకసారి ఎవరో ఫ్రెండ్స్‌ ఇంటికి వస్తే వాళ్ళ ముందూ కామేష్‌ పరువు తీసేశాడు. మరోసారి అపార్ట్‌మెంటులో అంతా మీటింగ్‌ పెట్టుకుంటే, కామేష్‌ని మాట్లాడనివ్వకుండా, వాళ్ళందరితో తనే వాదనకు దిగిపోయి అక్కడంతా రచ్చరచ్చ చేసేశాడు. అప్పటికే భూషణం మీద అందరికీ ఓ అంచనా ఉండడంతో, ఎవరూ ఏమీ అనకుండా పాపం కామేష్‌ని జాలిగా చూశారు.
గట్టిగా చెప్పలేకా మౌనంగా భరించలేకా లాలసకి చెప్తే, తండ్రినే వెనకేసుకు రావడంతో ఇక చేసేదేంలేక, పనున్నా లేకపోయినా తెల్లారుతూనే ఆఫీసుకి వెళ్ళిపోయి, మళ్ళీ ఏ రాత్రో ఇంటికి చేరుకుని, ఏదో ఇంత తిన్నాననిపించుకుని, వెంటనే గదిలోకెళ్ళి తలుపేసుకుని పడుకుని ఎంత వీలైతే అంత మామగారిని తప్పించుకుని తిరగడం మొదలెట్టాడు. కొద్దిరోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి.
ఒకరోజు ‘‘కావుడూ... నువ్విక్కడున్నావా, అంతా వెతుక్కుంటున్నాను నేనూ’’ అంటూ అరుచుకుంటూ తలుపు తోసుకుని రూమ్‌లోకి వచ్చేస్తున్న మామగారినీ, వెనకాలే అతన్ని ఆపే ప్రయత్నం చేస్తూన్న సెక్యూరిటీనీ చూసి, హెడ్డాఫీసు వాళ్ళతో మీటింగ్‌లో ఉన్న కామేష్‌ నిర్ఘాంతపోయాడు.
వెంటనే పరిగెత్తుకెళ్ళి, ‘‘ప్లీజ్‌ మామయ్యా... అర్జెంట్‌ మీటింగ్‌లో ఉన్నాను, మీరు వెళ్ళిపోండి’’ అంటూ పంపించే ప్రయత్నం చేశాడు.
‘‘ఆ.... అంత దూరం నుండి అన్ని బస్సులు మారి వచ్చింది... వెంటనే పోడానికా, నే వెళ్ళను’’ అంటూ లోపలికి తోసుకుని వచ్చేసి, ఆ రూమ్‌నంతా మొత్తం చూసేస్తూ ‘‘వానపాము మెదడుగాడివి అనుకున్నా, నీకూ ఇంత పెద్ద ఆఫీసూ హంగామా... బావుందిరోయ్‌’’ అంటూ సంబరపడిపోతూ అక్కడే ఓ కుర్చీలో కూర్చుండిపోయిన భూషణాన్ని చూసి కామేష్‌కి ఒళ్ళు మండిపోయింది.
చుట్టూ ఎవరున్నారో, ఏంటో కూడా గమనించకుండా ఎప్పుడూ ఒకటే ధోరణిలో ఉండే భూషణాన్ని ఇక భరించలేక విచక్షణ కోల్పోయి, ‘‘నోరు మూసుకుని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా, లేక సెక్యూరిటీకి చెప్పి బైటకి తోయించెయ్యమంటారా’’ అంటూ
కటువుగా చెప్పాడు.
అల్లుడి మొహంలో అంత కోపం ఎప్పుడూ చూడని భూషణం ఏమనుకున్నాడో ఏమో వెంటనే లేచి ‘‘ఇదిగో ఈమధ్య రోజూ భోజనం బైట తింటున్నావట కదా... మీ అత్తగారు చెప్పింది, అందుకే నీకు భోజనం పట్టుకొచ్చాను’’ అంటూ చేతిలోని బ్యాగును అక్కడ పెట్టేసి బైటికి వెళ్ళిపోయాడు.
అలా తల దించుకుని వెళ్ళిపోతున్న మామగారిని చూసి, ఒక్క క్షణం మనసు చివుక్కుమన్నా దాన్ని పట్టించుకోకుండా ‘హమ్మయ్య’ అని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు కామేష్‌. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి రాగానే హాల్లోనే కూర్చుని ఉగ్రరూపంలో ఉన్న లాలసనూ, ‘అయ్యింది నీ పని...’ అంటూ మూతులు బిగించుకుని బుర్రలు ఊపుతూ పక్క వాయిద్యగాళ్ళలా ఉన్న అత్తా మామలనీ చూసి, పైప్రాణాలు పైకే పోయాయి కామేష్‌కి.
అయినా లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ లాలస దగ్గరికి వెళ్ళి ‘‘భోం చేసేశావా డియర్‌’’ అంటూ పలకరించబోయాడు. దానికి సమాధానంగా ‘‘నా సంగతి పక్కన పెట్టండి, ఏంటీ... మా నాన్న మీకోసం ఎండనపడి అంత దూరం లంచ్‌ పట్టుకొస్తే, సెక్యూరిటీ చేత బైటకి గెంటేయిస్తానంటారా’’ ఉక్రోషంగా అడిగింది లాలస.
‘‘అహ అది కాదు, అసలేం జరిగిందంటే...’’ అని చెప్పబోతున్న కామేష్‌ని ఏం చెప్పనివ్వకుండా ఆపేసి, ‘‘మీరిలాంటి వారనుకోలేదు, ఇదే మీ నాన్నయితే ఇలాగే అనేవారా, ఆయన వయసుకేనా గౌరవమివ్వద్దా’’ అంటూ లాలస మొదలెట్టడంతో, ఇక అసహనం వచ్చేసిన కామేష్‌ ‘‘ఆ... వయసుకు తగ్గట్టు ప్రవరిస్తున్నాడా ఆయన. ఇంగితజ్ఞానం లేని పల్లెటూరి బైతు’’ అని గబుక్కున నోరు జారేశాడు.
ఇక అంతే, వారిద్దరి మధ్యా గాలి దుమారం చెలరేగింది. ఒకానొక తీవ్ర పరిస్థితిలో ‘‘అసలు నీకంటే ముందు మీ నాన్నని చూసి ఉంటేనా... అసలు నిన్ను పెళ్ళి చేసుకోకపోదును. నీ పిచ్చి మోహంలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను’’ అనేసి ఇక ఇంట్లో ఉండటం ఇష్టంలేక బైటకి వచ్చేశాడు కామేష్‌. అసలే ఆఫీసు నుంచి అలసిసొలసి రావడం... ఆపై లాలసతో గొడవ... వీటి వలన మనసూ శరీరమూ రెండూ తన అధీనంలో లేకపోవడం... ఆ చికాకుని ఎవరి మీద చూపించాలో తెలీక బైక్‌ మీద చూపించాడు.
పిచ్చిపిచ్చిగా చెత్తచెత్తగా బైక్‌ని డ్రైవ్‌ చేస్తూ అడ్డమొచ్చిన ఓ ఇద్దరి ముగ్గురికి డాష్‌ కూడా ఇచ్చెయ్యబోయాడు. కొంత దూరం వెళ్ళగానే జేబులో సెల్‌ రింగయింది. ‘ఎవరా?’ అని తీసి చూస్తే మామగారి నుంచి. కసిగా కాల్‌ కట్‌ చేసేశాడు. అయినా మళ్ళీ మళ్ళీ రింగ్‌ అవడంతో, ఇక తట్టుకోలేక, ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మామగార్ని నోటికొచ్చిన బూతులు తిట్టేద్దామనుకునేలోపే అటునుంచి ‘‘అల్లుడూ... అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయి, పరిస్థితి ఏం బాలేదు, హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోతున్నాం, నువ్వు హాస్పిటల్‌కి వచ్చేయ్‌’’ అంటూ గాబరాపడుతూ చెప్పిన మామగారి మాటలు వినగానే, అప్పటివరకూ ఉన్న ఆవేశం, కోపం అన్నీ ఒక్కసారి దిగిపోయాయి కామేష్‌కి.
‘అదేవిటీ ఇంకా నెలాళ్ళు టైమ్‌ ఉందిగా డెలివరీకి. అప్పుడే నొప్పులేమిటీ, తను అనవసరంగా గొడవపడి లాలసను టెన్షన్‌ పెట్టాడా, అందుకే ఇలా అయ్యిందా... అమ్మో ఇప్పుడేమవుతుందో ఏమో...’ అన్న ఆలోచన రాగానే కామేష్‌లో దడ, వణుకు మొదలయ్యాయి. ఆ కంగారులో ముందున్న డివైడర్‌ని చూసుకోలేదు. అంతే, గుద్దేశాడు.

*  *  *

హాస్పిటల్‌ బెడ్‌ మీద పడుకుని ఉన్న కామేష్‌కి కొద్దిగా తెలివి రావడంతో, లేచి కూర్చోబోయాడు. భరించలేని నొప్పితో కాలు కదపలేకపోవడంతో ఆ ప్రయత్నం మానుకుని, ‘అమ్మా...’ అని మూలుగుతూ, తన ఎదురుగానే కూర్చుని ఉన్న మామగారిని చూసి ‘‘నాకేమయ్యింది?’’ అని అడిగాడు ఏడుపు గొంతుతో.
‘‘ఆ... పెద్దగా ఏమవ్వలేదులే, ఓ కాలు విరిగింది అంతే! అయినా ఇంట్లో కోపమొచ్చిందని, రోడ్డు మీదకెళ్ళి చిందులేస్తే ఏమవుతుంది, ఇలాగే ఉంటుంది’’ అంటూ అసలే నొప్పిగా ఉన్న కాలు మీద చిన్న దెబ్బ వేశాడు నవ్వుతూ భూషణం. అంతే కెవ్వుమన్నాడు కామేష్‌.
‘‘సరి సర్లేవోయ్‌... అరుస్తున్నావ్‌, ఆడపిల్ల తండ్రివి ఈ మాత్రం నొప్పి భరించలేకపోతే ఎలాగ?’’ అన్న మామగారి మాటలకి అంత వరకు కుయ్యో మొర్రో మన్నవాడల్లా ఆగిపోయి ‘‘ఏంటీ... ఏమంటున్నారు మీరు’’ అన్నాడు ఆశ్చర్యంగా కామేష్‌.
‘‘అవునోయ్‌... నిన్న రాత్రి మీ ఆవిడకు, అర్జెంటుగా సిజేరియన్‌ చెయ్యాల్సి వచ్చింది, ఆడపిల్ల పుట్టింది. అయితే నెల రోజులముందే పుట్టింది కదా... బరువు తక్కువగా ఉందట, పెట్టెలో పెట్టి బరువు పెంచేస్తారట్లే, చక్కదనాల చుక్కలా ఉంది. నీ పోలిక కాదులే, అంతా నా కూతురిపోలికే’’ అంటూ పగలబడి నవ్వాడు భూషణం.
‘‘అయ్యో... అవునా, మరి ఇప్పుడెలా నేనిక్కడ ఉండిపోయా... తనేం ఇబ్బందిపడుతోందో’’ కొంచెం గాబరా, కొంచెం ఆనందంతో బెడ్‌ మీద నుండి లేచే ప్రయత్నం చేయబోయి, లేవలేక పక్కనే స్టూల్‌ మీద ఉన్న తన సెల్‌ అందుకోబోయాడు. చటుక్కున ఆ సెల్‌ లాగేసుకుని జేబులో పెట్టేసుకున్నాడు భూషణం.
‘‘ఇలాంటి టైమ్‌లో ఈ పరాచికాలేంటి... ఇవతల నేనిలా, అక్కడ లాలస ఏమి ఇబ్బందిపడుతోందో, వెంటనే మా అమ్మా నాన్నలని రమ్మని చెప్తా, ఫోన్‌ ఇలా ఇవ్వండి’’ అన్నాడు చిరాగ్గా కామేష్‌.
అదేమీ వినిపించుకోకుండా నవ్వుతూ చూస్తూ కూర్చున్నాడు భూషణం. ఏ మాత్రం పట్టించుకోకుండా, అసలేవీ వినపడనట్లే మొహం పెట్టి ఇకిలిస్తూ తనవైపే చూస్తున్న మామగారిని చూసి ఒళ్ళు మండిపోయింది కామేష్‌కి. వెంటనే కోపంగా ‘‘ఏంటండీ, వేళాకోళంగా ఉందా, నేను లేవలేననుకుంటున్నారా’’ అంటూ బెడ్‌ మీంచి బలవంతంగా లేచే ప్రయత్నం చేయబోయాడు.
‘‘చాలు చాలు నీ వేషాలు, నువ్వు కంగారుపడి, ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్న మీ అమ్మా నాన్నలని కూడా కంగారు పెట్టెయ్యక్కర్లేదు. ఎలాగో వచ్చే నెల్లో వస్తున్నారుగా రానీ, ఇప్పుడు వాళ్లొచ్చి చేసేదేముందిలే. మీ ఆవిడకీ కూతురికీ అక్కడ అన్ని ఏర్పాట్లూ చేసే వచ్చాను, వాళ్ళకు తోడుగా మీ అత్తగారుంది. నీ కాలుకి సిమెంట్‌ కట్టు వేశారు, ఆరువారాలదాకా పక్క మీంచి కదలకూడదు. కాదని మొండికేసేవో... బావున్న ఆ రెండో కాలు నేను విరగ్గొడతా, ఏ బెంగా లేకుండా నోరు మూసుకుని, రెస్ట్‌ తీస్కో’’ అని ధాటీగా భూషణం చెప్పేసరికి, ఏమీ చెయ్యలేని అశక్తతతో, ఉక్రోషంగా మామగారిని చూస్తుండిపోయాడు కామేష్‌.

*  *  *

ఒంటి మీద ఉన్న గాయాలన్నీ తగ్గాక రెండు, మూడు రోజులకి హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికొచ్చాడు కామేష్‌-మామగారి సహాయంతోనే. ‘మామూలుగానే ఈయనని భరించడం కష్టం. అలాంటిది... ఈ బెడ్‌ మీద కదల్లేని స్థితిలో, ఇంట్లో వేరెవరూ లేకుండా, ఎలా రా బాబూ వేగేది’ అని ఒక రకమైన భయాందోళనలకు లోనయ్యాడు కామేష్‌.
ఆ రోజు సాయంత్రం బాత్‌రూమ్‌కి వెళ్ళడానికి, బెడ్‌ మీంచి లేవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటే, ఈలోగా ‘‘ఎందుకల్లుడూ, వెధవ మొహమాటం నువ్వునూ, నన్ను పిలవొచ్చుగా’’ అంటూ చేతిలో బెడ్‌ పాన్‌తో వచ్చిన మామగారిని చూసి, ‘‘మామయ్యా, మీరు ఈ పని... వద్దు, వద్దు’’ అంటూ ఆశ్చర్యపోతూ, అభ్యంతరం చెప్పి చేతులు అడ్డం పెట్టాడు కామేష్‌.
ఎప్పట్లా అతని చేతుల్ని పక్కకు తోసేసి ‘‘చాలు చాల్లేవోయ్‌, నేను చెయ్యకపోతే ఎవరున్నారిక్కడ చెయ్యడానికి, ఇదే మీ నాన్న అయితే ఇలాగే అంటావా? నాకు మాత్రం మగ వెధవలెవరున్నారు... అల్లుడివైనా, కొడుకువైనా నువ్వే కదోయ్‌’’ అంటూ చనువుగా అంటున్న భూషణాన్ని చూసి - మామగారి మాటా, ప్రవర్తనా అంత మోటుగా ఉన్నా, మనసెంత మెత్తనో - అర్ధంచేసుకున్న కామేష్‌కి, మొదటిసారి మామగారి మీద ప్రేమాభిమానాలు పొంగుకొచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

*  *  *

ఓ నెల్లాళ్ళయ్యాక హాస్పిటల్‌ నుంచి చంటిబిడ్డను ఎత్తుకుని, తల్లితో సహా ఇంటికి వచ్చిన లాలసకు గుమ్మంలోనే ‘‘ఎదవ ఎకసెక్కాలూ, మీరూను, ఊరుకోండి మామయ్యా’’ అంటూ పగలబడి నవ్విన కామేష్‌ గొంతూ, ఆ వెనకే వికటాట్టహాసాలు చేస్తున్న తండ్రి గొంతూ వినపడేసరికి, ఆనందాశ్చర్యాలతో అవాక్కే అయింది.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న