దసరా విందు.. పసందు! - Sunday Magazine
close
దసరా విందు.. పసందు!

దసరా అంటేనే సంబరం. నవరాత్రుల్లో పెట్టే నైవేద్యాలతోపాటూ ఇతర పిండివంటలూ తప్పనిసరే కాబట్టి...  ఈసారి వీటిని ట్రై చేద్దామా...


గోధుమ మురుకులు

కావలసినవి: గోధుమపిండి: రెండు కప్పులు, బియ్యప్పిండి: పావుకప్పు, జీలకర్ర: చెంచా, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, ఉప్పు: చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీవిధానం: ఓ గిన్నెలో పల్చని వస్త్రం వేసి అందులో గోధుమపిండి, బియ్యప్పిండి తీసుకుని మూట కట్టాలి. ఈ గిన్నెను కుక్కర్‌లో ఉంచి ఆవిరిమీద పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుని తీసుకోవాలి. ఆవిరికి ఈ పిండి కాస్త గట్టిపడుతుంది కాబట్టి మరోసారి కలుపుకుని జల్లించుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నీళ్లు పోస్తూ మురుకులపిండిలా చేసుకోవాలి. మురుకుల గొట్టానికి నూనె రాసుకుని అందులో ఈ పిండిని ఉంచి... కాగుతున్న నూనెలో మురుకుల్లా వత్తి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


మూంగ్‌దాల్‌ లడ్డు

కావలసినవి: పెసరపప్పు: కప్పు, చక్కెర: ముప్పావుకప్పు, పాలపొడి: నాలుగు టేబుల్‌స్పూన్లు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు: రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: పావుచెంచా, నెయ్యి: పావుకప్పు.
తయారీవిధానం: ముందుగా పెసరపప్పును నూనె లేకుండా వేయించుకోవాలి. వేడి చల్లారాక మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. చక్కెరను కూడా పొడి చేసి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి, పిండిని వేయించాలి.  అందులోనే చక్కెర, పాలపొడి, యాలకులపొడి, డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేసి బాగా కలిపి ముద్దలా అవుతున్నప్పుడు దింపేయాలి. ఆ తరువాత కరిగించిన నెయ్యి వేసుకుంటూ ఉండల్లా చుట్టుకోవాలి.


ముఖ్కన్‌ పేడా

కావలసినవి: చక్కెర కలపని కోవా: అరకప్పు, మైదా: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: రెండు చెంచాలు, వంటసోడా: చిటికెడు, నూనె: వేయించేందుకు సరిపడా. స్టఫింగ్‌కోసం: జీడిపప్పులు: అయిదు, బాదం గింజలు: అయిదు, కిస్‌మిస్‌: అయిదు, చక్కెరలేని కోవా: చెంచా, చకక్కెరపొడి: అరచెంచా, ఆహారరంగు: చిటికెడు. పాకంకోసం: చక్కెర: కప్పు, నీళ్లు: కప్పు, యాలకులపొడి: అరచెంచా.
తయారీవిధానం: ముందుగా స్టఫింగ్‌ తయారుచేసుకోవాలి. బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ని సన్నని పలుకుల్లా చేసుకోవాలి. ఇందులో స్టఫింగ్‌కోసం పెట్టుకున్న మిగిలిన పదార్థాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి చక్కెర, నీళ్లు పోయాలి. చక్కెర కరిగి పాకంలా తయారవుతున్నప్పుడు యాలకులపొడి వేసి కలిపి దింపేయాలి. ఓ గిన్నెలో కోవా, మైదా, నెయ్యి, వంటసోడా వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తరువాత నిమ్మకాయంత ఉండల్లా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని అరచేతిలోనే వెడల్పుగా చేసుకుని అరచెంచా బాదం మిశ్రమం ఉంచి.. అంచులు జాగ్రత్తగా మూసేయాలి. ఇదేవిధంగా మిగిలినవీ చేసుకుని రెండుచొప్పున కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటిని చక్కెర పాకంలో వేసి... అరగంటయ్యాక తీసి తినొచ్చు.


స్పైసీ మైదా రోల్స్‌

కావలసినవి: మైదా: కప్పు, ఎండుమిర్చి: ఆరు (పొడిచేసుకోవాలి), జీలకర్ర: అయిదు చెంచాలు, పల్లీపొడి: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీవిధానం: ఓ గిన్నెలో మైదాను జల్లించుకుని అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా కలుపుకోవాలి. పది నిమిషాలయ్యాక నిమ్మకాయంత ఉండను తీసుకుని చపాతీలా వత్తుకుని, చాకుతో నిలువుగా కోసుకోవాలి. ఒక ముక్కను గుండ్రంగా చుట్టుకుని అంచుల్ని తడిచేత్తో మూసేయాలి. ఇదే విధంగా మిగిలినవీ చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


మాల్‌పువా

కావలసినవి: ఫుల్‌క్రీమ్‌ పాలు: నాలుగున్నర కప్పులు, నిమ్మరసం: ఒకటిన్నర టేబుల్‌స్పూను, చక్కెర: ఒకటింపావుకప్పు, మొక్కజొన్నపిండి: ఒకటిన్నర టేబుల్‌స్పూను, నెయ్యి: వేయించేందుకు సరిపడా,  డ్రైఫ్రూట్స్‌ పలుకులు: అలంకరణ కోసం, పాలు: సరిపడా
తయారీవిధానం: చక్కెరను ఓ గిన్నెలోకి తీసుకుని కప్పు నీళ్లు పోసి.. స్టౌమీద పెట్టి, పాకంలా అవు తున్నప్పుడు దింపేయాలి. స్టౌమీద మరో గిన్నె పెట్టి ఫుల్‌క్రీమ్‌ పాలు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు నిమ్మరసం వేసి కలిపితే పాలు విరుగుతాయి. ఆ విరుగుడును వడకట్టుకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో మొక్కజొన్నపిండి వేసి కలిపి తరువాత పాలుపోస్తూ దోశపిండిలా చేసుకోవాలి. అయిదు నిమిషాలయ్యాక స్టౌమీద కడాయి పెట్టి. నెయ్యి వేయాలి. ఈ పిండిని చిన్న గరిటెతో తీసుకుని అందులో వేసి, వేయించుకుని తీసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పాకంలో వేసి పావుగంటయ్యాక తీసి డ్రైఫ్రూట్స్‌ పలుకులు అలంకరిస్తే చాలు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న