కదంబం - Sunday Magazine
close

కదంబం

నీటిని వేడిచేసే పూలు

వేడినీటిలో స్నానం చేయాలంటే గీజర్‌ వేసుకుంటాం అది లేకపోతే హీటర్‌ పెట్టుకుంటాం. కానీ వాటి అవసరం లేకుండా ఇప్పుడు పూలే నీటిని వేడిచేస్తుండటంతో కొందరు అలాంటి పూలను వాడేస్తున్నారట. పూలేంటీ, నీటిని వేడిచేయడం ఏంటని ఆశ్చర్యపోయినా అది నిజం. ఎందుకంటే ఇవి సోలార్‌ప్యానెల్‌తో తయారుచేసిన పూలు మరి. వీటిని నీటిలో వేసినప్పుడు అవి సూర్యకాంతిని గ్రహించి చాలా తక్కువ సమయంలోనే నీటిని వేడిగా మార్చేస్తాయట. అందుకే ఇప్పుడు చాలామంది ఈ పూలను కొని ఈతకొలనుల్లో వేసుకొంటున్నారు. అవిలేని వాళ్లు బక్కెట్లలో వేసుకుని వాటిని బాల్కనీలోనో ఆరుబయటో కాసేపు పెట్టి ఆ తరువాత వాడుకుంటున్నారట. బాగున్నాయి కదూ.


ఆర్నెల్లకోసారి ఆఫీసు... రు.14 లక్షల జీతం!  

ద్యోగస్తులు ఎవరైనా పొద్దున్నే ఆఫీసుకు వెళ్లి, సాయంత్రం ఇంటికొస్తారు. నెలకోసారి జీతం తీసుకుంటారు. కానీ కెవిన్‌ మాత్రం అందరిలా కాకుండా ఆర్నెల్లకోసారి ఒక్కరోజు మాత్రమే ఉద్యోగానికి వెళ్లొచ్చి ఇరవైవేల డాలర్లను జీతంగా తీసుకుంటాడు. అంటే... మన ఇండియన్‌ కరెన్సీలో దాదాపు పద్నాలుగు లక్షల, డెబ్బైవేల రూపాయలు అన్నమాట. ఒక్కరోజుకు అంత జీతమా అంటే- తప్పదు, కెవిన్‌ చేసే ఉద్యోగం అలాంటిది మరి అంటుంది అతను పనిచేసే సంస్థ. కెవిన్‌ ‘సూఫాల్స్‌ టవర్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌’ సంస్థలో ఇంజినీర్‌గా చేస్తున్నాడు. ఆర్నెల్లకోసారి- అమెరికా సౌత్‌ డకోటాలోని 457 మీటర్ల ఎత్తు ఉండే టెలిఫోన్‌ టవర్‌లో ఉన్న లైట్‌ బల్బును మార్చడమే అతని పని. అలా ఎక్కి దిగేందుకు ఒక రోజంతా పడుతుందట. పైగా గాలి ఎక్కువగా ఉండటం వల్ల అన్ని అడుగుల ఎత్తు ఉన్న టవర్‌ను ఎక్కి దిగడం కూడా కష్టం కాబట్టే అంత జీతమట.


సరస్సులో ఏటీఎం

చేతిలో డబ్బు లేనప్పుడు అప్పటికప్పుడు దగ్గర్లో ఉన్న ఏటీఎంకు వెళ్లి డ్రా చేసుకోవడం అందరూ చేసేదే. పట్టణాలూ, నగరాల్లో అయితే బోలెడు ఏటీఎం సెంటర్లు కనిపిస్తాయి కానీ జమ్మూ-కశ్మీర్‌లోని దాల్‌ లేక్‌ దగ్గర అసలు ఏటీఎం లేదట. దాంతో ఆ సరస్సులో హౌస్‌బోట్లలో నివాసం ఉన్నవారూ, అక్కడికి విహారయాత్రకు వచ్చేవారూ డబ్బు డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. దాన్ని గుర్తించిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆ సరస్సులో ఫ్లోటింగ్‌ ఏటీఎంను ఈ మధ్యే అందుబాటులోకి తెచ్చింది. పడవలోనే ఏర్పాటుచేసిన ఆ ఏటీఎం... ఆ సరస్సు అంతా తిరుగుతూ ఉంటుంది కాబట్టి అవసరమైనవారు ఏ ఇబ్బందీ లేకుండా ఎప్పుడంటే అప్పుడు డబ్బు తీసుకోవచ్చు. ఎస్‌బీఐ ప్రారంభించిన ఈ వినూత్న సేవల్ని చూశాక పర్యటకులు డబ్బు తీసుకుంటూనే ఆ ఏటీఎం పక్కన నిల్చుని ఫొటోలు కూడా దిగుతున్నారట.


ఆ ఆలయంలో మజ్జిగే ప్రసాదం

గుడికి వెళ్లినా... దర్శనం అంతా అయ్యాక తీర్థం ఇచ్చి, పులిహోర, పొంగలి... లాంటి ప్రసాదాలను పెట్టడం మామూలే. కానీ బెంగళూరులోని గంగాధరీశ్వర స్వామి ఆలయంలో మాత్రం మజ్జిగను ప్రసాదంగా ఇస్తారు. ఒకప్పుడు ఈ శివాలయంలోనూ పులిహోర, పరమాన్నం, అరటిపండ్లు... వంటివే ఇచ్చేవారట. అయితే... శివలింగాన్ని అభిషేకించేందుకు భక్తులు లీటర్లకొద్దీ పాలు తీసుకురావడం, అవి వృథా కావడం గమనించిన ఆలయ ప్రధాన పూజారి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలనుకున్నాడట. ఫలితమే ఈ మజ్జిగ ప్రసాదం అంటాడు ప్రధాన పూజారి స్వామి ఈశ్వరానంద. ‘ఒక్క సోమవారం రోజే స్వామిని అభిషేకించేందుకు భక్తులు సుమారు అయిదువందల లీటర్ల పాలను తీసుకొస్తారు. ఆ తరువాత అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని గమనించినప్పుడు బాధేసింది. బాగా ఆలోచించి అభిషేకం చేసిన పాలను జాగ్రత్తగా సేకరించి... తరువాత పెరుగు తోడుబెట్టి... మజ్జిగ చేసి భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం మొదలుపెట్టాం’ అంటూ వివరిస్తాడు. ఇలా అభిషేకం చేసే పాలల్లో ఎలాంటి పూలూ, ఇతర పదార్థాలూ కలవకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటూ పాలు తోడుబెట్టి మజ్జిగ చేశాక కూడా రుచిలో తేడా ఉంటే భక్తులకు పంచరట. ఏదేమైనా ఈ ఆలోచన అభినందనీయం కదూ.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న