కాలుష్య కట్టడికి ‘చక్ర’ వ్యూహం!
close

Updated : 24/02/2021 16:45 IST

కాలుష్య కట్టడికి ‘చక్ర’ వ్యూహం!

వాయు కాలుష్యం రోజురోజుకీ పెద్ద భూతంగా మారుతోంది. కొన్ని మహా నగరాల్లో శ్వాస తీసుకోవటమే కనాకష్టంగా తయారయ్యింది. వాయు కాలుష్యం మూలంగా మనదేశంలో ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారు. దీనికి ఏమాత్రం కళ్లెం వేసినా ఎంతోమంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. వాయు కాలుష్యానికి ఒక్క వాహనాలే కాదు, డీజిల్‌ జెనరేటర్లు సైతం కారణమవుతున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ మూలంగా మన జీవనకాలం 11 నెలల వరకు తగ్గుతుందని అంచనా.
మానవాళి ఆరోగ్యానికి గొడ్డలి పెట్టుగా మారుతున్న గాలి కాలుష్యం కోరలు పీకేదెలా? దిల్లీ ఐఐటీ పరిశోధకులు ఇలాగే ఆలోచించారు. డీజిల్‌ జెనరేటర్ల నుంచి వెలువడే హానికారక పొగను తగ్గించే వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. దీనిపేరు ‘చక్ర షీల్డ్‌’. దీన్ని జెనరేటర్‌ సైలెన్సెర్‌ దగ్గర అమర్చితే చాలు. అందులోంచి వెలువడే పొగను గ్రహించి.. ఫిల్టర్‌, రసాయన ప్రతిచర్యలు సమర్థంగా సాగటానికి తోడ్పడే పదార్థం సాయంతో హైడ్రోకార్బన్లను కార్బన్‌డయాక్సైడ్‌గా మార్చేస్తుంది. అనంతరం దాన్ని పొగ గొట్టం ద్వారా బయటకు వదిలేస్తుంది. నుసి పదార్థం(పార్టిక్యులేటర్‌ మ్యాటర్‌)తో పోలిస్తే కార్బన్‌ డయాక్సైడ్‌ 460 రెట్లు తక్కువ హాని కలిగిస్తుంది. డీజిల్‌ జెనరేటర్ల నుంచి వెలువడే కాలుష్యాన్ని చక్ర షీల్డ్‌ 80% వరకు తగ్గిస్తుందని, సుమారు 1.26 కోట్ల లీటర్ల గాలిని కాలుష్యం బారినపడకుండా కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది నుసి పదార్థం (పీఎం2.5, పీఎం10), కార్బన్‌ మోనాక్సైడ్‌, హైడ్రో కార్బన్‌ ఉద్గారాలను తగ్గిస్తుందని వివరిస్తున్నారు. ఇప్పటికే దిల్లీలోని ఒక మాల్‌ ప్రాంగణంలో దీన్ని 5 జెనరేటర్లకు అమర్చారు కూడా. వీటితో ఏడాదికి 378 కిలోల నుసి పదార్థం తగ్గగలదని అంచనా. ఇది 174 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలకు సమానం కావటం విశేషం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న