వాళ్లిద్దరూ అల్లాహ్‌ స్వర్గంలో ప్రవేశించారు!

వారు వారు చేసిన పాపపుణ్యాలను బట్టి ప్రళయం రోజున త్రాసు మొగ్గు చూపుతుంది. ఆ త్రాసు పుణ్యం వైపు మొగ్గుచూపితే స్వర్గానికి, పాపం వైపు మొగ్గితే నరకం చేరతారు. కానీ కొన్నిసార్లు విచిత్ర పరిస్థితి ఏర్పడుతుంది.

Published : 15 Feb 2024 00:10 IST

వారు వారు చేసిన పాపపుణ్యాలను బట్టి ప్రళయం రోజున త్రాసు మొగ్గు చూపుతుంది. ఆ త్రాసు పుణ్యం వైపు మొగ్గుచూపితే స్వర్గానికి, పాపం వైపు మొగ్గితే నరకం చేరతారు. కానీ కొన్నిసార్లు విచిత్ర పరిస్థితి ఏర్పడుతుంది. పుణ్యాలు, పాపాలు సరిసమానంగా ఉంటాయి. స్వర్గం చేరాలంటే ఒక్క పుణ్యం అవసరం ఏర్పడుతుంది. అప్పుడు అల్లాహ్‌ ఆ వ్యక్తితో ‘వెళ్లు.. ఎవరైనా ఒక్క పుణ్యం నీకు దానం చేస్తారేమో ప్రయత్నించు’ అంటాడు. అప్పుడతను ఆ ఒక్క పుణ్యం కోసం కనిపించిన ప్రతి ఒక్కరినీ ప్రాధేయపడతాడు. కానీ ఒక్కరూ ముందుకు రారు. అతనికి ఒక్క పుణ్యమిచ్చినా తమకెక్కడ తక్కువ అవుతుందోనని భయపడతారు. అలాంటి సందర్భంలో ఓ వ్యక్తి నిరాశగా అల్లాహ్‌ వద్దకు వస్తుంటే ఒకరు ఆపి.. ‘ఎందుకింత నిరాశ?’ అనడిగాడు. ‘ఒక పుణ్యం తక్కువయ్యింది. ఎవరూ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఎంత పిసినారులు?!’ అంటూ బాధగా నిట్టూర్చాడు. ‘ఆ ఒక్క పుణ్యం నేనిస్తాను. నా త్రాసులో ఒక్క పుణ్యం తప్ప తక్కినవన్నీ పాపాలే ఉన్నాయి. ఆ ఒక్క పుణ్యంతో నాకు స్వర్గం ఎటూ దక్కదు కనుక తీసుకో’ అని ఇచ్చేశాడు. స్వర్గం దక్కిందన్న సంతోషంతో అల్లాహ్‌ ముందు హాజరయ్యాడు. ‘ఇంతకీ ఈ పుణ్యాన్ని ఎలా సాధించావు?’ అని అడగ్గా.. జరిగిందంతా వివరించాడతను. అల్లాహ్‌కు ఆ దాతృత్వం ఎంతగానో నచ్చి ‘వెళ్లి అతన్ని తీసుకురా! ఇద్దరూ కలిసి స్వర్గంలో నిశ్చింతగా ప్రవేశించండి’ అన్నాడు. దాతృత్వం ఎంత గొప్పదో చెప్పేందుకు ప్రవక్త బోధనల గ్రంథంలోని ఈ ఘటనను ఉలమాలు ఉదాహరిస్తుంటారు.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని