బ్రహ్మ కడిగిన పాదం.. ఏమిటా సందర్భం?

పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.

Published : 28 Mar 2024 00:05 IST

పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి అనుసరించింది. కొంతకాలానికి శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి, బలిచక్రవర్తి నుంచి మూడడుగుల నేలను దానమడిగాడు. ముల్లోకాలను ఆక్రమిస్తూ ఒక పాదంతో బ్రహ్మలోకాన్ని ఆక్రమించాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ భక్తి పారవశ్యంతో, తన కమండలంలోని గంగాజలంతో ఆ శ్రీహరి పాదాలను కడగగా.. పరమ పావన గంగ అక్కడే స్థిరంగా ఉండి పోయింది. అలా విష్ణుపాదాన ఒదిగిన గంగనే భగీరథుడు తపస్సుతో భువి పైకి రప్పించాడు. ఆ విధంగా గంగా దేవి ‘విష్ణు పాదోద్భవ’ అయ్యింది. ‘బ్రహ్మ కడిగిన పాదము’ అనే వాక్యం వెనుక కథ ఇది. ఈ ఘట్టాన్నే స్మరించుకుంటూ సంకీర్తనాచార్యుడు అన్నమాచార్యులు.. ‘బ్రహ్మ కడగిన పాదము, బ్రహ్మము తానె నీ పాదము’ అన్న కీర్తనను ఆలపించాడు. ‘నీ పాదం భక్తుల పాలిట పరబ్రహ్మ స్వరూపం..’ అంటూ స్వామిని స్తుతించాడు.

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని