ఇంటర్‌తో-2 బైపీసీతో.. భేషైన కోర్సులెన్నో!

ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువమంది లక్ష్యం ఎంబీబీఎస్‌. అయితే పరిమిత సీట్ల దృష్ట్యా ఆ అవకాశం కొందరికే దక్కుతోంది.

Updated : 06 Jul 2023 02:49 IST

ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువమంది లక్ష్యం ఎంబీబీఎస్‌. అయితే పరిమిత సీట్ల దృష్ట్యా ఆ అవకాశం కొందరికే దక్కుతోంది. మరి మిగిలినవారి సంగతి? వీరి కోసమూ ఎన్నో కోర్సులు ఉన్నాయి. అవన్నీ బంగారు భవిష్యత్తును అందించేవే!

వైద్యరంగంలో ప్రవేశానికి నీట్‌ స్కోరే ప్రామాణికం. ఎంబీబీఎస్‌లో అవకాశం రానివాళ్లు బీఏఎంస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీడీఎస్‌, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ కోర్సుల్లో చేరుతున్నారు. కొంతమంది విదేశాల్లోనూ వైద్యవిద్య అభ్యసించడానికి వెళ్తున్నారు. మరికొందరు ఎంబీబీఎస్‌ లక్ష్యంగా లాంగ్‌ టర్మ్‌ శిక్షణలో చేరుతున్నారు. ఇంకా మిగిలిన విద్యార్థులు అందుబాటులో ఉన్న కోర్సుల్లో తమకు సరిపోయేవి ఎంచుకోవచ్చు.

స్పెషల్‌ బీఎస్సీ

అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫిషరీ సైన్స్‌, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్‌, ఫుడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌, సెరీకల్చర్‌.. మొదలైన విభాగాల్లో నాలుగేళ్ల వ్యవధితో ప్రత్యేక కోర్సులు దేశవ్యాప్తంగా సమారు 70కిపైగా సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌) తరఫున ఎన్‌టీఏ నిర్వహించే ఏఐఈఈఏ పరీక్ష రాయాలి. ఏపీ, తెలంగాణల్లోని విశ్వవిద్యాలయాల్లో ఎంసెట్‌/ఈఏపీసెట్‌ స్కోరుతో అవకాశం కల్పిస్తారు. వైద్యవిద్య తర్వాత డిమాండ్‌ ఎక్కువ ఉన్న కోర్సులివే. యూజీ తర్వాత పీజీ, పీహెచ్‌డీలను పూర్తిచేసుకోవచ్చు. యూజీతోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో మేటి ఉద్యోగాలూ పొందవచ్చు.

జనరల్‌ బీఎస్సీ

బైపీసీ విద్యార్థులు ప్రాధాన్యమిస్తోన్న చదువుల్లో బీఎస్సీ ముఖ్యమైంది. ఇందులో నచ్చిన మూడు కోర్‌ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఏదైనా ఒక సబ్జెక్టును ఆనర్స్‌ విధానంలో నాలుగేళ్ల వ్యవధితోనూ పూర్తిచేసుకోవచ్చు. ఉన్నత విద్యకు, బోధన, పరిశోధనల్లో రాణించడానికి ఈ బీఎస్సీ కోర్సులు ఉపయోగపడతాయి. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్‌, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఆక్వాకల్చర్‌ టెక్నాలజీ, అప్లైడ్‌ న్యూట్రిషన్‌, ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ... తదితర సబ్జెక్టులను బీఎస్సీలో భాగంగా ఎంచుకోవచ్చు. తర్వాత వీటిలోనే పీజీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. ఇంటర్‌ మార్కులతో ఏపీ, తెలంగాణల్లో ప్రవేశాలుంటాయి.

బీఫార్మసీ

ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ ఎంచుకోవచ్చు. ఎంసెట్‌ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. సగం సీట్లు బైపీసీ విద్యార్థులకు కేటాయించారు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఆసక్తి ఉన్నవారు నచ్చిన స్పెషలైజేషన్‌లో ఎంఫార్మసీ పూర్తిచేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పలు కళాశాలలు బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులు అందిస్తున్నాయి.

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ

ఇంటర్‌ బైపీసీ తర్వాత నేరుగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ చదువుకోవచ్చు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పెద్ద సంఖ్యలో ఈ కోర్సులున్నాయి. సీయూసెట్‌తో వీటిలో అవకాశం లభిస్తుంది. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలూ ఈ తరహా కోర్సులు బోధిస్తున్నాయి. బోటనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, లైఫ్‌ సైన్సెస్‌...తదితర సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.

బీఎస్‌-ఎంఎస్‌

ఐఐఎస్సీ నాలుగేళ్ల బీఎస్‌ కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరినవారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎంఎస్‌ పట్టా అందుకోవచ్చు. ఇదే తరహాలో ఐఐఎస్‌ఈఆర్‌లు బీఎస్‌-ఎంఎస్‌ కోర్సులను ఐదేళ్ల వ్యవధితో నడుపుతున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. పరీక్షలో చూపిన ప్రతిభ/ నీట్‌ స్కోరుతో ప్రవేశాలు లభిస్తాయి. ఈ సంస్థల విద్యార్థులకు ప్రతి నెలా స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. వీటిని పూర్తిచేసుకున్నవారు పరిశోధన సంస్థల్లో పీహెచ్‌డీవైపు దృష్టి సారించవచ్చు.

ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌

బోధన రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ కోర్సు వైపు అడుగులేయవచ్చు. పేరొందిన సంస్థల్లో వీటిని పూర్తి చేసుకుని ఏడాది సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, మైసూరు ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌ కోర్సును నాలుగేళ్ల వ్యవధితో అందిస్తోంది. అజీం ప్రేమ్‌ జీ విశ్వవిద్యాలయంలోనూ ఈ కోర్సులు చదువుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన కొన్ని కేంద్రీయ విద్యాసంస్థల్లోనూ ఈ చదువులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో అవకాశం లభించనివారు రెండేళ్ల డీఎడ్‌ కోర్సుల్లో చేరవచ్చు.

నర్సింగ్‌

బీఎస్సీ నర్సింగ్‌ ప్రాధాన్యం పెరుగుతోంది. బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. జాతీయ సంస్థలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఎంసెట్‌/ నీట్‌ ర్యాంకుతో అవకాశం కల్పిస్తారు. బీఎస్సీ నర్సింగ్‌ అనంతరం ఎమ్మెస్సీ నర్సింగ్‌ ఆ తర్వాత ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు. నర్సింగ్‌ విద్యపై ఆసక్తి ఉండి, బీఎస్సీ నర్సింగ్‌లో సీటు రానివాళ్లు జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం కోర్సుల్లో చేరవచ్చు.

ఫిజియోథెరపీ

బైపీసీ విద్యార్థులు పరిగణించాల్సిన వాటిలో ఫిజియోథెరపీ ఒకటి. దీన్ని పూర్తిచేసుకున్నవారికి ఉపాధికి ఢోకా ఉండదు. ఏపీ, తెలంగాణల్లో సుమారు 50 కాలేజీలు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు అందిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రత్యేక సంస్థలూ ఉన్నాయి. అలాగే ఎయిమ్స్‌తోపాటు పేరున్న సంస్థలెన్నో ఈ కోర్సు అందిస్తున్నాయి. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఫిజియో అభ్యసించవచ్చు. ఇంటర్‌ మార్కుల మెరిట్‌/ ఎంసెట్‌/నీట్‌ స్కోరు లేదా ప్రవేశ పరీక్షతో కోర్సులోకి తీసుకుంటారు. బీపీటీ పూర్తిచేసుకున్నవారు ఎంపీటీ కోర్సులో చేరవచ్చు. పీజీలో నచ్చిన స్పెషలైజేషన్‌ దిశగా అడుగులేయవచ్చు.

పారా మెడికల్‌

కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందడానికి పారా మెడికల్‌ కోర్సులు దారిచూపుతాయి. వీరు ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో సేవలు అందించవచ్చు. అనస్థీషియా టెక్నాలజీ, మెడికల్‌ టెక్నాలజీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, యూరాలజీ టెక్నాలజీ, పర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, స్లీప్‌ లేబొరేటరీ టెక్నాలజీ, రెస్పిరేటరీ టెక్నాలజీ, న్యూరో మానిటరింగ్‌ టెక్నాలజీ, ఆర్థోపెడిక్స్‌ టెక్నాలజీ, డెంటల్‌ హైజీనిస్ట్‌, డెంటల్‌ ఆపరేటింగ్‌ రూమ్‌ అసిస్టెంట్‌, ఆప్టోమెట్రీ తదితర బ్యాచిలర్‌ కోర్సులు బైపీసీ విద్యార్థులు చదువుకోవచ్చు. కోర్సులను బట్టి వీటి వ్యవధి.. మూడేళ్లు, మూడున్నర, నాలుగేళ్లగా ఉంటుంది. జాతీయ స్థాయిలో ఎయిమ్స్‌ వివిధ కేంద్రాలతోపాటు పలు ఇతర సంస్థల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏపీలో వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, తెలంగాణలోని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయాల పరిధిలోని పలు సంస్థల్లో ఈ కోర్సులు చదువుకోవచ్చు. అలాగే కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు సైతం పారామెడికల్‌ శిక్షణ అందిస్తున్నాయి. డిప్లొమా స్థాయిలోనూ పలు పారా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి వ్యవధి రెండేళ్లు. రాష్ట్రాల పారా మెడికల్‌ బోర్డుల ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభ లేదా ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో సీట్లు కేటాయిస్తారు.

ఇతర కోర్సులు

బైపీసీ నేపథ్యంతో కాకుండా ఇతర కోర్సుల్లో చేరాలనుకునేవారికి వైవిధ్యమైన ఆప్షన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి..

నేజ్‌మెంట్‌ కోర్సులు, న్యాయవిద్య, సీఏ, సీఎంఏ, బీబీఏ, బీబీఎం. కొన్ని ఐఐఎంలతోపాటు పలు సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ విధానంలో బీబీఏ, ఎంబీఏ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో చేరవచ్చు. లేదా క్లాట్‌తో ప్రముఖ న్యాయవిశ్వవిద్యాలయాల్లో న్యాయవిద్య అభ్యసించవచ్చు. ఫ్యాషన్‌ డిజైన్‌, లిబరల్‌ స్టడీస్‌, ఫారిన్‌ లాంగ్వేజ్‌లు.. ఇలా ఎవరికి వారు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు.

తాజా ప్రకటనలు

* ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీ అందించే బీఎస్సీ ఆనర్స్‌ -అగ్రికల్చర్‌/కమ్యూనిటీ సైన్స్‌/ హార్టికల్చర్‌, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ కోర్సులకు ఎంసెట్‌ స్కోరుతో జులై 15లోగా రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎన్‌జీరంగా యూనివర్సిటీ అందిస్తోన్న బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులో ప్రవేశానికి జులై 17లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ మెరిట్‌తో ప్రవేశాలుంటాయి.
* బీఎస్సీ ఫారెస్ట్రీలో ములుగు అటవీ కళాశాలలో చేరవచ్చు. జులై 12లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసెట్‌ స్కోరుతో అవకాశం కల్పిస్తారు.
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్స్‌(నిమ్‌హాన్స్‌) బెంగళూరు అందించే పలు బీఎస్సీ కోర్సులకు జులై 7లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని