చేరిన కోర్సులో చక్కగా మెరవండి!

నూతన విద్యా సంవత్సర తరుణమిది. ఇంజినీరింగ్‌, ఇతర కోర్సుల్లో కొత్తగా ప్రవేశించేవారికి త్వరలో తరగతులు  మొదలవుతాయి.

Published : 13 Jul 2023 00:32 IST

నూతన విద్యా సంవత్సర తరుణమిది. ఇంజినీరింగ్‌, ఇతర కోర్సుల్లో కొత్తగా ప్రవేశించేవారికి త్వరలో తరగతులు  మొదలవుతాయి. నూతన సబ్జెక్టులు, అధ్యాపకులతో కొంతమంది విద్యార్థులకు పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే సబ్జెక్టు   నేర్చుకోవటంలో, సిలబస్‌ సకాలంలో పూర్తిచేసే విషయంలో ఎదురయ్యే సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చు, సానుకూల ఫలితాలనూ పొందొచ్చు. అందుకోసం ఏం చేయాలంటే...

వేసవి సెలవుల్లో ఇష్టమైన పనులు మాత్రమే చేస్తూ ఆనందంగా సమయాన్ని గడిపేసుంటారు కదా. తరగతులు మొదలయిన దగ్గర్నుంచే వాటికి హాజరవటంలో, సబ్జెక్టును అవగాహన చేసుకోవటంలో శ్రద్ధ అవసరం. సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవాలి.
* తరగతిలో పాఠాలను వింటున్నప్పుడు కొన్ని సందేహాలు రావొచ్చు. వాటిని అప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడానికి అసలు మొహమాటపడకూడదు. వెంటనే అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలి. అప్పటికీ అర్థంకాకపోతే ఆ సబ్జెక్టు అంటే బాగా ఇష్టపడే స్నేహితులను అడిగి తెలుసుకోవచ్చు. వారినైతే ఇబ్బందిపడకుండా స్వేచ్ఛగా అడగొచ్చు.
* కొత్త కోర్సులు.. సబ్జెక్టులు.. పరీక్షలు.. ఇవన్నీ ఒత్తిడిని పెంచేవే. అయితే అభిరుచులకు సమయాన్ని కేటాయించడం వల్ల వీటి నుంచి త్వరగా బయటపడొచ్చు. బొమ్మలు గీయడం, నచ్చిన పాటలు వినడం, ఆటలు ఆడుకోవడం, పుస్తకాలు చదవడం చేయొచ్చు. ఇవన్నీ ఉత్సాహాన్ని నింపి.. సానుకూలంగా ఆలోచించేలానూ చేస్తాయి. దాంతో ఇష్టంగా చదువును కొనసాగించొచ్చు.
* కొంతమంది విద్యార్థులు.. ఆసక్తి ఉన్న సబ్జెక్టులకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆసక్తిలేని సబ్జెక్టులను చదవడానికి అంతగా ఇష్టపడరు. అలాకాకుండా ప్రతి సబ్జెక్టు అధ్యయనానికీ నిర్ణీత సమయాన్ని ముందునుంచే కేటాయించుకోవాలి. టైమ్‌టేబుల్‌ వేసుకుని కచ్చితంగా పాటించడం అలవాటు చేసుకోవాలి.
* వివిధ కారణాలతో చదవాల్సిన వాటిని మర్నాటికి వాయిదా వేయాలని అనుకోకూడదు. ఒకటిరెండుసార్లు ఇలా చేయడం వల్లే ఇదే అలవాటుగా మారే ప్రమాదం ఉంటుంది.
* కొందరు త్వరగా అందరితో కలిసిపోగలుగుతారు. మరికొందరు అలా చేయలేరు. ఇలాంటివాళ్లు తమ అభిరుచులకు అనుగుణంగా పరిచయాలను పెంచుకోవడానికి ప్రయత్నించొచ్చు. అంటే.. పుస్తకాలు చదివే అలవాటు ఉందనుకోండి.. గ్రంథాలయానికి వెళ్లొచ్చు. క్రీడాసక్తి ఉంటే.. తరగతులు పూర్తయ్యాక గ్రౌండ్‌కు వెళ్తే  అక్కడ సరిగ్గా మీలాంటి అభిరుచి ఉన్నవాళ్లే ఎదురుపడొచ్చు. అలా ఆసక్తులు కలిసినవారితో సులువుగా పరిచయాలు పెరుగుతాయి.
* చుట్టూ ఉండే పరిస్థితులు, స్నేహితుల ప్రభావం విద్యార్థుల మీద ఎక్కువగా ఉంటుంది. అనవసర వ్యాపకాలతో సమయాన్ని వృథాచేసే వారితో స్నేహం చేయడం వల్ల సీరియస్‌గా చదువును కొనసాగించలేరు. అందుకే చదువుకు ప్రాధాన్యమిస్తూ.. దాని ద్వారా జీవితంలో పైకి ఎదగాలనుకునే మనస్తత్వమున్న స్నేహితులను ఎంచుకోవడం ఎంతో అవసరం.
* తరగతిలో కూర్చుని పాఠాలు వినడం.. ఇంటికి వచ్చిన తర్వాత ఒకచోట కూర్చుని చదువుకోవడం. ఇలా కదలకుండా ఒకేచోట కూర్చుని గంటలకొద్దీ సమయాన్ని గడపాల్సి రావచ్చు. దీంతో నడుంనొప్పి, మెడనొప్పి లాంటి అనారోగ్య సమస్యలూ వచ్చే అవకాశముంటుంది. వ్యాయామాలు చేయడం, ఇష్టమైన ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
* ఈ ఏడాది మంచి మార్కులు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారనుకుందాం. దాని కోసం సంవత్సరమంతా ఎంతో కష్టపడతారు కూడా. ఇది దీర్ఘకాలిక లక్ష్యం కిందికి వస్తుంది. అలాగే స్వల్పకాలిక లక్ష్యాలనూ పెట్టుకోవాలి. అంటే వారం రోజుల్లో కొన్ని చాప్టర్లను చదవడం పూర్తిచేయాలి అనుకున్నారనుకోండి.. సరిగ్గా ఆ వ్యవధిలోనే ఆ పని జరిగేలా చూడాలి. ఇలా స్వల్పకాలిక లక్ష్యాలను సాధించడం వల్ల ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. దాంతో దీర్ఘకాలిక లక్ష్యాలవైపు ఉత్సాహంగా అడుగులు వేస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని