విసుగును వదిలి.. హుషారుగా!

ఓపక్క చదవాల్సిన పాఠాలూ, రాయాల్సిన నోట్సులూ, చేయాల్సిన పనులూ ఎన్నో ఉంటాయి. మరోపక్క జోరున కురిసే వర్షంలో కాలేజీకి వెళ్లిరావాలంటేనే విసుగ్గా ఉంటుంది.

Published : 31 Jul 2023 00:22 IST

ఓపక్క చదవాల్సిన పాఠాలూ, రాయాల్సిన నోట్సులూ, చేయాల్సిన పనులూ ఎన్నో ఉంటాయి. మరోపక్క జోరున కురిసే వర్షంలో కాలేజీకి వెళ్లి రావాలంటేనే విసుగ్గా ఉంటుంది. అంతేకాదు బద్ధకం, చిరాకు, ఎక్కువసేపు నిద్రపోవాలనిపించడం.. లాంటి ఇబ్బందులెన్నో ఈ కాలంలో ఎదురవుతుంటాయి. వణికించే చలికాలంలో, నడి వేసవిలోనూ ఇలాంటి అసౌకర్యాలు లేకపోలేదు. వీటన్నిటి మధ్యా చదవడానికి మూడ్‌ రాదు కూడా. ఇలాంటి సమయాల్లో  ఏం చేయాలో చూద్దామా?

వానల జోరు ఎక్కువగా ఉన్నపుడు బాగా మబ్బులు పట్టి సూర్యుడు కనిపించకుండా ఉండటం సహజమే. అయినప్పటికీ వర్షం వెలిశాక ఆరుబయట ప్రకృతి ఒడిలో కాసేపైనా గడపడానికి ప్రయత్నించాలి. చినుకులకు చిరాకుపడి నాలుగ్గోడల మధ్యే ఉండిపోతే.. ఒకలాంటి స్తబ్ధత ఆవరిస్తుంది. దాంతో అలా బద్ధకంగా కూర్చోవాలనిపిస్తుందిగానీ ఏ పనీ చేయాలనిపించదు.

  • ఎక్కువ సమయం ఒంటరిగా గడపకుండా స్నేహితులను కలవడానికి ప్రయత్నించాలి. అలా వీలు కాకపోతే ఫోన్‌లోనైనా పలకరించాలి. అలాగే కుటుంబ సభ్యులతోనూ తరచూ మాట్లాడాలి. దాంతో కాస్త దిగులుంటే తగ్గి.. ఆరోజు చేయాల్సిన పనులను పూర్తిచేయడానికి ఉత్సాహంగా అడుగులు వేస్తారు.
  • మనసుకు నచ్చే పనులు చేయడానికి ప్రయత్నించాలి. మీ మీద మీరు శ్రద్ధపెట్టి మిమ్మల్ని కాస్త పట్టించుకోవాలి కూడా. అందుకోసం గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, ఇష్టమైన పాటలు వినడం, పుస్తకాలు చదవడం, పజిల్స్‌ పూరించడం, ఇండోర్‌ గేమ్స్‌ ఆడటం లాంటివి చేయొచ్చు. ఎలాగూ ఈకాలంలో ఇంట్లో ఉండే సమయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దాన్ని ఇష్టమైన పనులకు కేటాయించుకుంటే ప్రయోజనం ఉంటుంది.
  • మనసుకు నచ్చే పనులు చేయడం వల్ల మూడ్‌ మెరుగవుతుంది. క్రమంగా విసుగు మాయమై దాని స్థానంలో కొత్త ఉత్సాహం వస్తుంది. దాంతో పనులను వాయిదా వేసుకుంటూ వెళ్లకుండా ఎప్పటి పనులను అప్పుడే పూర్తిచేయగలుగుతారు.
  • శారీరకంగా చురుగ్గా ఉంటే.. మానసికంగానూ ప్రశాంతంగా ఉండగలుగుతారు. అందుకోసం వ్యాయామాలు, యోగా, ధ్యానం ఎంతో ఉపయోగపడతాయి. ఇవి చేయడానికి ఆసక్తి లేకపోతే కాసేపు ఇష్టమైన ఆటను ఆడుకోవచ్చు. ఇంట్లోనే స్కిప్పింగ్‌ లేదా డ్యాన్స్‌ చేయొచ్చు. దాంతో శరీరానికి వ్యాయామం అంది రోజంతా చురుగ్గా ఉండగలుగుతారు.
  • మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... మూడ్‌ను మార్చడానికి ఆహారమూ తోడ్పడుతుంది. ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఉదయాన్నే గ్రీన్‌టీ లేదా అల్లం టీ తాగడం, పోషకాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలినీ ఆచరిస్తే.. ఏ కాలంలోనైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని