పరీక్షలు రెండు.. ప్రిపరేషన్‌ ఒకటే!

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష నవంబర్‌ రెండు, మూడు తేదీల్లో జరగనుంది. గ్రూప్‌-3 పరీక్ష ముందుగా అనుకొన్న షెడ్యూల్‌ ప్రకారం జరిగే అవకాశాలు లేవు.

Updated : 21 Aug 2023 03:21 IST

ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో గ్రూప్‌ 2, 3 సన్నద్ధత

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష నవంబర్‌ రెండు, మూడు తేదీల్లో జరగనుంది. గ్రూప్‌-3 పరీక్ష ముందుగా అనుకొన్న షెడ్యూల్‌ ప్రకారం జరిగే అవకాశాలు లేవు. సర్వీస్‌ కమిషన్‌ ఇప్పటివరకు గ్రూప్‌-3 పరీక్ష తేదీల గురించి సమాచారం ఇవ్వలేదు కానీ ఆగస్టు 21 వరకు అభ్యర్థులకు ఎడిట్‌ చేసుకునే అవకాశం ఇచ్చింది. గ్రూప్‌-3.. గ్రూప్‌-2 పరీక్షకు ముందా..తరువాత అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సిలబస్‌ దాదాపు ఒకే రకంగా ఉన్నందున రెండు పరీక్షలకూ ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో చదివి మెరుగైన ఫలితాలు పొందవచ్చు. పరీక్ష వారీగా కాకుండా సిలబస్‌ అంశాలను ఆధారం చేసుకుని గ్రూప్‌ 2 స్థాయిలో చదివితే గ్రూప్‌ 3 పరీక్ష బోనస్‌ లాంటిదే!

గ్రూప్‌ 2 పరీక్ష రాయకుండా గ్రూప్‌ 3 పరీక్ష మాత్రమే సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమకు తీవ్రమైన పోటీ గ్రూప్‌ 1, 2 అభ్యర్థుల నుంచి ఉంటుందని గుర్తించాలి. వారికి మాదిరిగా విస్తృత స్థాయిలో సన్నద్ధత ఉన్నప్పుడే అంతిమ విజయం పొందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పేపర్‌ కఠినంగా వచ్చినప్పుడు కేవలం గ్రూప్‌ 3  ప్రిపేరయ్యే అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోతాయి. అందువల్ల చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే నానుడి మాదిరిగా గ్రూప్‌ 3 అభ్యర్థులు విస్తృతంగా సన్నద్ధమవటం మంచిది. ఇటీవల జరిగిన గ్రూప్‌ 4 పరీక్షా పత్రంలోని ప్రశ్నలపై అవగాహన పెంచుకోవడం ద్వారా తాజా ప్రశ్నల ధోరణిని అర్థం చేసుకోవచ్చు. తద్వారా అందుకు అనుగుణమైన ప్రిపరేషన్‌ని కొనసాగించవచ్చు.

  • ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం కాకుండా గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేసి నిర్వహించటం వల్ల బలమైన పోటీదారుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా గ్రూప్‌ 1 మెయిన్స్‌ నిర్వహణకు సంబంధించి స్పష్టత లేకపోవటం వల్ల కూడా చాలామంది గ్రూప్‌ 1 అభ్యర్థులు గ్రూప్‌ 2 పై కూడా దృష్టి నిలుపుతున్నారు. పర్యవసానంగా తీవ్రమైన పోటీ! ముఖ్యంగా గ్రూప్‌ 1 ప్రిపేరైన అభ్యర్థుల్లో సిలబస్‌ అంశాల్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేసే నిపుణత వస్తుంది. అందువల్ల గ్రూప్‌ 2 ఆబ్జెక్టివ్‌ ఎగ్జామ్‌లో అడిగే అనేక విశ్లేషణాత్మక ప్రశ్నల్లో వారిది పైచేయిగా ఉండే అవకాశం ఉంది. ఈ సూక్ష్మాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రూప్‌-2 లక్ష్యంతో చదువుతున్నవారు కొద్దిగా ప్రిపరేషన్‌ శైలిని మార్చి ప్రతి విషయాన్నీ విశ్లేషణాత్మకంగా చదవడం అవసరం. సమస్య పరిష్కార, అనువర్తన, అసెర్షన్‌- రీజనింగ్‌ మొదలైన కోణాల్లో సిలబస్‌ అంశాలను చదవాల్సి ఉంది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలో అడిగిన ప్రశ్నలను ప్రమాణంగా తీసుకుని గ్రూప్‌ 2 సిలబస్‌పై పట్టు సాధిస్తే మెరుగైన ఫలితాలుంటాయి.
  • గ్రూప్‌ 1 పరీక్షపై స్పష్టత లేకపోవటంతో చాలామంది గ్రూప్‌ 1 అభ్యర్థులు గ్రూప్‌ 2 పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌ 1 అభ్యర్థులు గ్రూప్‌ 2 సిలబస్‌ లోని ప్రతి సూక్ష్మ అంశాన్నీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల రూపంలో సూక్ష్మ స్థాయిలో కూడా ఆలోచించేలా ప్రిపరేషన్‌ ఉండాలి. గ్రూప్‌ 1 లో పాటించే ఛాయిస్‌ ధోరణి ఇక్కడ సముచితం కాదు. అదేవిధంగా గ్రూప్‌ 2 లో ఫ్యాక్చువల్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున గణాంక సమాచారంపై లోతైన దృష్టి పెట్టాలి.

ఇతర అంశాలు

  • జనరల్‌ స్టడీస్‌ పేపర్లో ఉన్న వర్తమాన అంశాలు, భారతదేశ విదేశీ సంబంధాలు, అంతర్జాతీయ సంఘటనలు అనే సిలబస్‌ అంశాలను ఒక సంవత్సర కాల ప్రాతిపదికగా ప్రిపేర్‌ అవ్వటం మంచిది. 2022 అక్టోబర్‌ నుంచి జరిగిన వివిధ వర్తమానాంశాలను అధ్యయనం చేయాలి. అయితే ఫోకస్‌ 2023 ఫిబ్రవరి తర్వాత జరిగిన సంఘటనలపై ఉంచాలి. ఫాక్చువల్‌ సమాచారంతోపాటు వివరణాత్మక అధ్యయనం చేసినప్పుడే ముఖ్యంగా జతపరిచే ప్రశ్నలు, ఎసెర్షన్‌- రీజనింగ్‌ ప్రశ్నలను ఈ విభాగంలో ఎదుర్కోవచ్చు.
  • రెండు పరీక్షల్లోనూ బేసిక్‌ ఇంగ్లిష్‌ సిలబస్‌ అంశంగా ఉన్నందున ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థులు దీనిపై గట్టిపట్టు సాధించాలి. 10- 15 ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం పాఠశాల స్థాయి ఇంగ్లిష్‌ భాష పుస్తకాలను ఆధారం చేసుకోవచ్చు. తప్పనిసరిగా ప్రతిరోజూ గంట సమయం అయినా ఇంగ్లిష్‌పై దృష్టి పెడితే మంచిది.
  • తెలంగాణ సంస్కృతి- చరిత్ర, భౌగోళికత, ఆర్థిక, సామాజిక అంశాలపై గట్టి అవగాహన పెంచుకుంటే పేపర్స్‌తో నిమిత్తం లేకుండా ప్రశ్నలు ఎక్కడ అడిగినా సమర్థంగా సమాధానాలు గుర్తించవచ్చు. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షలో దాదాపు 45 ప్రశ్నలు ఈ అంశాల నుంచే వచ్చాయి. అదే ధోరణి కొనసాగే అవకాశం రాబోయే గ్రూప్‌ 2, 3ల్లో కూడా కనిపిస్తోంది. అందుకని ప్రాంతీయ విషయాలపై పట్టు సాధించేందుకు లభిస్తున్న సమయాన్ని వెచ్చించాలి.
  • తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2022-23, బడ్జెట్‌ 2023-24, పాలనా విధానాలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై పట్టు సాధించడం ద్వారా తెలంగాణ ఎకానమీపై అడిగే ప్రశ్నలను సులభంగా ఎదుర్కోవచ్చు. ఈ భాగంలో కూడా ఫాక్చువల్‌ సమాచారంతోపాటు వివరణాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ. అందువల్ల ప్రతి ఆర్థిక అంశాన్నీ విశ్లేషణాత్మక, సమస్య పరిష్కార పద్ధతిలో అధ్యయనం చేయాలి.
  • ఆర్థిక అభివృద్ధి- సవాళ్లు అనే సిలబస్‌లో ప్రశ్నలు ఫాక్చువల్‌గా కంటే విశ్లేషణాత్మకంగా వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటి ప్రశ్నలు ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. ఈ విభాగానికి సంబంధించిన సిలబస్‌ అంశాలను వ్యాస, వివరణాత్మక రూపాల్లో ఉండే పాఠాలుగా చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ తరువాత బిట్స్‌గా అన్వయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నేరుగా బిట్లుగా చదివితే పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ విభాగంలోనూ గ్రూప్‌ 1కు ప్రిపేరైన అభ్యర్థుల ఆధిపత్యం ఉండే అవకాశం ఉంది. అందువల్ల గ్రూప్‌ 2కు సిద్ధమవుతున్నవారు ఆ స్థాయికి ప్రిపరేషన్‌ని పెంచుకోవాలి.
  • సొసైటీ అనే సిలబస్‌ అంశంలో ఆంత్రొపాలజీ, సోషియాలజీల్లో ఉండే సైద్ధాంతిక అంశాలతో పనిలేదు. 2017 గ్రూప్‌ 2లో అడిగిన ప్రశ్నల్ని ప్రామాణికంగా తీసుకుని సొసైటీ ప్రిపరేషన్‌ని సౌలభ్యంగా మార్చుకోండి. ముఖ్యంగా సొసైటీలోని వివిధ సిలబస్‌ అంశాల్లో పరిపాలన కోణంలో ప్రశ్నలు అడిగే అవకాశం చాలా ఎక్కువ. సొసైటీలోని కొన్ని అంశాలు పాలిటీ, ఎకానమీ, గవర్నెన్స్‌లోని కొన్ని అంశాలతో అనుసంధానమై ఉంటాయి. అలాంటివాటిని కూడా గుర్తించి అనుసంధాన కోణంలో చదవాలి. తెలంగాణ అని ప్రత్యేకంగా ప్రస్తావించిన పాఠ్యాంశాలు తప్ప మిగతా సొసైటీ సిలబస్‌ అంశాలు భారతదేశ నేపథ్యంలో చదవటమే మేలు.
  • తెలంగాణ ఉద్యమ చరిత్రకు గ్రూప్‌ 3 లో తక్కువ ప్రాధాన్యం ఉంది. గ్రూప్‌ 2లో 150 మార్కుల ప్రాధాన్యం ఉంది. అందువల్ల గ్రూప్‌ 3 అభ్యర్థులు సైతం గ్రూప్‌ 2లో ఇచ్చిన తెలంగాణ ఉద్యమ చరిత్ర అంశాలను యథాతథంగా ప్రిపేర్‌ అయితే విస్తృత స్థాయిలో కవరేజి ఉన్నందున ఎలాంటి ప్రశ్నలు వచ్చినా ఆన్సర్‌ చేసే అవకాశం ఉంటుంది.
  • చాలామంది ఆబ్జెక్టివ్‌ పరీక్ష కాబట్టి బిట్లుగా చదువుతూ ఉంటారు. మారిన ప్రశ్నల ధోరణిలో ఈ విధానం సరైంది కాదు. ముఖ్యంగా ఎసెర్షన్‌- రీజనింగ్‌ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కోవాలంటే కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌గా అధ్యయనం చేయాలి.
  • చాప్టర్‌ వారీగా వివరణాత్మక అధ్యయనం పూర్తి చేసి, ఆ తర్వాతనే బిట్లు బాగా సాధన చేస్తే ఈ రెండు పోటీ పరీక్షల్లోనూ రాణించే అవకాశం ఉంటుంది.

కొడాలి భవానీ శంకర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని