చేరిన కోర్సులో ఇమడలేకపోతే?

ఎంబీబీఎస్‌ కొందరు విద్యార్థుల లక్ష్యం. ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదవటమో, రక్షణ దళాల్లో చేరటమో ఇంకొందరి ఆశయం. అయితే    సంబంధిత పోటీ పరీక్షల్లో కొందరే నెగ్గి సీట్లు తెచ్చుకోగలుగుతారు.

Published : 31 Aug 2023 00:57 IST

ఎంబీబీఎస్‌ కొందరు విద్యార్థుల లక్ష్యం. ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదవటమో, రక్షణ దళాల్లో చేరటమో ఇంకొందరి ఆశయం. అయితే    సంబంధిత పోటీ పరీక్షల్లో కొందరే నెగ్గి సీట్లు తెచ్చుకోగలుగుతారు. మిగిలిన వారిలో కొంతమంది అనుకున్నది సాధించలేక.. ప్రత్యామ్నాయమూ సిద్ధంగా లేక ఇబ్బందిపడుతుంటారు.

క లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు గట్టిగా ప్రయత్నించడం వరకూ బాగానే ఉంటుంది. కానీ దాన్ని సాధించలేకపోయినప్పుడు మాత్రం కొందరు విపరీతమైన నిరాశానిస్పృహలకు లోనవుతుంటారు. ఇక ఏమీ సాధించలేమనే నిర్ణయానికి వచ్చేస్తుంటారు. అలాకాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాలి.  

అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగాలని ఆశపడటంలో తప్పులేదు. కానీ కొన్నిసార్లు అనుకోని అవాంతరాలూ, అనారోగ్య సమస్యలూ ఎదురవుతుంటాయి. దాంతో వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి. అలాంటప్పుడు తట్టుకుని ధైర్యంగా నిలబడగలగాలంటే మీ దగ్గర ప్లాన్‌-ఎతో పాటు ప్లాన్‌-బి కూడా పెట్టుకోవాలి.

ఆలస్యంగా తెలిసొస్తే...?

ఒక్కోసారి ఏమవుతుందంటే.. ముందుగా అనుకున్నట్టుగానే కోరుకున్న కోర్సులోనే చేరతారు. కానీ కొన్ని రోజులకే మీ ఎంపిక సరైంది కాదని తెలిసిపోతుంది.    

నిపుణులైన అధ్యాపకులు లేకపోవడం లేదా మీరు ఎంచుకున్న కోర్సుకు భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు లేకపోవచ్చని ఆలస్యంగా తెలిసిరావడం.. ఇలా రకరకాల కారణాలతో మీ నిర్ణయం సరైందికాదని తెలుస్తుంది. స్నేహితుల/ కుటుంబసభ్యుల ఒత్తిడికి గురై కోర్సును ఎంచుకుని నచ్చక మధ్యలో మానేసేవాళ్లూ ఉంటారు. లేదా డిగ్రీలో చేరి ఎలాగోలా కొనసాగించాలని ఆలోచించేవాళ్లూ ఉంటారు. పదో తరగతి, ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులకు సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇతరుల ప్రభావానికి లోనై నిర్ణయాలు తీసుకుంటే.. కోర్సు మొదలైన కొన్ని రోజులకే నిర్ణయం సరికాదనే విషయం తెలిసిపోతుంది.  

అలాంటప్పుడు ఇలా చేయొచ్చు...

  • అదే కోర్సులో కొనసాగుతూ డిగ్రీ పూర్తిచేయడానికే ప్రయత్నించాలి. ఈ అర్హతతో ప్రభుత్వ పోటీ పరీక్షలకూ సిద్ధంకావచ్చు. లేదా ఏదైనా ఉద్యోగంలోనూ చేరొచ్చు. ఈ అర్హతే పునాదిగా ఉన్నత విద్యకూ వెళ్లొచ్చు. ఈసారి నిర్ణయ లోపం లేకుండా మీకిష్టమైన సబ్జెక్టులనే ఎంచుకుని పీజీ పూర్తిచేయొచ్చు.
  • ఒకపక్క చదువును కొనసాగిస్తూనే ప్రవేశ పరీక్ష రాయడానికి శిక్షణ తీసుకోవచ్చు. మంచి మార్కులు వస్తే కోరుకున్న కాలేజీలో, కోర్సులో చేరిపోవచ్చు. ఈసారి కూడా తక్కువ మార్కులే వస్తే ప్రవేశ పరీక్షను పక్కన పెట్టి.. సాధారణ డిగ్రీ పూర్తిచేయొచ్చు.

అవసరమైతే విరామం

మరో అవకాశమూ ఉంది. సంవత్సరంపాటు విరామం తీసుకుని.. ఇష్టమైన రంగంలో పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ వ్యవధిలో ఇంటర్న్‌షిప్‌లూ చేయొచ్చు. లేదా ఆసక్తిని బట్టి ఆన్‌లైన్‌ కోర్సులూ చదవొచ్చు. తర్వాతి ఏడాది మీకిష్టమైన కోర్సులో చేరడానికి ఇవి ఉపయోగపడొచ్చు. అయితే ఈ ఏడాది సమయాన్ని ఏ మాత్రం వృథా చేయకూడదు. కోరుకున్న కాలేజీ, కోర్సులో సీటు సాధించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సంపాదించడానికే వినియోగించాలి. కావాలనే విరామం తీసుకున్నారు కాబట్టి.. చాలా సమయం అందుబాటులో ఉంటుంది. దాన్ని స్మార్ట్‌ ఫోన్లతో గడపడానికీ, స్నేహితులతో షికార్లకూ దుర్వినియోగం చేయకూడదు.

మీ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు.. ప్రస్తుతం మీరు ఎంచుకున్న కోర్సు పునాది కావాలి. నిర్ణయం తీసుకునే ముందు.. గతంలో సంపాదించిన మార్కులు, ఆసక్తిని మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు. కోర్సుకు ఉండే ఉద్యోగావకాశాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఇతర నైపుణ్యాల అభివృద్ధికి ఈ కోర్సు ఎలా ఉపయోగపడగలదో తెలుసుకోవాలి.

నిర్ణయాలను సరిదిద్దుకోవచ్చు

జాగ్రత్తగా ఆలోచించి.. అడుగులు వేస్తే పొరపాటు నిర్ణయాలను కూడా సరిదిద్దుకోవచ్చు. ప్రస్తుతం టెక్నాలజీ, హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌ మొదలైన రంగాల్లో విభిన్నమైన కాంబినేషన్లలో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. మీ ఆసక్తి, శక్తిసామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని తగిన కోర్సును ఎంచుకోవాలి. ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. పొరపాటు నిర్ణయం అనేది ఎప్పుడూ మీ కలలను అంతం చేయకూడదు. మీరు కుంగుబాటుకు గురయ్యేలానూ చేయకూడదు. మొదట్లో పొరపాటు జరిగినా.. ప్రత్యామ్నాల మార్గాల గురించి ఆలోచించి దాన్ని సరిదిద్దుకునేలా నిర్ణయం తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని