Software Courses: ఈ కోర్సులపైనా.. ఓ కన్నేయండి!
టెక్నాలజీ ఎంత కొత్తగా మారుతున్నా టాప్‌లో మాత్రం కొన్నే ఉంటాయి. వాటిలో వచ్చే మార్పులను అందిపుచ్చుకోవడంలోనే మన కెరియర్ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.
టెక్నాలజీ ఎంత కొత్తగా మారుతున్నా టాప్‌లో మాత్రం కొన్నే ఉంటాయి. వాటిలో వచ్చే మార్పులను అందిపుచ్చుకోవడంలోనే మన కెరియర్ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఐటీలో రాణించాలనుకునే విద్యార్థులు నిత్యనూతనంగా అభివృద్ధి చెందుతున్న ఇటువంటి టెక్ కోర్సులను పరిశీలించవచ్చు. మేటి అవకాశాల కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు. అవేంటో ఒకసారి చూస్తే..
మనం జీవిస్తున్న సమాచార యుగం (డిజిటల్ ఏజ్)లో రోజూ ఓ కొత్త మార్పు అత్యంత సహజం. నూతనంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను నేర్చుకోవడం ద్వారా ఉద్యోగాల్లో వేగంగా ఉన్నతిని అందుకునే అవకాశం లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్, 5జీ, డేటా సైన్స్.. ఇవన్నీ విద్యార్థులకు కొత్త మార్గాలు అందించేవే. వీటికితోడుగా ఈ కింది కోర్సులనూ వారు పరిశీలించవచ్చు.
ఆటోమెటేషన్
టెక్నాలజీ, ప్రోగ్రామ్స్, రోబోటిక్స్‌ను నిర్దేశించిన లక్ష్యసాధన కోసం వినియోగిస్తూ వీలైనంత తక్కువగా మనుషుల ప్రమేయం ఉండేలా ప్రయత్నించడాన్ని ఆటోమెటేషన్ అంటున్నారు. ఇందులో బేసిక్, ప్రాసెస్, ఇంటెలిజెంట్ అనే స్థాయీభేదాలు ఉన్నాయి. ‘బేసిక్’లో సులభమైన, మళ్లీ మళ్లీ చేసే లాంటి చిన్న పనులను ఆటోమేట్ చేస్తారు. ‘ప్రాసెస్’లో కాస్త క్లిష్టమైన ప్రక్రియలు అంచెలవారీగా ఉంటాయి. ‘ప్రాసెస్ మైనింగ్, వర్క్‌ఫ్లో ఆటోమెటేషన్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్’ వంటివి ప్రాసెస్ ఆటోమెటేషన్‌కు చక్కటి ఉదాహరణలు. అన్నింటికంటే ఉన్నతశ్రేణి ఆటోమెటేషన్ ‘ఇంటెలిజెంట్’. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి అంశాల సాయంతో పనిచేస్తుంది.
- భవిష్యత్తులో ఆటోమెటేషన్‌కు ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దీని వల్ల పాత ఉద్యోగాల తీరు మారిపోవడంతోపాటు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆటోమెటేషన్ ప్రక్రియలను అభివృద్ధి చేసి, నిర్వహించి, సమస్యలను పరిష్కరించేందుకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం అవుతారు. అందువల్ల ఇక్కడ ఎన్నో అవకాశాలు లభించే వీలుంది.
ఎడ్జ్ కంప్యూటింగ్
డేటా ఉత్పన్నమైనచోటికి అత్యంత సమీపంగా దాన్ని ప్రాసెస్ చేసేందుకు అవకాశం కల్పించే ప్రక్రియ ఇది. క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించేందుకు ఇదొక ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారింది. వినియోగదారుడికి చేరువలో ఉన్న నెట్‌వర్క్స్, డివైజ్‌లతో కలిసి పనిచేస్తుంది. సంప్రదాయ కంప్యూటింగ్ పద్ధతులతో పోలిస్తే ఇది అదనపు ప్రయోజనాలు చేకూర్చగలదు. సొంతంగా నడిచే కార్లు, రోబోట్లు, స్మార్ట్ పరికరాలు వంటి చోట్ల దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు. ‘ఎడ్జ్ డివైజెస్, నెట్‌వర్క్ ఎడ్జ్, ఆన్ ప్రిమైసిస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అనే కాంపొనెంట్స్‌తో ఇది పనిచేస్తుంది.
- దీని ద్వారా ఎడ్జ్ నెట్‌వర్క్ ఇంజినీర్, ఆర్కిటెక్ట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ స్పెషలిస్ట్.. వంటి అనేక కెరియర్లలోకి వెళ్లవచ్చు.
క్వాంటమ్ కంప్యూటింగ్
సంప్రదాయ కంప్యూటింగ్‌తో పోలిస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ విభిన్నమైనది. ఇది క్వాంటమ్ థియరీలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించడంతోపాటు క్వాంటమ్ మోడళ్లను రన్ చేస్తుంది. దీని గురించి నేర్చుకునేందుకు క్యూబిట్స్, సూపర్ పొజిషన్, ఎన్‌టాంగిల్‌మెంట్, క్వాంటమ్ ఇంటర్‌ఫియరెన్స్ వంటివన్నీ తెలుసుకోవాలి. ఇది సోర్స్ ఏదైనా కానీ సమాచారాన్ని త్వరగా క్వెరీ, మానిటర్, అనలైజ్ చేసేందుకు వీలు కలిగిస్తుంది. బ్యాంకింగ్-ఆర్థిక రంగంలో దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు.
- సాధారణ కంప్యూటర్లు డేటాను బైనరీ బిట్స్‌లా మార్చుకుంటాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు దీన్ని క్యూబిట్స్‌గా మార్చుకుని ప్రాసెస్ చేస్తాయి. ఇందులో అభ్యర్థులు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, క్రయోజనిక్ ఇంజినీర్లుగానూ.. కంట్రోల్, ఎర్రర్ కనెక్షన్, అల్గారిథమ్ రిసెర్చర్లుగానూ రాణించే అవకాశం ఉంటుంది.
ఐవోటీ
టెక్ వస్తువులకు సంబంధించిన నెట్‌వర్క్‌ను, ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేసే సామర్థ్యాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటున్నారు. సెన్సార్లు, సాఫ్ట్‌వేర్లు, ఇతర టెక్నాలజీలతో కలిసి పనిచేయడం, డేటాను వివిధ సిస్టమ్స్‌తో అనుసంధానం చేయడం ఇందులో భాగం. సాధారణంగా ఇంట్లో వాడే వస్తువుల నుంచి.. పరిశ్రమల్లో ఉపయోగించే పెద్దపెద్ద యంత్రాల వరకూ దీని అవసరం ఉంటుంది. గత రెండు దశాబ్దాలుగా ఐవోటీ మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన టెక్నాలజీగా ఎదుగుతూ వస్తోంది.
- దీనితో డేటా అనలిటిక్స్, నెట్‌వర్క్ - నెట్‌వర్కింగ్ స్ట్రక్చర్, సెక్యూరిటీ, హార్డ్‌వేర్ అండ్ డివైజెస్, యూజర్ ఇంటర్‌ఫేస్, సెన్సర్స్ - యాక్యురేటర్ ప్రొఫెషనల్, ఎంబెడెడ్ ప్రోగ్రామ్స్ ఇంజినీర్ వంటి పలు విధాలుగా కెరియర్ ఎంచుకునే వీలుంది.
ఎలా?: ఐటీలో ఏం నేర్చుకోవాలన్నా ఉత్తమ ఆఫ్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఐటీ సంస్థలతోపాటు వివిధ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ వీటిని విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచుతున్నాయి. యుడెమీ, సింప్లీలెర్న్, కోర్సెరా, స్కిల్‌షేర్.. ఇలా ఎక్కడైనా నచ్చిన కోర్సును ఎంచుకుని చేరవచ్చు.
ఆగ్‌మెంటెడ్ -వర్చువల్ రియాలిటీ
వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఈఆర్).. సరికొత్త టెక్ ట్రెండ్స్‌గా చెప్పవచ్చు. ఏఆర్ వర్చువల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తే.. వీఆర్ అందులో యూజర్‌ను మరింత మమేకం చేస్తుంది. డిజిటల్ సమాచారానికి యూజర్ ఎన్విరాన్‌మెంట్‌ను రియల్‌టైమ్‌లో ఇంటిగ్రేట్ చేస్తూ ఇవి పనిచేస్తాయి. సహజ వాతావరణాన్ని విజువల్‌గా చూపిస్తాయి. ఇందులో 3డీ కాంపొనెంట్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి.
విద్యా, ఉద్యోగ, వినోద తదితర అనేక రంగాల్లో దీంతో చాలా ఉపయోగాలున్నాయి. ఈ టెక్నాలజీని ఆరోగ్యం, రక్షణ, గ్యాస్ అండ్ ఆయిల్, పర్యటకం, మార్కెటింగ్ వంటి అనేక చోట్ల వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, గ్లాసెస్ వంటి అనేక రూపాల్లో ఈ టెక్నాలజీ లభిస్తోంది. గేమింగ్, నేవిగేషన్, టూల్స్ అండ్ మెజర్‌మెంట్, ఆర్కిటెక్చర్, మిలిటరీ, ఆర్కియాలజీ వంటి అంశాల్లోనూ దీన్ని అధికంగా వినియోగిస్తున్నారు. మెటా, ఆపిల్, గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఏఆర్/వీఆర్ కింద ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఇది ఆసక్తి కలిగిన విద్యార్థులు కచ్చితంగా దృష్టి సారించాల్సిన రంగం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nagarjuna sagar: సాగర్ డ్యామ్ వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు.. మరోసారి ఉద్రిక్తత
-
Ola: ఇక ఓలా యాప్‌లోనూ యూపీఐ చెల్లింపులు
-
MS Dhoni: ఆ విషయంలో ధోనీ అందరి అంచనాలను తల్లకిందులు చేశాడు: డివిలియర్స్
-
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో బోట్ గేమింగ్ ఇయర్‌బడ్స్
-
పన్నూ హత్యకుట్ర కేసులో యూఎస్ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన భారత్
-
DAC: సైన్యానికి బిగ్ బూస్ట్..! 97 ‘తేజస్’ యుద్ధవిమానాల కొనుగోలుకు పచ్చజెండా