మీకు మీరే నచ్చడం లేదా?

రమ్య ఎంత బాగా చదువుతుందో.. ప్రతి సబ్జెక్టులోనూ తనకే ఫస్ట్‌ వస్తుంది. పృధ్వీ క్రికెట్‌ భలే ఆడతాడు.. ఈమధ్య జాతీయస్థాయి పోటీలకు కూడా ఎంపికయ్యాడు

Published : 28 Sep 2023 00:23 IST

రమ్య ఎంత బాగా చదువుతుందో.. ప్రతి సబ్జెక్టులోనూ తనకే ఫస్ట్‌ వస్తుంది. పృధ్వీ క్రికెట్‌ భలే ఆడతాడు.. ఈమధ్య జాతీయస్థాయి పోటీలకు కూడా ఎంపికయ్యాడు. అనిత బాపూ బొమ్మలా ఎంత బాగుంటుందో చెప్పలేం ... ఇలా ఎంతసేపూ ఎదుటివారిలోని సుగుణాలే మీకు కనిపిస్తుంటాయి. వాళ్లే మీకు బాగా నచ్చుతారు. కానీ మీలో మీకు మాత్రం.. మంచి కంటే చెడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాంతో మీకు మీరే నచ్చరు.

దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. ఇతరుల్లా అందంగా, ఆకర్షణీయంగా లేరనీ, బాగా చదవలేకపోతున్నారనీ, లక్ష్యాలను సాధించలేకపోయారనీ.. ఇలా అనేక రకాల కారణాలతో మిమ్మల్ని మీరు యథాతథంగా అంగీకరించలేరు. ఈ ‘సెల్ఫ్‌ యాక్సెప్టెన్సీ’ లేకపోవడం వల్ల అనేక అనర్థాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆత్మన్యూనతకూ గురవుతుంటారు. ఆత్మవిశ్వాసం లేకపోవడంతో అనుకున్నది సాధించనూ లేరు.

  •  మిమ్మల్ని మీరు అంగీకరించలేకపోవడానికి పొరపాట్లూ ఒక కారణమే. ఉదాహరణకు బాగా చదివి మంచి మార్కులు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారనుకుందాం. కానీ మీరు చేసిన కొన్ని తప్పుల వల్ల దాన్ని సాధించలేకపోయారు. దీంతో మీరు ఎందుకూ పనికిరారని దిగులుపడిపోతుంటారు. కావాలని ఎవరూ వీటిని చేయాలనుకోరు. మీరూ అంతే. కొన్ని కారణాల వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. అంతమాత్రాన మిమ్మిల్ని మీరు నిందించుకోవడం సరి కాదు.
  •  మంచి ర్యాంకు సాధించి.. దేశంలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాలనుకున్నారు. కానీ ఒక సబ్జెక్టులో పాస్‌మార్కులు కూడా రాలేదు. దాంతో ఇక ప్రతి విషయంలోనూ ఫలితాలు ఇలాగే ఉంటాయనుకుంటారు. వాస్తవానికి ప్రతికూల ఫలితమనేది ముందడుగు వేయడానికి అవరోధంగానూ మారుతుంది. ఆత్మస్థైర్యాన్నీ దెబ్బతీస్తుంది. దాంతో అప్పటినుంచీ మిమ్మల్ని మీరు పరాజితగా చూడటం మొదలుపెడతారు.
  • మీకెంతో ఇష్టమైన క్రీడలో రాణించాలనుకుంటారు. పట్టుదలగా కృషి చేసి పోటీకి వెళతారు. కానీ ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరణకు గురవుతారు. దాంతో అప్పటివరకూ ఆ క్రీడ మీద ఉండే ఇష్టాన్ని కాస్తా అయిష్టంగా మార్చేసుకుంటారు. మీకిక దాంట్లో భవిష్యత్తే ఉండదనే అభిప్రాయానికి వచ్చేస్తారు. లేదా ఇంటర్వ్యూలో మీరు ఎంపిక కాకుండా.. మీ స్నేహితులు సెలక్ట్‌ కావొచ్చు. అప్పుడూ మీకు మీరు నచ్చరు. మిమ్మల్ని మీరు నిందించుకోవడం మొదలుపెట్టేస్తారు.
  •  మిమ్మల్ని మీరు యథాతథంగా అంగీకరించలేకపోవడానికి ఒక్కోసారి విమర్శలూ కారణం కావొచ్చు. అయితే వాటికి మీరెలా స్పందిస్తారనేదే ముఖ్యం. మీరు తిరిగి అదేపని చేస్తారా, మౌనంగా ఉండిపోతారా అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశంతోనే కొందరు పనిగట్టుకుని మరీ విమర్శిస్తుంటారు. వాటిని పదేపదే తలచుకుని బాధపడటం వల్ల వారి ఉద్దేశం నెరవేరినట్టు అవుతుంది. ఇలాకాకుండా అది ఎంతవరకూ సరైందో తెలుసుకుని.. అందుకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించొచ్చు. ఇక్కడో విషయాన్ని గమనించాలి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ ఎవరూ విమర్శలకు అతీతులు కారు. ఇంకా చెప్పాలంటే.. ప్రముఖులకు వీటి తాకిడి మరింత ఎక్కువ కూడా. అయితే వీటిని పట్టించుకునే తీరిక వాళ్లకు ఉండదు. ఇక మనలాంటి సామాన్యుల విషయానికి వస్తే.. వాటికి మనమెలా స్పందిస్తామనేది మన విజ్ఞత మీదే ఆధారపడి ఉంటుంది.  ‘తరిమే వాళ్లని హితులుగ తలచి ముందు కెళ్లాలని’ సానుకూలంగా స్పందించారనుకోండి.. మిమ్మల్ని మీరేకాదు.. అందరూ అంగీకరిస్తారు. పొరపాట్లూ, వైఫల్యాలూ, విమర్శలూ, తిరస్కరణకు గురికావడం.. ఇవేమీ మిమ్మల్ని మీరు నిందించుకునేలా చేయకూడదు. మీ ఆలోచనా ధోరణినీ, గమనాన్నీ మార్చకూడదని గుర్తుంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని