కొలువుకు తొలి అస్త్రం!

తొలిచూపులోనే మీ కీలక సమాచారాన్ని నియామక సంస్థలకు తెలిసేలా చేస్తుంది ఉద్యోగ దరఖాస్తు. మీ గురించి సత్వర అంచనాకు వచ్చేలా చేసి, ఇంటర్వ్యూకు మార్గం సుగమం చేస్తుంది.

Updated : 28 Sep 2023 06:57 IST

కరిక్యులమ్‌ వీటే (సీవీ) అంటే లాటిన్‌లో ‘కోర్స్‌ ఆఫ్‌ లైఫ్‌’ (జీవిత గమనం) అని అర్థం. రెజ్యూమెకు ఫ్రెంచి సమానార్థకం ‘సమ్మరీ’ (సారాంశం). నిర్దిష్ట ఉద్యోగానికి/ నియామక సంస్థకు దరఖాస్తు చేయటానికి ఉద్దేశించినవే ఈ రెండూ!  మేటి అర్హతలున్న అభ్యర్థులుగా మనల్ని చూపటానికీ, మౌఖిక పరీక్షకు ఆహ్వానం అందేలా చేయటానికీ సీవీ/ రెజ్యూమె ఉపయోగపడుతుంది. ఈ అస్త్రాన్ని ఎలా రూపొందించి, సంధించాలో తెలుసుకుందాం!

తొలిచూపులోనే మీ కీలక సమాచారాన్ని నియామక సంస్థలకు తెలిసేలా చేస్తుంది ఉద్యోగ దరఖాస్తు. మీ గురించి సత్వర అంచనాకు వచ్చేలా చేసి, ఇంటర్వ్యూకు మార్గం సుగమం చేస్తుంది.  

  •  రెజ్యూమె ప్రధానంగా అభ్యర్థి నైపుణ్యాలను ప్రతిఫలిస్తుంది. నిడివి సాధారణంగా రెండు, మూడు పేజీలు మించదు. పరిశ్రమ, ప్రభుత్వ రంగాల కొలువుల్లో చేరటానికి  ఇది సాధనం.
  •  సీవీ ముఖ్యంగా విద్యాపరమైన విజయాలకు అద్దం పడుతుంది. అకడమిక్‌ హోదాలూ, ఫెలోషిప్‌లూ, గ్రాంట్లకు దరఖాస్తు చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అనుభవం, పబ్లికేషన్లు, ప్రెజెంటేషన్లను బట్టి దీని నిడివి ఎన్ని పేజీలన్నది ఆధారపడి ఉంటుంది.

మొక్కుబడి వ్యవహారం తగదు

కొంతమంది మొక్కుబడిగా సీవీని తయారుచేస్తారు. ఒకసారి రాసి కొన్ని జిరాక్స్‌ కాపీలు తీసుకుని.. ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా దాన్నే పంపేస్తుంటారు. సీవీ రాయడాన్ని ఓ బలవంతపు వ్యవహారంలా భావించడమే అందుకు కారణం కావొచ్చు. ఉద్యోగం చేయడానికి మీరెంతో ఆసక్తితో ఉన్నారనే విషయం ఎదుటివారికి తెలియాలంటే ఇలాంటివి చేయకూడదు. నిజానికి నియామక సంస్థలకు సంబంధించిన అధికారులు ఏడు సెకన్లపాటు మాత్రమే సీవీని చదువుతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి అంత తక్కువ వ్యవధిలోనే చదివినవారికి మీపై సదభిప్రాయం కలిగేలా సీవీని రూపొందించాలి.

సుదీర్ఘంగా ఉండకూడదు

సీవీని ఎంత పెద్దగా తయారుచేస్తే అంత మంచిదని కొందరు పొరబడుతుంటారు. దాంతో పేజీలను అనవసర సమాచారంతో నింపేస్తుంటారు. ప్రతి చిన్న అనుభవాన్నీ, ఆలోచననూ దాంట్లోనే జోడించాలని ఆరాటపడుతుంటారు. ఇది ఎంతమాత్రం సరికాదు. సీవీ ఎప్పుడూ రెండు, మూడు పేజీలకు మించకుండా జాగ్రత్తపడాలి. అతి ముఖ్యమైన విషయాలను ఆకట్టుకునేలా రాస్తే సరిపోతుంది. కుడిపక్క మార్జిన్‌ లాంటి స్థలంలో ఈమెయిల్‌ ఐడీ, కాంటాక్ట్‌ నంబర్‌, అడ్రస్‌, విద్యార్హతలు, నైపుణ్యాలు, మధ్యన ఉండే ఖాళీ స్థలంలో ఉద్యోగానుభవాలను రాస్తే.. చూడ్డానికీ, చదవడానికీ సౌకర్యంగా ఉంటుంది. లేదా ఎడమపక్క మార్జిన్‌ స్థలంలో వ్యక్తిగత వివరాలను రాసి పేపర్‌ మధ్యలో ఉద్యోగానుభవాలను రాసినా ఫర్వాలేదు. రెండు పద్ధతుల్లో దేన్ని ఎంచుకున్నా చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దడమే మీ ధ్యేయం కావాలి.

గజిబిజిగా వద్దు

కొంతమంది సీవీ మిగతావారి కంటే భిన్నంగా, వినూత్నంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం రకరకాల డిజైన్లు, ఫాంట్లను ప్రయత్నిస్తారు. నిజానికి డిజైన్లూ, రంగులూ ఎక్కువైనా, ఫాంట్లు గజిబిజిగా ఉన్నా చదివేవారికి ఇబ్బందే. అందుకే చదవడానికి వీలుగా, కళ్లకు హాయిగా ఉండే ఏరియల్‌, కాలిబ్రి లాంటి ఫాంట్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. మీకూ, ఉద్యోగం ఇవ్వబోయే సంస్థకూ మధ్య వారధిలా ఉండే వ్యక్తి.. చదవడానికి ఏమాత్రం ఇబ్బందిపడకుండా సీవీని రూపొందించాల్సిన బాధ్యత మీదే. వినూత్నంగా తయారుచేయడం కంటే విషయాలను ఆకట్టుకునేలా చెప్పడమే ముఖ్యం.

ఏది ముందు

ఉద్యోగానుభవాలు అన్నింటినీ ఒకే పేరాలో చెప్పేయాలని తాపత్రయపడకూడదు. ఇలాచేయడం వల్ల చదివేవారికి కాస్త గందరగోళంగా ఉండొచ్చు. ఉదాహరణకు చదువు పూర్తయిన వెంటనే మీరొక సంస్థలో ఉద్యోగంలో చేరారు. శిక్షణకాలం పూర్తికాగానే మరో పెద్ద సంస్థలోకి మారారు. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత ఆకర్షణీయమైన వేతనం కోసం మరో సంస్థలోకి వెళ్లారు. ఆ తర్వాత.. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని మరో సంస్థలోకి మారారు. మూడుచోట్లా వేర్వేరు ఉద్యోగాలు చేశారు. వాటన్నింటినీ ఒకే పేరాలో చెప్పాలని ప్రయత్నిస్తే అంతా గందరగోళంగా తయారవుతుంది. అలాకాకుండా ప్రస్తుతం మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎలాంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారో ముందుగా చెప్పాలి. ఆ తర్వాత సంవత్సరాలవారీగా.. ఎప్పుడు, ఎక్కడ పనిచేసిందీ, ఏయే బాధ్యతలను నిర్వర్తించిందీ పాయింట్ల రూపంలో రాస్తే బాగుంటుంది.

ఈమధ్యే చదువు పూర్తిచేసిన వాళ్లకు ఉద్యోగానుభవం ఉండదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసించడం లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం కోసం శిక్షణ తీసుకోవడం.. లాంటివి చేస్తుంటే ఆ విషయాలనూ ప్రస్తావించాలి. దీని ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. నైపుణ్యాలను పెంచుకుంటున్న మీ గురించి సదభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది.

అభిరుచులకూ చోటు

విద్యార్హతలు, పనిచేసిన అనుభవాల గురించి వివరించడం వరకూ బాగానే ఉంటుంది. మరి అభిరుచుల గురించి చెప్పాలా.. వద్దా? నిపుణుల అభిప్రాయం ప్రకారం వీటి గురించి చెప్పడం అవసరమే. అయితే నైపుణ్యాలను పెంచుకోవడానికి తోడ్పడే అభిరుచులు మీకుంటే ఇంకా మంచిది. ఉదాహరణకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవడం మీ హాబీ అనుకుందాం. మీకున్న ఈ వ్యక్తిగత అభిరుచి వృత్తి జీవితంలో ఎదుగుదలకూ తోడ్పడుతుంది. ఎందుకంటే నిరంతరం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండే ఉద్యోగులు.. సంస్థకు విలువైన మానవ వనరు కాగలుగుతారు. రోజురోజుకూ మారిపోతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలంటే.. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉండే ఉద్యోగులు ఎంతో అవసరం. ఉద్యోగ విధులను నిర్వర్తించే తీరులో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మరింత వేగంగా, సమర్థంగా బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే అభిరుచి మీకుంటే.. మారుతున్న సాంకేతికతనూ త్వరగా అందిపుచ్చుకుంటారు. కేటాయించిన పనులను వేగంగా పూర్తిచేస్తారు. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి- విలువైన కాలాన్నీ, డబ్బునూ వృథాచేసే అభిరుచులు మీకుంటే.. వాటి గురించి ప్రస్తావించకపోవడమే మంచిది.

కవర్‌ లెటర్‌

సీవీ ఆకట్టుకునేలా ఉండాలంటే కవర్‌ లెటర్‌నూ జతచేయాలి. దీంట్లో ముందుగా దరఖాస్తు చేస్తున్న ఉద్యోగం పేరు, ఉద్యోగ ప్రకటన వెలువడిన తేదీని ప్రత్యేకంగా రాయాలి. ఆ తర్వాత సీవీలో ప్రస్తావించని విషయాల గురించి దీంట్లో రాయొచ్చు. రాసే క్రమంలో అక్షర, అన్వయ దోషాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కఠినమైన పదాలను ఉపయోగించకుండా చెప్పాలనుకుంటున్న విషయాన్ని సులువుగా, ఆసక్తిగా వ్యక్తీకరించగలగాలి.

ఎవరిని ఉద్దేశించి లెటర్‌ను రాస్తున్నారో ఆ వ్యక్తి పేరు, హోదా ఒకసారి చెక్‌ చేసుకోవాలి. కంపెనీ పేరు, దరఖాస్తు చేసే ఉద్యోగ హోదా విషయంలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో కనీస జాగ్రత్తలు తప్పనిసరి. కంపెనీ పేరు విషయంలో ఏమైనా సందేహాలుంటే వెబ్‌సైట్‌ చూసుకుని రాయడం మంచిది. భాష మీద మీకెంత పట్టున్నా సరే లెటర్‌ను పంపేముందు ఒకసారి సరిచూసుకోవాలి. పదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. కవర్‌ లెటర్‌ కాపీని మీ దగ్గర పదిలపరుచుకోవాలి. ఎందుకంటే దీంట్లో ప్రస్తావించిన అంశాల గురించి ఇంటర్వ్యూ సమయంలో అడిగే అవకాశం ఉంటుంది. కొంతమంది పోస్టు పేరు దగ్గర ఖాళీ వదిలి.. లెటర్‌ను జిరాక్స్‌ కాపీలు తీసుకుని సిద్ధంగా ఉంచుకుంటారు. తర్వాత ఆ ఖాళీని పూరిస్తుంటారు. ఇది సరికాదు. అన్ని ఉద్యోగాలకూ ఒకే విధమైన విధులు ఉండవు. ఉద్యోగాలను బట్టి చేయాల్సిన పనులూ మారుతుంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు లెటర్‌ను సిద్ధం చేసుకోవడమే సమంజసం.  


ఖాళీ...వస్తే!

రెజ్యూమె....ఎదుటివారికి మనపై కలిగే తొలి అభిప్రాయం. అది ఎంత పాజిటివ్‌ కోణంలో ఉంటే... మన పని అంత సులువుగా జరుగుతుంది. అయితే ఇందులో అకడమిక్‌ గ్యాప్‌ లేదా ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్న సమయం మనల్ని కాస్త ఇబ్బంది పెట్టే అంశం. దీనికి సంబంధించి ప్రశ్నలు ఎదుర్కొనే సమయంలో ఏం చేయాలంటే...

ఏదైనా ముఖాముఖి పరీక్షకు హాజరయ్యేటప్పుడు... విద్యార్థిగానైనా, ఉద్యోగంలో చేరాక అయినా ఏడాది, రెండేళ్లు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తే... అది అవతలివారిని మనపట్ల ఆలోచనలో పడేస్తుంది. మనకిచ్చే అవకాశాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ విరామం అనివార్యంగా వస్తుంటుంది. అందుకే  దీనికి సంబంధించిన ప్రశ్నలకు కొంత ఆలోచించి సమాధానాలు ఇవ్వాలి. అప్పుడే మనకు రావాల్సిన అవకాశంపై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడొచ్చు.

  •  ఇటువంటి సమయాల్లో మొట్టమొదట చేయాల్సిన విషయం ఆ ఖాళీ గురించి నిజాయతీగా చెప్పడం. రెజ్యూమెలోనైనా, నేరుగానైనా గ్యాప్‌ గురించి పూర్తిగా నిజమే చెప్పాలి. అదే సమయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం ఎక్కడా ఆపలేదు అనే అంశాన్ని స్పష్టం చేయాలి. మీకున్న అదనపు నైపుణ్యాలను ప్రస్తావిస్తూ, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామనే భావన కల్పించవచ్చు. ఎట్టిపరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకూడదు. కంపెనీ వారు కనుక్కోవాలి అనుకుంటే వాస్తవం ఎలా అయినా తెలిసిపోతుందనే విషయాన్ని గ్రహించాలి. అందువల్ల నిజాయతీగా ఉండటమే మంచిది.
  •  ఈ ఖాళీకి కారణాలు చెప్పాల్సి వస్తే... కుటుంబ కారణాలు, అనారోగ్యం, గాయాలు, మీకు నచ్చిన చదువు - ఉద్యోగం ఏదో గుర్తించడానికి ప్రయత్నం చేయడం, ఏదైనా వ్యాపారం నడపడం వంటివన్నీ చెప్పొచ్చు. ఇంతకంటే వేరే కారణాలు చెప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి.
  • ఖాళీలపై అంతగా ఫోకస్‌ చేయని విధంగా ఉండే రెజ్యూమె ఫార్మాట్లను ఎంచుకోవడం ఉత్తమం. అప్పుడు ఇంటర్య్వూ చేసే వ్యక్తి దాన్ని గుర్తించేందుకు, గుర్తించినా ప్రశ్నించేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.
  • ఖాళీగా ఉండటంకంటే కూడా, దాన్ని మనం ఎలా వివరించామనే దాన్ని బట్టే అవతలివారి అభిప్రాయం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఖాళీకి కారణం ఏదైనా పాజిటివ్‌ కోణంలో చెప్పేందుకు, సరైన కారణాలు ఇచ్చేందుకు ప్రయత్నించాలి.
  • ఈ ఖాళీలు ‘వీరు తరచూ జాబ్‌ వదిలి వెళ్లిపోతున్నారు’ అని అనుకోవడానికి ఆధారం కాకూడదు. అలాంటివారిని ఉద్యోగంలోకి తీసుకుంటే శిక్షణ ఇచ్చి సమయాన్ని వృథా చేసుకోవడం అని కంపెనీలు భావిస్తాయి. అందువల్ల మనం ఎక్కడైనా స్థిరంగా పనిచేయగలుగుతాం అనే భావన కల్పించాలి.
  • అలాగే ఈ ప్రశ్న ఎదురుకాగానే తడబడటం, జవాబు కోసం తడుముకోవడం వంటివి చేయకూడదు. ముందే అడుగుతారనే విషయాన్ని గమనించి తగిన విధంగా జవాబుతో సన్నద్ధం కావాలి.
  • చక్కని డిగ్రీ, మెరుగైన మార్కులు, ఆకట్టుకునే ప్రతిభ ఉంటే... సమయం విరామం అనేది పెద్ద విషయంగా కనిపించదు. తాజాగా ఎటువంటి ఖాళీ ఉన్నా, దాన్ని నిజాయతీగా ఒప్పుకుని, సరైన విధంగా వివరిస్తే.. అనుకున్న అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని