ఇంజినీరింగ్‌లో చేరారా? ఇది మీ కోసమే!

ఇంటర్మీడియట్‌ తర్వాత కష్టపడి చదివి ప్రవేశ పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు తెచ్చుకున్నారు. ఇంకేముంది...మంచి భవితకు మార్గం పడినట్లే అనుకుంటున్నారా? అలా జరగాలంటే.. సమయం వృథా చేయకుండా నాలుగేళ్లూ తగిన కృషి చేయాలి. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి.

Updated : 03 Oct 2023 08:42 IST

ఇంటర్మీడియట్‌ తర్వాత కష్టపడి చదివి ప్రవేశ పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు తెచ్చుకున్నారు. ఇంకేముంది...మంచి భవితకు మార్గం పడినట్లే అనుకుంటున్నారా? అలా జరగాలంటే.. సమయం వృథా చేయకుండా నాలుగేళ్లూ తగిన కృషి చేయాలి. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఇందుకు ఉపకరించేలా నిపుణులు సూచిస్తున్న మెలకువలు ఇవిగో!

‘ఇంటర్‌ బాగా చదివితే చాలు, మంచి కళాశాలలో ఇష్టమైన బ్రాంచిలో సీటు వస్తుంది కాబట్టి ఇక భవిష్యత్‌ జీవితానికి ఢోకా లేనట్టే’ అని కొందరు విద్యార్థులూ, తల్లిదండ్రులూ భావిస్తుంటారు. మరోపక్క ఇంజినీరింగ్‌ విద్య అంటే స్నేహాలూ, సంతోషాలూ మాత్రమే అనే అపోహ చాలామందిలో ఉంటోంది. ఆ సరదాలను కోల్పోకుండానే విషయ పరిజ్ఞానం నేర్చుకుంటూ, సరికొత్త నైపుణ్యాలను అలవర్చుకుంటూ వృత్తినిపుణులుగా ఎదగటం ముఖ్యం. ఇంజినీరింగ్‌ విద్యను ప్రణాళికతో అభ్యసించాలనే విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.

ప్రస్తుత కాలంలో బీటెక్‌/ బీఈ పట్టభద్రులకు ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే సబ్జెక్టు పరిజ్ఞానంలో, సంబంధిత నైపుణ్యాల్లో అగ్రగాములుగా నిలవడం తప్పనిసరి. చాలా ఇంజినీరింగ్‌ కళాశాలలో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు ఉన్నారు. అత్యాధునికమైన ప్రయోగశాలలూ, పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల ఇంజినీరింగ్‌ విద్యార్ధికి ప్రాక్టికల్‌గా చాలా విషయాలు తెలుసుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. వాటిని అందిపుచ్చుకోవడమే విద్యార్థుల కర్తవ్యం.    

కొత్తగా ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరినవారు నాలుగు సంవత్సరాల్లో ఏమేం పాటించాలో, నేర్చుకోవాలో పరిశీలిద్దాం..


సమయ పాలన

తమకు సమయం చాలటం లేదని ఎవరైనా ఫిర్యాదు  చేశారంటే వారికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ సరిగా లేదని అర్థం. నిద్ర, కళాశాలకు వెళ్లి రావటం, ఇతర కార్యకలాపాలకు సమయం తీసేసినా విద్యార్థులకు కనీసం 8 గంటల వ్యవధి మిగిలే ఉంటుంది. సామాజిక మాధ్యమాలకూ, కాలక్షేప కబుర్లకూ వెచ్చించే సమయం తగ్గించుకోవచ్చు.       ఎప్పటి  కప్పుడు సబ్జెక్టు అంశాల పఠనం, అసైన్‌మెంట్లు, సాంకేతిక, కమ్యూనికేషన్‌ నైపుణ్యాల కోసం ఈ వ్యవధిని ఉపయోగించుకోవాలి.


మొదటి ఏడాది

ఇంజినీరింగ్‌ నూతన విద్యార్థులు ఉత్సాహంతో, ఆసక్తితో కళాశాలలో చేరతారు. ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా క్యాంపస్‌ వనరులు, పాఠ్యేతర అవకాశాలను వారికి పరిచయం చేస్తారు. కళాశాల పరిస్థితులపై, సౌకర్యాలపై అవగాహన పెంచుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు సహాయపడతాయి. అదే సమయంలో విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణమైన వివిధ ఇంజినీరింగ్‌ అంశాల అన్వేషణ, పరిశీలన సాగించాలి. సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాలు వారి కళాశాల అనుభవాన్ని మెరుగుపరిచి గుర్తింపును పెంచుతాయి. మొదటి సంవత్సరంలోని గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, ప్రాథమిక ఇంజినీరింగ్‌ కోర్సులు లాంటి సబ్జెక్టుల్లో ముఖ్యంగా గణితం మీద పట్టు సాధించాలి. గణితశాస్త్రంపై తగినంత పట్టు పెంచుకోవటం వల్ల విద్యార్థికి సబ్జెక్టులు సులువుగా అర్ధం అవుతాయి. మొదటి సంవత్సరం నుంచి ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ నేర్చుకోవటంపై దృష్టి పెట్టాలి.

రెండో ఏడాది

విద్యార్థులు తాము ఎంచుకున్న ఇంజినీరింగ్‌ రంగానికి సంబంధించిన సబ్జెక్టులపై దృష్టి సారిస్తూ  కోర్‌ కోర్సులను పరిశీలించే తరుణమిది. అదే సమయంలో వీరు తమ ప్రధానమైన ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. తమ బ్రాంచిపై అవగాహన మరింతగా పెంచుకునే ప్రాజెక్టులో చురుగ్గా పాల్గొనాలి. తమకు సంబంధించిన హాబీ ప్రాజెక్టును డెవలప్‌ చేయాలి. సీనియర్‌ విద్యార్థుల మార్గదర్శకత్వంలో అభిరుచి గల ప్రాజెక్టులో పాల్గొనడం వల్ల వారి ఆచరణాత్మక నైపుణ్యాలూ, భావ వ్యక్తీకరణ సామర్ధ్యం చెప్పుకోదగ్గవిధంగా మెరుగుపడతాయి.

విద్యార్థి ఇంజినీరింగ్‌ తదుపరి ప్రణాళికను పరిగణనలోకి తీసుకునే కీలకమైన ఘట్టానికి ఈ సంవత్సరమే నాంది. తదుపరి చదువులను కొనసాగించడం/ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ (వ్యవస్థాపకత) ప్రయత్నాలు/ ఉద్యోగ అర్హతలు మెరుగుపరుచుకునే సన్నాహాలకు పునాది మొదలవుతుంది. ప్రామాణిక పాఠ్యపుస్తకాల అభ్యాసం, సంబంధిత రంగ నిర్దిష్ట నైపుణ్యాల సాధన ప్రారంభించాలి. అదనంగా హ్యాకథాన్లు, కోడింగ్‌ పోటీలు, ఇతర ఇంజినీరింగ్‌ పోటీల్లో పాల్గొనాలి.రెండు, మూడు సంవత్సరాల మధ్య వేసవి ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సివుంటుంది.

మూడో ఏడాది  

విద్యార్థులు గేట్‌, జీఆర్‌ఈ, క్యాట్‌,  ఐఈఎల్‌టీఎస్‌ లాంటి వివిధ పరీక్షలకూ, కెరియర్‌ లక్ష్యాలకు సంబంధించిన  ఇతర పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్‌ను ప్రారంభించే సంవత్సరం ఇది. పరీక్ష తయారీతో పాటు వారు తమ రంగంలోని ప్రత్యేక సబ్జెక్టులను మరింతగా తెలుసుకుంటారు. ప్లేస్‌మెంట్‌ సన్నాహాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సమయ నిర్వహణ, సమస్య- పరిష్కార సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు వివిధ నమూనా పరీక్షలకు హాజరవ్వాలి. లింక్డ్‌ఇన్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల్లో చురుగ్గా పాల్గొనాలి. ఇలాంటి కార్యకలాపాలు ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో, ప్రాజెక్టులు, నైపుణ్యాలను ప్రదర్శించడంలో, శక్తిమంతమైన రెజ్యూమెలను రూపొందించడంలో వారికి సహాయపడతాయి.

నాలుగో ఏడాది

చివరి సంవత్సరం అంటే ఇది బీటెక్‌/ బీఈ విద్యాభ్యాస ముగింపు దశ. పరిశోధన ప్రయత్నాలు లేదా పరిశ్రమ భాగస్వాముల సహకారాలతో ప్రధాన ప్రాజెక్టుల రూపకల్పనకు గణనీయమైన సమయాన్ని కేటాయించాలి. థీసిస్‌ రాయడం, పరిశోధన పత్రాలను ప్రచురించడం లాంటి పనుల ద్వారా విద్యావిషయక విజయాల్లో ముందడుగు వేయవచ్చు. విద్యార్థులు ఇంజినీరింగ్‌ ప్రయాణంలో సంపాదించిన జ్ఞానాన్ని అనువర్తింపజేయడానికి ఉద్యోగ నియామకాలను పొందడం, ఇంటర్న్‌షిప్‌లను కొనసాగించడం ఒక సాధారణ మార్గం. వారు నేర్చుకునే ప్రయాణం ఇక్కడితో ఆగదు. చొరవ, ఆసక్తి, ఉత్సాహాలతో నవీన సాంకేతికతలను నిరంతరం అందిపుచ్చుకునే వైఖరి ఇంజినీరింగ్‌ కెరియర్‌ పొడవునా కొనసాగాలి..

ఔత్సాహిక పారిశ్రామికులుగా ఎదగాలనే (వ్యవస్థాపక) ఆకాంక్షలున్నవారికి ఈ సంవత్సరం ఆలోచనలను మెరుగుపరచడానికీ, వ్యాపార ప్రణాళికలను రూపొందించడానికీ, అవసరమైన విద్య, నైపుణ్యాలను సంపాదించడానికీ కీలకమైన అవకాశాన్ని అందిస్తుంది. వాస్తవ ప్రపంచ సమస్యలకు వినూత్న పరిష్కారాల అన్వేషణ ఒక చోదక శక్తిగా మారుతుంది. వారి వ్యవస్థాపక ప్రయత్నాలకు మార్గం సుగమం చేస్తుంది. డిగ్రీతో మాత్రమే కాకుండా వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి పూర్తి సంసిద్ధతతో తయారవుతారు. ఆఖరి సంవత్సరం కేవలం విద్యావిషయక సాధనకు సంబంధించినది కాదు; ఇది వృత్తిపరమైన ప్రపంచంలోకి సజావుగా మారే ప్రక్రియకు సముచితమైన తరుణం. నాలుగు సంవత్సరాల అంకితమైన అభ్యాసంలో పొందిన జ్ఞానం, నైపుణ్యాలు, అనుభవాలను ముందుకు తీసుకువెళ్లే సమయమిది.  

ఇంజినీరింగ్‌ కోర్సు నాలుగు సంవత్సరాల వ్యవధి...అకడమిక్‌ లెర్నింగ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, కెరియర్‌ ప్రిపరేషన్‌తో కూడిన సంపూర్ణ అనుభవాన్ని అందిస్తుంది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు డిగ్రీతో మాత్రమే కాకుండా వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోగల శక్తి, విజయవంతమైన కెరియర్‌ ద్వారా ఎంచుకున్న రంగాల్లో అర్థÄవంతమైన ప్రభావాన్ని చూపే సామర్థ్యాలతో ఉద్భవించేలా ఈ నాలుగేళ్ల సమయాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలి. అప్పుడే అపార అవకాశాలతో నిండిన ఆశాజనక భవిష్యత్తు సాధ్యం అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని