దోషుల గుట్టు ఇట్టే పట్టేస్తారా?

సమాజంలో నేరాలూ ఘోరాలకు అంతులేదు. హత్యలూ, మోసాలూ పకడ్బందీగా జరిగిపోతున్నాయి. ఆధారాలు చిక్కవు.. కారణాలు తెలీవు. ప్రతి కేసులోనూ ఎన్నో మలుపులు. దర్యాప్తులో ట్విస్టుల మీద ట్విస్టులు.

Updated : 16 Oct 2023 01:29 IST

సమాజంలో నేరాలూ ఘోరాలకు అంతులేదు. హత్యలూ, మోసాలూ పకడ్బందీగా జరిగిపోతున్నాయి. ఆధారాలు చిక్కవు.. కారణాలు తెలీవు. ప్రతి కేసులోనూ ఎన్నో మలుపులు. దర్యాప్తులో ట్విస్టుల మీద ట్విస్టులు. ఈ మిస్టరీలను ఛేదించే ఆసక్తి ఉన్నవారు     ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులో చేరాలి. ఈ విభాగంలో నిపుణుల     అవసరం పెరుగుతోంది. సవాళ్లను స్వీకరించే తత్వం ఉంటే ఫోరెన్సిక్‌ కెరియర్‌ను చేపట్టవచ్చు.  

నమ్మకాలన్నీ వాస్తవాలు కాలేవు.. ఆత్మహత్య అనుకున్నది హత్య కావచ్చు. ప్రమాదంలో కుట్ర కోణం దాగుండొచ్చు. హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినవారినీ, దొంగతనం చేసి దొంగలెత్తుకుపోయారని నాటకాలాడేవాళ్లనూ, ఆస్తులను తగలెట్టి ఆదుకోండి మహాప్రభో అంటూ అభినయించేేవారినీ, నకిలీ పత్రాలతో నిలువునా దోచుకుంటున్నవారినీ... ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించగలరు.

సాంకేతికతను అస్త్రంగా మలుచుకుని, హైటెక్‌ రీతిలో హత్యలు, అత్యాచారాలు, సైబర్‌ మోసాలు చేసేవాళ్లు పెరిగారు. భారత్‌తో సహా, ప్రపంచవ్యాప్తంగా నేరాలు, ఆర్థిక మోసాలు తీవ్రమవుతున్నాయి. వీటికి బాధ్యులైనవారిని గుర్తించి, చట్టం ముందుకు తీసుకువచ్చి శిక్ష పడేలా చేయడానికి సాధారణ నైపుణ్యం సరిపోవడం లేదు. ఆధారాలు అన్వేషించి, అసలు దోషుల గుట్టు విప్పడానికి ఆవిర్భవించిందే ఫోరెన్సిక్‌ సైన్స్‌. ఇది కేవలం హంతకులను గుర్తించే శాస్త్రమే కాదు. మోసగాళ్లను పట్టించే దివ్యాస్త్రం కూడా. ముడుపులు తీసుకునేవారినీ, మార్ఫింగ్‌ చేసేవారినీ, వన్యమృగాల వేటగాళ్లనూ, పసిమొగ్గలపై పైశాచికతను ప్రదర్శించేవారినీ కచ్చితత్వంతో పట్టుకుంటుందీ శాస్త్ర పరిజ్ఞానం. దీంతో ఈ రంగంలో కెరియర్‌ అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఇందుకోసం పలు స్పెషలైజేషన్లతో భిన్న విద్యాసంస్థలు ఫోరెన్సిక్‌ కోర్సులు అందిస్తున్నాయి.  

యూజీ నుంచి..

సైన్స్‌లో ఒక విభాగమే ఫోరెన్సిక్‌ సైన్స్‌. ఈ సబ్జెక్టుపై ఆసక్తి ఉన్న ఇంటర్‌ మ్యాథ్స్‌, సైన్స్‌ విద్యార్థులు బీఎస్సీలో ఒక సబ్జెక్టుగా తీసుకోవచ్చు. యూజీలో పరిమిత సంస్థల్లోనే ఫోరెన్సిక్‌ సైన్స్‌ అందుబాటులో ఉంది. యూజీలో సైన్స్‌, మ్యాథ్స్‌ కోర్సులు చదివినవారు పీజీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసమే జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా సంస్థలూ ఏర్పాటయ్యాయి. రాష్ట్రస్థాయిలో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులు అమలవుతున్నాయి. పీజీ అనంతరం పీహెచ్‌డీలో చేరవచ్చు. పలు సంస్థలు సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులూ అందిస్తున్నాయి. స్పెషలైజేషన్లూ ఉన్నాయి.

ఎమ్మెస్సీ- డిజిటల్‌ ఫోరెన్సిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఎమ్మెస్సీ - హోం ల్యాండ్‌ సెక్యూరిటీ అండ్‌ యాంటీ టెర్రరిజం, ఎంబీఏ ఫైనాన్స్‌ (ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌), ఎంటెక్‌ - సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్సిడెంట్‌ రెస్పాన్స్‌, పీజీ డిప్లొమా - ఫోరెన్సిక్‌ టాక్సికాలజీ, ఫోరెన్సిక్‌ డాక్యుమెంట్‌ ఎగ్జామినేషన్‌, ఫింగర్‌ ప్రింట్‌ సైన్స్‌, క్రిమినాలజీ, ఫోరెన్సిక్‌ మేనేజ్‌మెంట్‌, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌, ఫోరెన్సిక్‌ ఓడొంటాలజీ, ఫోరెన్సిక్‌ నర్సింగ్‌... తదితర కోర్సులు పలు సంస్థలు అందిస్తున్నాయి. ఆసక్తి, పూర్వ విద్యా నేపథ్యం ప్రకారం నచ్చినవాటిలో చేరవచ్చు.

మేటి సంస్థలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ నెలకొల్పారు. ఈ సంస్థ ఎంఏ క్రిమినాలజీ, ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులు అందిస్తోంది. క్రిమినాలజీ కోర్సులో గ్రాడ్యుయేట్లు ఎవరైనా చేరవచ్చు. ఈ సంస్థ ఏడాది వ్యవధితో పీజీ డిప్లొమా ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫ్‌ సైబర్‌ క్రైమ్‌ అండ్‌ లా, పీజీ డిప్లొమా ఇన్‌ విక్టిమాలజీ అండ్‌ విక్టిమ్‌ అసిస్టెన్స్‌, పీజీ డిప్లొమా ఇన్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తోంది. వీటిలో ఏదైనా డిగ్రీతో అవకాశం ఉంది. ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌కి సైన్స్‌ గ్రాడ్యుయేట్లే అర్హులు.

గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ పలు కోర్సులను అందిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, పంజాబ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లఖ్‌నవూ, ఉస్మానియా యూనివర్సిటీ, బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌, ముంబయి, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఔరంగాబాద్‌; యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీ, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌, మైసూరు (ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్సెస్‌, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌), గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ, పంజాబ్‌ యూనివర్సిటీ ...తదితర సంస్థలు ఫోరెన్సిక్‌ కోర్సులకు పేరొందాయి. ఇవి పీజీ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా కోర్సులు నడుపుతున్నాయి. పలు సంస్థలు సీయూసెట్‌ (యూజీ/పీజీ)తో అవకాశం కల్పిస్తున్నాయి.

ఏ నైపుణ్యాలు అవసరం?

సమాచారాన్ని విశ్లేషించగలగడం, లోతుగా ఆలోచించడం, వాస్తవానికి దగ్గరగా ఊహించడం, తర్కం, సునిశిత పరిశీలన ఉన్నవాళ్లు రాణించగలరు. అవసరాన్ని బట్టి భిన్న నిపుణులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మంచి కమ్యూనికేటర్‌గా, బృంద సభ్యులుగా మెలగాలి. కష్టపడే తత్వం ఉండాలి. సవాళ్లను స్వీకరించగలగాలి. పట్టుదల, ఓపిక అవసరం.

ఉపాధి సంగతి?

ఫోరెన్సిక్‌ సైన్స్‌ నిపుణులకు.. ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలు, ఆసుపత్రులు, ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. స్పెషలైజేషన్‌పై ఇవి ఆధారపడి ఉంటాయి. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు ఫోరెన్సిక్‌ నిపుణులను డాక్యుమెంట్‌ రైటర్లుగా నియమించుకుంటున్నాయి. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), పోలీస్‌ శాఖల్లో ఫోరెన్సిక్‌ ఉద్యోగాలు ఉంటాయి. యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్‌, మాస్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌, కన్సూమర్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ప్రైవేటు ఇన్వెస్టిగేటర్లగా వీరు రాణించగలరు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో అవకాశాలు పెరుగుతున్నాయి.

ఆలిండియా ప్రవేశ పరీక్ష

దేశవ్యాప్తంగా 49 సంస్థల్లో యూజీ, పీజీ.. ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆల్‌ ఇండియా ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఐఎఫ్‌ఎస్‌ఈటీ) నిర్వహిస్తున్నారు. ఇటీవలే ప్రకటన వెలువడింది.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 28

వెబ్‌సైట్‌: https://aifset.com/

హోదాలు.. విధులు

ఫోరెన్సిక్‌ బాలిస్టిక్‌ ఎక్స్‌పర్ట్‌: గన్‌, పిస్టళ్లలో ఉపయోగించిన బుల్లెట్‌ రకం, అది ఎక్కడ తయారైంది, ఎంత దూరం నుంచి కాల్చారు, ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి, ఇంతకు ముందు ఎప్పుడు ఆ పరికరాన్ని ఉపయోగించారు.. వివరాలన్నీ కచ్చితత్వంతో చెప్పగలరు.

ఫోరెన్సిక్‌ డీఎన్‌ఏ ఎనలిస్ట్‌: వీరు ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించిన వేలిముద్రలు, రక్తం, వస్తువులను ఆధారంగా చేసుకుని అందుకు కారణమైన వ్యక్తి డీఎన్‌ఏ తెలుసుకుంటారు. అది ఎవరితో సరిపోతుందో తేలుస్తారు.  

డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌: డిజిటలీకరణతో కంప్యూటర్‌ వినియోగం పెరిగింది. దీనికి తగ్గట్టుగానే ఆన్‌లైన్‌ మోసాలు (సైబర్‌ నేరాలు) తీవ్రమయ్యాయి. ఫోరెన్సిక్‌ సైన్స్‌కు సాంకేతికతను జోడించి డిజిటల్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు మోసగాళ్లను గుర్తిస్తారు. హ్యాకర్ల నుంచి దొంగతనానికి గురైన డేటాను రాబడతారు. ఫోరెన్సిక్‌ కంప్యూటర్‌ ఇన్వెస్టిగేటర్‌ అని కూడా వీరిని వ్యవహరిస్తారు.

క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేటర్‌: నేరం జరిగిన తీరును గమనించి, అదెలా జరిగిందో నమూనాను తయారు చేస్తారు. ఆధారాలకోసం ప్రయత్నిస్తారు. అక్కడ లభించినవి సేకరించి, ప్రయోగశాలకు పంపుతారు.

వైల్డ్‌ లైఫ్‌ ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్ట్‌: అనుమానాస్పదంగా మృతిచెందిన వన్యమృగాలపై అధ్యయనం చేస్తారు. అక్కడ లభించిన ఆధారాలతో కారకులను గుర్తిస్తారు.

ఫోరెన్సిక్‌ టాక్సికాలజిస్ట్‌: కొందరు విష ప్రభావంతో చనిపోతారు. వాళ్లే సేవించారా, ఎవరైనా తెలీకుండా ఆహారంలో కలిపారా అనేది వీరు నిర్థరిస్తారు. అలాగే డ్రగ్స్‌ మొదలైనవి తీసుకుంటే ఆ మాదకద్రవ్యం పేరు, మోతాదు గుర్తిస్తారు.

ఫోరెన్సిక్‌ సైకాలజిస్ట్‌: నేరారోపణ ఎదుర్కొంటున్నవారి మానసిక స్థితిని విశ్లేషిస్తారు. సంబంధిత వివరాలు కోర్టులో అందిస్తారు. విచారణ ఎదుర్కోగలిగేలా ఉన్నారా, లేదా గమనిస్తారు. మానసిక రోగులు, సైకోలు హత్యలో భాగమైనప్పుడు ఈ నిపుణుల సేవలే కీలకం.

ఫోరెన్సిక్‌ లింగ్విస్ట్‌లు/ ఫోరెన్సిక్‌ స్పీచ్‌ నిపుణులు: వీరు నేరం జరిగినచోట పత్రాలు, వాయిస్‌ వివరాలు ఏవైనా లభిస్తే వాటిని గమనిస్తారు. రాతను పరీక్షించి ఎవరు రాశారో గుర్తిస్తారు. ఫోరెన్సిక్‌ స్పీచ్‌ సైన్స్‌తో అక్కడ లభించిన ఆడియో టేపుల్లో గొంతును విశ్లేషించవచ్చు. లభించిన వివరాలు అసలా, నకిలీయా నిర్ధారిస్తారు.

ఫోరెన్సిక్‌ పాథాలజిస్ట్‌: అనుమానాస్పద మరణాల వెనుక మర్మాలను వీరు విప్పుతారు. ఇందుకోసం పోస్టుమార్టం చేస్తారు. ప్రమాదవశాత్తూ మరణించారా, సహజంగానే చనిపోయారా, హత్య జరిగిందా, ఆత్మహత్య చేసుకున్నారా...ఈ వివరాలు కచ్చితత్వంతో  చెప్పగలరు.

ఫోరెన్సిక్‌ ఓడొంటాలజిస్ట్‌: బాధితుల ఒంటిపై గాట్లు ఏమైనా ఉంటే వాటికి కారకులను పరిశీలిస్తారు. జంతువుల కారణంగా జరిగిందా, లేదంటే మనుషులే పళ్లతో కరిచారా, గోళ్లతో రక్కారా.. వీటిని తేల్చేస్తారు.

ఫోరెన్సిక్‌ అకౌంటెంట్‌: ఆర్థిక నేరగాళ్లను తెలుసుకోవడం, గుర్తించడం వీరితో సాధ్యమవుతుంది. వివాదాల్లో ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీలను సులువుగా అర్థమయ్యేలా కోర్టుముందు ఉంచుతారు. ఆర్థిక ఒప్పంద పత్రాలు (బాండ్స్‌), నిబంధనలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం ఈ విభాగంలో నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. అకౌంట్స్‌, లా నేపథ్యం ఉన్నవారు ఇందులో రాణించగలరు. వీరికి ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, లీగల్‌ ఫర్మ్‌ల్లో ఉద్యోగాలు ఉంటాయి.

ఫోరెన్సిక్‌ క్రైమ్‌ ల్యాబొరేటరీ అనలిస్ట్‌, ఫోరెన్సిక్‌ ఇంజినీర్‌, ఫోరెన్సిక్‌ ఆర్కిటెక్ట్‌, ఫోరెన్సిక్‌ వెటర్నరీ సర్జన్‌, ఫోరెన్సిక్‌ ఆంత్రొపాలజిస్ట్‌, ఫోరెన్సిక్‌ పాథాలజిస్ట్‌.. ఇలాంటి హోదాల్లో సేవలు అందించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని