కష్టపడుతున్నా మార్కులు రావడం లేదా?

‘పరీక్షలు ఎంత బాగా రాసినా మార్కులు మాత్రం ఊహించిన దాని కంటే తక్కువే వస్తున్నాయి. సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా చదివినా ఫలితం దక్కడంలేదు’ అని కొందరు విద్యార్థులు వాపోతుంటారు. అలాంటివారిలో మీరూ ఉన్నారా... అయితే ఈ అంశాలను ఒకసారి గమనించండి.

Published : 20 Dec 2023 00:06 IST

‘పరీక్షలు ఎంత బాగా రాసినా మార్కులు మాత్రం ఊహించిన దాని కంటే తక్కువే వస్తున్నాయి. సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా చదివినా ఫలితం దక్కడంలేదు’ అని కొందరు విద్యార్థులు వాపోతుంటారు. అలాంటివారిలో మీరూ ఉన్నారా... అయితే ఈ అంశాలను ఒకసారి గమనించండి.

కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వస్తాయని ముందుగానే ఊహించారు. కానీ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. ముందుగా మీరు దీన్ని అంగీకరించి తీరాలి. అలాగే ఆ సబ్జెక్టుల్లోనే మీ స్నేహితులకు ఎక్కువ మార్కులూ వచ్చి ఉండొచ్చు. అంటే మీకంటే వాళ్లకు విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉందనే నిజాన్నీ గుర్తించాలి. ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో తెలుసుకుని.. అదనపు సమయాన్ని కేటాయించడం ద్వారా వాటిపై పట్టు సాధించడానికి ప్రయత్నించాలి.

1.చాలామంది విద్యార్థులు సాధారణంగా పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించడమే ధ్యేయంగా చదువుతారు. కాన్పెప్ట్‌లు, థియరీలను అర్థంచేసుకుంటూ చదవాలనే విషయం మీద అసలు దృష్టిపెట్టరు. కొన్నిసార్లు ప్రాథమిక అంశాలనూ దాటవేస్తుంటారు కూడా. దీంతో పునాది బలహీనంగా ఉండి.. అడ్వాన్స్‌డ్‌ దశలోని పాఠాలను అర్థంచేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. విషయాన్ని మొక్కుబడిగా జ్ఞాపకం పెట్టుకోవడం కంటే.. అర్థంచేసుకుంటూ చదవడమే ముఖ్యం. అలాకాకుండా ఎన్ని గంటలపాటు చదివినా ప్రయోజనం ఉండదు. చదివినదాన్ని స్నేహితులకు వివరించి చెప్పగలిగారంటే దానిపైన మీరు పట్టుసాధించినట్టే.

2.ఎన్ని గంటలపాటు చదివారు అనే దానికంటే ఎంత ఏకాగ్రతతో చదివారనేదే ముఖ్యం. ముందుగా ఏ సబ్జెక్టుకు ఎంత సమయాన్ని కేటాయించాలనేది టైమ్‌టేబుల్‌ వేసుకోవాలి. దాన్ని కచ్చితంగా అమలు చేయడానికీ ప్రయత్నించాలి. మర్నాటికి వాయిదా వేయాలనుకోవడం వల్ల తర్వాత అదే అలవాటుగా మారే ప్రమాదమూ ఉంటుంది.

3.చదివినవి ఎంత వరకూ అర్థమయ్యాయో తెలుసుకునేందుకు.. ప్రశ్నలు వేసుకోవడం, సమీక్షించుకోవడం, అవసరమైతే మరోసారి చదవడం లాంటి చిట్కాలు ఉపయోగపడతాయి. అలాగే చదివేటప్పుడు మధ్యలో కాసేపు విరామం తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఆ సమయంలోనూ కూర్చుని ఉండకుండా కాస్త అటూఇటూ నడవచ్చు. అలసిపోయినట్టుగా అనిపిస్తే కళ్లు మూసుకుని కాసేపు సేదతీరినా ప్రశాంతంగా ఉంటుంది.

4.పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించాలంటే.. చేతిరాతా బాగుండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే అక్షరాలు గుండ్రంగా, అందంగా ముత్యాల్లా ఉండి.. చూడగానే అందర్నీ ఆకర్షించాలని కాదు. రాసింది స్పష్టంగా, అర్థమయ్యేలా ఉంటే సమాధాన పత్రాలు దిద్దేవారికీ ఇబ్బంది ఉండదు. అసలు మీరేం రాశారో అర్థమేకానప్పుడు మార్కులు వేయడమూ కష్టమే కదా. అలాగే త్వరగా సమాధానాలన్నీ  రాయాలనే కంగారులో.. అస్పష్టంగా, గజిబిజిగా రాయడం, అక్షరాలను పదే పదే కొట్టివేయడం లాంటివీ చేయకూడదు.

5.కొంతమంది పరీక్ష ముందు రోజే మొత్తం పాఠాలను చదవాలనుకుంటారు. సమాచారాన్ని అంతా ఒకేసారి బుర్రలో నిక్షిప్తం చేసుకోవాలనుకుంటారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంతేకాదు నిద్రలేమితోపాటు, ఒత్తిడికీ గురికావడం వల్ల ఇబ్బందిపడుతూ.. మర్నాడు పరీక్ష సరిగా రాయలేకపోవచ్చు కూడా.

6.కొందరు విద్యార్థులు పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలు ముఖ్యమైనవి అనుకుని.. వాటిని మాత్రమే చదువుకుంటే సరిపోతుంది అనుకుంటారు. నిజానికి ఇవి ముఖ్యమైనవే అయినప్పటికీ వీటినే చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రతి పాఠం చివర ఇచ్చే ప్రశ్నలన్నింటినీ చదవాలి. దీంతో ప్రశ్నలను మార్చి వేరే విధంగా అడిగినా కంగారుపడకుండా సమాధానాలు రాయగలుగుతారు.

7.ఒకేసారి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. ఆ తర్వాత ఎంత కష్టపడినా దాన్ని సాధించలేకపోయామని బాధపడకూడదు. అలాగే ఆశించిన ఫలితాలు రాకపోయినా ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకూడదు. దశలవారీగా లక్ష్యసాధనకు కృషిచేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని